Pak Elections: ఇమ్రాన్‌ ఖాన్‌కు షాక్‌..! రెండు స్థానాల్లోనూ నామినేషన్‌ తిరస్కరణ

పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. రెండు స్థానాల నుంచి మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

Published : 30 Dec 2023 22:16 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)కు ఎన్నికల సంఘం (ECP) షాక్‌ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండు స్థానాల నుంచి ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. లాహోర్‌ (ఎన్‌ఏ- 122), మియావలీ (ఎన్‌ఏ- 89) స్థానాల నుంచి ఆయన నామినేషన్‌ వేశారు. అయితే.. తోషాఖానా అవినీతి కేసులో దోషిగా తేలడంతో ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీంతోపాటు నామినేషన్లలో ఆయనను ప్రతిపాదించిన వారు సంబంధిత నియోజకవర్గాలకు చెందినవారు కాదనే అభ్యంతరాలు, ఇతర అభియోగాలు ఉన్నాయి.

పాక్‌ ఎన్నికల్లో హఫీజ్‌ సయీద్‌ పార్టీ పోటీ.. భారత్‌ ఏమందంటే..?

వాస్తవానికి తోషాఖానా కేసులో ఇమ్రాన్‌కు ట్రయల్‌ కోర్టు విధించిన మూడేళ్ల శిక్షను ఇస్లామాబాద్‌ హైకోర్టు నిలిపేసింది. కానీ, సంబంధిత అభ్యంతరాలతో ఏకీభవించిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు.. ఆయన నామినేషన్లను తిరస్కరించినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ, మరో మాజీ మంత్రి హమ్మద్‌ అజర్‌ నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి. అయితే.. వారు తమ నామినేషన్ పత్రాల తిరస్కరణకు వ్యతిరేకంగా జనవరి 3వ తేదీ లోపు అప్పీల్ చేయొచ్చు. జనవరి 10లోపు అప్పిలేట్ ట్రైబ్యునల్ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని