Gaza: సొంతవారు.. ప్రమాదాలు.. 17శాతం మంది ఇజ్రాయెల్‌ సైనికుల మరణాలు ఇలానే..!

ఇజ్రాయెల్‌ సైనికుల్లో దాదాపు చాలా మంది ఫ్రెండ్లీ ఫైర్‌లో మరణించారు. ఈ విషయాన్ని ఐడీఎఫ్‌ ప్రకటించింది. మరోవైపు 2024 ఏడాది మొత్తం గాజాలో యుద్ధం చేసేందుకు వీలుగా దళాల్లో ఇజ్రాయెల్‌ కీలక మార్పులు చేసింది. 

Published : 01 Jan 2024 15:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సముద్రాలు ఈదిన వారు పిల్ల కాలువలో పడి మరణించినట్లుంది ఇజ్రాయెల్‌ పరిస్థితి. ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా పేరున్న ఐడీఎఫ్‌ సైనికుల్లో 17శాతం మంది అకారణంగా చనిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ గాజాలో చేపట్టిన భూతల దాడుల్లో 170 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 29 మంది ఫ్రెండ్లీఫైర్‌ (సొంత దళాల కాల్పులు) ప్రమాదాల్లో మరణించారు. ఈ డేటాను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) స్వయంగా వెల్లడించింది. 

ఈ 29 మంది సైనికుల్లో 18 మంది సొంత దళాలు, ట్యాంకులు, విమానాలు జరిపిన దాడుల్లో చనిపోయారు. తొమ్మిది మంది భవనాల కూల్చివేతల సమయంలో శకలాలుపడి, ఆయుధాలు ప్రమాదవశాత్తూ పేలి, వాహనాలు ఢీకొన్న ఘటనల్లో కన్నుమూశారు. 

ఎరుపెక్కిన ఎర్రసముద్రం

యుద్ధం మొదలైన నాటి నుంచి ప్రతివారం ఇటువంటి ఘటనల్లో కనీసం ఇద్దరు నుంచి ఆరుగురు వరకు మరణించారు. గాజా వంటి కిక్కిరిసిన ప్రదేశంలో భారీ సంఖ్యలో దళాలు రంగంలోకి దిగడం, సైనికుల మధ్య కమ్యూనికేషన్లలో లోపాలు, కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వంటివే వీటికి ప్రధాన కారణాలు. 

గాజా నుంచి ఐదు బ్రిగేడ్లను వెనక్కి పంపిన ఇజ్రాయెల్‌..

గాజాలో భూతల దాడుల్లో విజయాలు సాధించడంతో ఇజ్రాయెల్‌ దళాల సంఖ్యను తగ్గించింది. మొత్తం ఐదు బ్రిగేడ్లను వెనక్కి పంపాలని నిర్ణయించింది. 2024లో ఇజ్రాయెల్‌ దళాలు హమాస్‌తో పోరాడాల్సి రావచ్చన్న అంచనాలున్నాయి. ‘‘ఆయా ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడ పోరాట విధానాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఈ యుద్ధం సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్లే మేము సిద్ధమవుతున్నాం. సైన్యం విషయంలో స్మార్ట్‌ మేనేజ్‌మెంట్‌ విధానాలు అవలంబిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థ పుంజుకొనేట్లు చేసేందుకు, శిక్షణకు వీలుగా రిజర్విస్టులను వెనక్కి పంపిస్తున్నాం. ఇక గాజాలోని ఖాన్‌ యూనిస్‌లో హమాస్‌కు అత్యంత కీలకమైన నుఖ్బా ఫోర్సు కీలక నాయకులను ఆదివారం మట్టుబెట్టాము. మరికొందరు లొంగిపోయారు. ఈ దళంలో అక్టోబర్‌ 7వ తేదీన జరిగిన దాడిలో పాల్గొంది’’ అని ఐడీఎఫ్‌ ప్రతినిధి డానియల్‌ హగారీ వెల్లడించారు. 

ఇక ఇజ్రాయెల్‌ దాడుల్లో కనీసం 21 వేల మంది మంది ప్రజలు చనిపోయినట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. వీటిల్లో  హమాస్‌ రాకెట్లు గురితప్పి గాజాపైన పడటంతో మరణించి వారు కూడా ఉన్నారు. ఐడీఎఫ్‌ లెక్కల ప్రకారం 8,500 మంది హమాస్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. 

మరోవైపు ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులు కూడా గణనీయంగా తగ్గాయి. డిసెంబర్‌ తొలి వారంలో రోజుకు 75 రాకెట్లను హమాస్‌ ప్రయోగించగా.. ఆ సంఖ్య డిసెంబర్‌ చివరి వారం నాటికి రోజుకు 14 రాకెట్లకు పడిపోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని