Imran Khan: ఇమ్రాన్‌ను వేరే జైలుకు మార్చండి..హైకోర్టులో పీటీఐ పిటిషన్‌

జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌ ఖాన్‌ను (Imran Khan) అక్కడి నుంచి వేరే చోటుకి తరలించాలని పీటీఐ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Published : 07 Aug 2023 17:15 IST

ఇస్లామాబాద్‌: తోషఖానా (Toshakhana) కేసులో జైలు పాలైన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను (Imran Khan) వేరే కారాగారానికి తరలించాలని పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ (పీటీఐ) డిమాండ్‌ చేసింది. ఆయన్ను పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అట్టోక్‌ జైలు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించాలని కోరుతూ ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆయన గత నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యున్నత సదుపాయాలు కలిగిన అడియాలా కారాగారానికి మార్చాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, వ్యక్తిగత వైద్యుడు డా.ఫైజల్‌ సుల్తాన్‌ తరచూ ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతించాలని కోరింది. పార్టీ అధ్యక్షుడిగా న్యాయవాదులు, కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపే హక్కు ఆయనకు ఉంటుందని పేర్కొంది.

ఇమ్రాన్‌.. తోషఖానా స్కామ్‌ అంటే?

ఇమ్రాన్‌ ఖాన్‌ సంపన్న కుటుంబంలో పుట్టిన వారని, విదేశాల్లో ఉన్నత చదువులు చదివారని, అంతేకాకుండా పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు వహించి దేశానికి పేరు తీసుకొచ్చారని పీటీఐ తన పిటిషన్‌లో గుర్తు చేసింది. ఆయన సామాజిక, రాజకీయ స్థాయిని దృష్టిలో ఉంచుకొని జైల్లో సదుపాయాలు కల్పించాలని కోరింది. తోషఖానా కేసులో ఇస్లామాబాద్‌ ట్రయల్‌ కోర్టు శనివారం ఇమ్రాన్‌ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే.. లాహోర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు ఇమ్రాన్‌ను అరెస్టు చేశారు. రావల్పిండి కోర్టులో ఆయన్ను ఉంచాలని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. అట్టోక్‌ పట్టణంలో ఉన్న జైలుకు తరలించారు. దీనిపై తాజాగా పీటీఐ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. 

పాక్‌ ప్రముఖులు ఎవరైనా ఉన్నత పదవుల్లో ఉండి విదేశాల నుంచి బహుమతులు అందుకుంటే.. పదవి నుంచి వైదొలగిన తర్వాత వాటిని తోషాఖానాలో జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే నిబంధనల ప్రకారం నిర్దేశించిన ధర చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు. కానీ, ఇమ్రాన్‌ఖాన్‌ మాత్రం చాలా తక్కువ ధర చెల్లించి వాటిని తన వద్దే ఉంచుకున్నారని, మరికొన్నింటిని తోషఖానాకు తెలియకుండా విదేశాల్లోనే అమ్మేశారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా దాదాపు 11.9 కోట్ల పాకిస్థాన్‌ రూపాయల విలువైన బహుమతులను చాలా తక్కువ మొత్తంలో చెల్లించి తీసుకున్నారన్నది ఆరోపణ. దీనిపైనే శనివారం కోర్టు తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని