Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌కు ‘పెళ్లి’ తంటా.. మరో 7ఏళ్ల జైలు

Imran Khan: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈసారి ఆయనకు ‘పెళ్లి’ విషయంలో తంటాలు ఎదురయ్యాయి.

Published : 03 Feb 2024 17:40 IST

ఇస్లామాబాద్‌: జైల్లో ఉన్న పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)ను కష్టాలు వీడట్లేదు. ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్షలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలకు విరుద్ధంగా ‘నిఖా (పెళ్లి)’ చేసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఇమ్రాన్‌, ఆయన భార్య బుష్రా బీబీ (Bushra Bibi)కి పాక్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

బుష్రా బీబీ మొదటి భర్త ఖవార్‌ ఫరీద్‌ పెట్టిన కేసుపై ట్రయల్‌ కోర్టు తాజాగా విచారణ జరిపింది. ఇస్లామిక్‌ నిబంధనల ప్రకారం భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవాలంటే కొంతకాలం విరామం తీసుకోవాలి. ఈ నిబంధనలను తన మాజీ భార్య బుష్రా ఉల్లంఘించిందని ఫరీద్‌ ఆమెపై కేసు పెట్టారు. అంతేగాక, పెళ్లికి ముందునుంచే బుష్రా, ఇమ్రాన్‌ల మధ్య బంధం కొనసాగిందని ఆరోపించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇమ్రాన్‌ దంపతులకు ఏడేళ్లు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. బుష్రా బీబీ 2017 నవంబరులో ఫరీద్‌ నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2018 జనవరిలో ఇమ్రాన్‌ను వివాహం చేసుకున్నారు.

పాక్‌లో సైన్యమే అత్యంత నమ్మకమైన సంస్థ

కాగా.. తోషఖానా కేసులో ఇప్పటికే వీరిద్దరికీ 14 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అంతకుముందు అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులోనూ ఇమ్రాన్‌కు పదేళ్లు శిక్ష విధించారు. పాక్‌లో ఈనెల 8న ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఆయనకు వరుసగా శిక్షలు పడటం పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని