పుతిన్‌ను అరెస్టు చేస్తే.. రష్యాపై యుద్ధం ప్రకటించినట్లే: దక్షిణాఫ్రికా

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Russian President Vladimir Putin)ను అరెస్టు చేయడంపై దక్షిణాఫ్రికా(South Africa) కోర్టులో దాఖలైన పిటషన్‌ విచారణ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సిరిల్‌ రమఫొస (Cyril Ramaphosa) కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ కాపీలోని కీలక అంశాలు తాజాగా వెలుగుచూశాయి. 

Updated : 19 Jul 2023 15:41 IST

డర్బన్‌: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Russian President Vladimir Putin)ను తమ దేశంలో అరెస్టు చేయడం రష్యాతో యుద్ధాన్ని ప్రకటించినట్లేనని దక్షిణాఫ్రికా ( South Africa) అధ్యక్షుడు సిరిల్‌ రమఫొస ( Cyril Ramaphosa) అన్నారు. ఈ ఏడాది మార్చిలో పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం (ICC) జారీ చేసిన అరెస్టు వారెంట్‌పై దక్షిణాఫ్రికాలోని ప్రతిపక్ష డెమోక్రటిక్‌ అలయెన్స్ అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా రమఫొస కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ కాపీలోని విషయాలను ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది.

ఐసీసీ జారీచేసిన అరెస్ట్‌ వారెంట్ ఆధారంగా దక్షిణాఫ్రికాలో పుతిన్‌ను అరెస్ట్‌ చేస్తే ఆ దేశంతో యుద్ధం ప్రకటించినట్లేనని గతంలో రష్యా స్పష్టం చేసిన విషయాన్ని ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే, రష్యాతో యుద్ధం చేయడం దక్షిణాఫ్రికా రాజ్యాంగానికి విరుద్ధమని రమఫొస కోర్టుకు తెలిపారు. ఈ నిర్ణయం రష్యా-ఉక్రెయిన్‌ మధ్య శాంతి నెలకొల్పాలన్న దక్షిణాఫ్రికా ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తుందని చెప్పారు. మరోవైపు బ్రిక్స్ దేశాల వేదికను తమ దేశం నుంచి చైనాకు మార్చడం లేదా సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించాలన్న తమ ప్రతిపాదనను బ్రిక్స్‌ దేశాలు తిరస్కరించినట్లు దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పౌల్‌ మషతిలే తెలిపారు.

USA: నిపుణుల కొరత ఉంది.. H-1B వీసాలు పెంచండి: అమెరికా ప్రభుత్వానికి కంపెనీల అభ్యర్థన

ఆగస్టులో జొహానెస్‌బర్గ్‌ వేదికగా జరిగే బ్రిక్స్ (BRICS) దేశాల సదస్సుకు పుతిన్‌ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ సభ్య దేశంగా దక్షిణాఫ్రికా పుతిన్‌ను అరెస్టు చేయాల్సి ఉంటుంది. అయితే, దీనికి వ్యతిరేకంగా ఆ దేశం గతంలో ప్రకటన విడుదల చేసింది. గత నెలలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొస.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోపాటు, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీలను కలిసి యుద్ధానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని