Imran: శిక్ష నిలిపివేసినా ఇమ్రాన్‌కు దక్కని ఊరట.. మరోకేసులో జైలుకే వచ్చి విచారించిన జడ్జి

పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ట్రయల్‌ కోర్టు విధించిన మూడేళ్ల జైలుశిక్షను అక్కడి హైకోర్టు నిలిపివేయడంతో ఆయన జైలు నుంచి బయటకు వస్తారని భావించినప్పటికీ.. ఆయనకు (Imran Khan) మాత్రం ఊరట లభించలేదు.

Published : 30 Aug 2023 14:27 IST

ఇస్లామాబాద్‌: తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ట్రయల్‌ కోర్టు విధించిన మూడేళ్ల జైలుశిక్షను అక్కడి హైకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన జైలు నుంచి బయటకు వస్తారని భావించినప్పటికీ మాజీ ప్రధానికి (Imran Khan) మాత్రం ఊరట లభించలేదు. అధికారిక రహస్యాలను బహిరంగ పరిచారన్న ఆరోపణలపై నమోదైన మరో కేసుకు సంబంధించి జైల్లోనే విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి.. ఇమ్రాన్‌కు సెప్టెంబర్‌ 13 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. దీంతో ఇమ్రాన్‌ జైలుకే పరిమితమయ్యారు.

ప్రస్తుతం ఇమ్రాన్‌ ఖాన్‌ పంజాబ్‌ ప్రావిన్సులోని అటక్‌ జైల్లో ఉన్నారు. తోషాఖానా కేసులో హైకోర్టు శిక్షను నిలిపివేయడం, మరో కేసులో ఆయన విచారణ ఎదుర్కోవాల్సి రావడంతో.. ఇమ్రాన్‌ను బయటకు తరలిస్తే భద్రతా సమస్యలు  ఏర్పడతాయని అంతర్గత వ్యవహారాల శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సైఫర్‌ కేసుపై జైల్లోనే విచారణ జరపాలని పాక్‌ న్యాయశాఖ నిర్ణయించింది. దీంతో న్యాయమూర్తి అబ్దుల్‌ హస్నత్‌ జుల్కర్నియన్‌.. అటక్‌ జైలుకే వచ్చి విచారణ జరిపారు. అనంతరం ఇమ్రాన్‌కు సెప్టెంబర్‌ 13వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు.

రష్యా నుంచి కాలు బయటపెట్టనున్న పుతిన్‌.. అరెస్టు వారెంట్ తర్వాత తొలిసారి..!

మరోవైపు తోషాఖానా అవినీతి కేసులో ఆయనకు జిల్లా కోర్టు ఈ నెల 5న విధించిన మూడేళ్ల జైలుశిక్షను ఇస్లామాబాద్‌ హైకోర్టు సస్పెండ్‌ చేసింది. రూ.లక్ష పూచీకత్తుపై ఖాన్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు తమ అధినేతకు ఉపశమనం దొరికిందని పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ భావించినప్పటికీ.. వారి ఆశలు గల్లంతయ్యాయి. సైఫర్‌ కేసు విచారణతో ఆయన జైలుకే పరిమితం కావాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని