Maldives: మాల్దీవుల్ని వీడిన భారత సైనిక సిబ్బంది..! హెలికాప్టర్‌ బాధ్యతలు నిపుణుల బృందానికి..

మాల్దీవుల్లో హెలికాప్టర్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత సైనిక సిబ్బంది స్వదేశానికి బయల్దేరినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

Published : 11 Mar 2024 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాల్దీవుల (Maldives) నుంచి భారత బలగాలు వెనక్కి వచ్చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తొలి విడతగా అక్కడ హెలికాప్టర్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మన సైనిక సిబ్బంది స్వదేశానికి పయనమైనట్లు సమాచారం. ‘మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ (MNDF)’ ప్రతినిధిని ఉటంకిస్తూ స్థానిక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. అడ్డూ నగరంలోని భారత సైనికులు ఆ దేశానికే చెందిన సాధారణ పౌర నిపుణుల బృందానికి హెలికాప్టర్‌ బాధ్యతలు అప్పగించి, తిరుగుపయనమైనట్లు ఆయన చెప్పారని పేర్కొంది. సైనిక సిబ్బంది ఉపసంహరణపై భారత రక్షణశాఖ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

మళ్లీ నోరుపారేసుకున్న ముయిజ్జు.. సివిల్‌ డ్రెస్సుల్లోనూ ఉండొద్దట..!

మహమ్మద్‌ ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. తమ దేశంలో విధులు నిర్వర్తిస్తోన్న భారత బలగాలు మే 10నాటికి వెనక్కి వెళ్లిపోవాలని ఆయన సూచించారు. ఆ తర్వాత ఆ దేశానికి చెందిన ఒక్క మిలిటరీ సిబ్బంది కూడా తమ భూభాగంలో ఉండకూడదన్నారు. కనీసం సివిల్‌ డ్రెస్సుల్లో కూడా ఇక్కడ సంచరించొద్దంటూ నోరుపారేసుకున్నారు. అయితే.. తమ బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బందిని నియమించేందుకు దిల్లీ పెట్టిన షరతును మాలే అంగీకరించింది. దీంతో గత వారమే భారత సాంకేతిక బృందం ఆ దీవులకు చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని