Khanun: తీవ్ర తుపాను ముంచుకొస్తున్న వేళ.. పౌరులకు ‘కిమ్‌’ తనదైన ఆదేశాలు!

తుపాను ముంచుకొస్తోన్న విపత్కర పరిస్థితుల్లోనూ.. ‘కిమ్‌’ వంశ పాలకుల ప్రచార చిత్రాలు, విగ్రహాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర కొరియా పౌరులకు ఆదేశాలు జారీ కావడం గమనార్హం.

Published : 10 Aug 2023 20:28 IST

ప్యొంగ్యాంగ్: ఉత్తర కొరియా (North Korea)లో పౌరులపై ఆంక్షలు, ప్రభుత్వ ఆదేశాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ‘కిమ్ రాజవంశా’న్ని దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తారు. దేశ నాయకుల విషయంలో చిన్నపాటి తప్పిదాలకూ.. కఠిన శిక్షలు తప్పవు. ఈ క్రమంలోనే కిమ్‌ ప్రభుత్వం తాజాగా పౌరులకు తనదైన ఆదేశాలు జారీ చేసింది. దేశంలోకి తుపాను ముంచుకొస్తోన్న విపత్కర పరిస్థితుల్లోనూ.. ‘కిమ్‌’ వంశ పాలకుల ప్రచార చిత్రాలు, విగ్రహాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. 

ఇప్పటికే జపాన్‌ను కుదిపేసిన టైఫూన్‌ ‘ఖానున్‌’ (Typhoon Khanun).. కొరియా ద్వీపకల్పానికి చేరుకుంది. ఈ తుపాను ప్రభావంతో దక్షిణ కొరియాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రమంలోనే ‘ఖానున్‌’.. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర కొరియాలోకి ప్రవేశించనుంది. వాస్తవానికి మౌలిక సదుపాయాల లేమితో ఉన్న ఉత్తర కొరియా.. ప్రకృతి విపత్తులతో తీవ్ర నష్టాలను చవిచూస్తుంటుంది. అటవీ నిర్మూలన.. పెద్దఎత్తున వరదలకు కారణమవుతోంది. ఇటువంటి దుర్భర పరిస్థితుల నడుమ ఈ తుపాను ఉత్తర కొరియాను తాకనుంది.

యుద్ధానికి సిద్ధంకండి.. సైన్యానికి కిమ్‌ ఆదేశాలు!

అయితే, పౌరులకు తుపాను హెచ్చరికలు జారీ చేస్తూనే.. ‘ఉత్తర కొరియన్ల ప్రధాన దృష్టి.. తమ దేశ నాయకుల ప్రచార చిత్రాలతోపాటు విగ్రహాలు, కుడ్యచిత్రాలు, ఇతర స్మారక చిహ్నాల భద్రతపై ఉండాలి’ అని అధికార పత్రిక వేదికగా కిమ్‌ ప్రభుత్వం ఆదేశించడం గమనార్హం. అదే సమయంలో.. తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల దేశ ఆర్థిక ఉత్పత్తి ప్రభావితం కాకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని