Kim Jong Un: యుద్ధానికి సిద్ధంకండి.. సైన్యానికి కిమ్‌ ఆదేశాలు!

అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియా సరి కొత్త ఆయుధాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టడంతోపాటు, దళాలను సిద్ధం చేయాలని కిమ్‌ సైన్యాన్ని ఆదేశించినట్లు సమాచారం.

Published : 10 Aug 2023 13:18 IST

ప్యాంగ్యాంగ్‌ : ఉత్తర కొరియా (North Korea) అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సైన్యాన్ని (Kim Jong Un) యుద్ధానికి సిద్ధం చేస్తున్నట్లు ఆ దేశ వార్తా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఓ కీలక సైనిక జనరల్‌ను తొలగించి ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించినట్లు వెల్లడించింది. అలాగే, ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని, సైనిక సన్నాహాలను వేగవంతం చేయాలని సూచించినట్లు తెలిపింది. గురువారం జరిగిన సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ సమావేశంలో పాల్గొన్న కిమ్‌.. శత్రువులపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని సైనికాధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ప్రస్తుతం సైనిక జనరల్‌గా ఉన్న పాక్‌-సు-ఇల్‌ (Pak Su Il) స్థానంలో కొత్త జనరల్‌గా రి యాంగ్‌ గిల్‌ (Ri Yang Gil)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికా, దక్షిణ కొరియా చేపట్టబోయే సంయుక్త సైనిక విన్యాసాలపై కిమ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.  అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియాలో తయారైన కొత్త ఆయుధాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టాలని, దళాలను సిద్ధం చేయాలని సైన్యాన్ని ఆదేశించినట్లు తెలిపింది.

ప్రధానిగా ఇమ్రాన్‌ను తప్పించాలని అమెరికా సూచించింది!

గతవారం ఆయుధ కర్మాగారాలను సందర్శించిన కిమ్‌.. క్రూజ్‌ క్షిపణి ఇంజిన్లు, మానవరహిత గగనతల వాహనాల (UAV) నిర్మాణలను త్వరితం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, భారీ దాడులకు ఉపయోగించే రాకెట్లను, కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణినీ ఆయన పరిశీలించారు. వాటితోపాటు ఆయుధ కర్మాగారాల్లో రైఫిళ్ల పనితీరును కిమ్‌ స్వయంగా పరిశీలించిన ఫొటోలను ఆ దేశ మీడియా విడుదల చేసింది. మరోవైపు ఉక్రెయిన్‌పై దాడికి రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరాల చేస్తోందని అమెరికా ఆరోపించింది. ఈ ఆరోపణలను రష్యా, ఉత్తర కొరియాలు కొట్టిపారేశాయి. రష్యాతో ఆయుధ సహకార ఒప్పందాల కోసమే కిమ్‌ ఆయుధ కర్మాగారాలను సందర్శించారని నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని