P7: ఈ నంబర్‌ ప్లేట్‌ ధర రూ.122 కోట్లు..!

దుబాయ్‌కు (Bubai) చెందిన ఓ కారు నంబర్‌ ప్లేట్‌ అత్యధిక ధరకు అమ్ముడుపోయి (Most Expensive Licence) రికార్డు సృష్టించింది. ‘పీ7’ అనే కారు నంబర్‌ ప్లేటును  (Number Plate) రూ.122 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Updated : 10 Apr 2023 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్నమైన వస్తువులు, ఖరీదైన వాహనాలు ఒక్కోసారి రికార్డు స్థాయి ధరలు పలుకుతూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఈ తరహాలోనే ఓ కారు నంబర్‌ ప్లేట్‌ భారీ ధర పలికి ప్రపంచ రికార్డు సృష్టించింది. దుబాయ్‌కి (dubai) చెందిన ఓ సంస్థ వేసిన వీఐపీ నంబర్‌ ప్లేట్ల (Number Plate) వేలంలో ‘పీ7’ అనే కారు నంబర్‌ ప్లేట్‌ 55 మిలియన్‌ దిర్హామ్ (సుమారు రూ.122కోట్లు)లకు అమ్ముడు పోయింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన నంబర్‌ ప్లేట్లలో (Most Expensive Licence) ఇదే అత్యధికం కావడం విశేషం.

ఖరీదైన కార్ల నంబర్‌ ప్లేట్లకు సంబంధించి దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ఓ వేలం (Auction) కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్లమంది పేదలకు ఆహారం అందించే బృహత్తర కార్యక్రమం కోసం దాదాపు 100 మిలియన్‌ ఏఈడీ (దిర్హామ్‌)లను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఎమిరేట్స్‌ ఆక్షన్‌ పేరుతో దీన్ని రూపొందించారు. ఇందులో భాగంగా జుమైరాలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌లో వేలం కార్యక్రమం నిర్వహించారు. దీన్ని  యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ ప్రారంభించారు. ఇందులో ‘పీ7’ నంబర్‌ ప్లేట్‌ కోసం ఎంతోమంది బిడ్డర్లు పోటీ పడ్డారు. చివరకు 55మిలియన్‌ దిర్హామ్‌ల వద్ద ఓ వ్యక్తి ఈ నంబర్‌ ప్లేట్‌ను సొంతం చేసుకొని రికార్డు సృష్టించాడు.

‘పీ7’ తరహాలోనే ‘AA22’ నంబర్‌ ప్లేట్‌ కూడా సుమారు రూ.18కోట్లకు అమ్ముడుపోయింది. ఏఏ19కు సుమారు రూ.10కోట్లకు ఖరీదు చేయగా.. హెచ్‌31, డబ్ల్యూ78, ఎన్‌41, ఎక్స్‌36, జెడ్‌37, ఏఏ80 నంబర్‌ ప్లేట్లు కూడా భారీ ధర పలికినట్లు వేలం నిర్వహించిన సంస్థ వెల్లడించింది. వీటితోపాటు కొన్ని మొబైల్‌ నంబర్లను కూడా వేలం ద్వారా విక్రయించారు. అయితే, కార్ల నంబర్‌ ప్లేటుకు సంబంధించి ఏఈడీ 52.5మిలియన్‌లతో అబుదాబీ నంబర్‌ ‘ప్లేట్‌ 1’ సొంతం చేసుకున్న రికార్డును తాజాగా ‘పీ7’ నంబర్‌ తిరగరాసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని