Heart Attack: ఒకేరోజు 6 సార్లు ఆగిన గుండె.. చివరకు ఏం జరిగిందంటే..?

ఓ ఇండో-అమెరికన్‌ విద్యార్థి గుండె ఒకేరోజు ఆరుసార్లు ఆగినప్పటికీ.. వైద్యుల కృషితో తిరిగి కోలుకున్న ఘటన లండన్‌లో చోటుచేసుకుంది.

Published : 06 Oct 2023 01:34 IST

లండన్‌: ఓ ఇండో- అమెరికన్‌ విద్యార్థి గుండె ఒకేరోజు ఆరుసార్లు ఆగిన ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో అంతరాయం కారణంగా అతడి ఆరోగ్య పరిస్థితి విషమించినప్పటికీ.. లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ వైద్య బృందం ప్రయత్నాలతో ప్రాణాపాయం తప్పింది. రెండు వారాల చికిత్స తర్వాత అతడు పూర్తి ఆరోగ్యంతో బయటకు వచ్చాడు. ఇలా మరణం అంచుకు వెళ్లిన తనను వైద్య సిబ్బంది ఎంతో శ్రమించి కాపాడారని.. వారి కృషిని ఎన్నడూ మరవలేనన్నాడు. అంతేకాదు.. తాను కూడా మెడిసిన్‌ పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.

అమెరికాకు చెందిన అతుల్‌ రావు.. లండన్‌లోని ఇంపీరియల్‌ మెడికల్‌ కాలేజీలో ప్రీ-మెడికల్‌ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. జులై 27న అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ గార్డు.. అతడికి సీపీఆర్‌ (CPR) చేసే ప్రయత్నం చేశాడు. తోటి విద్యార్థుల సమాచారంతో అంబులెన్స్‌ కూడా క్షణాల్లో అక్కడకు చేరుకుంది. అనంతరం అతడి హృదయం కొట్టుకుంటున్నట్లు అంబులెన్సులోని పారామెడికల్‌ సిబ్బంది గుర్తించారు. సమీపంలోని హృదయాలయానికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు.. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకడుతుండటంతో హృదయానికి రక్తం సరఫరాలో ఆటంకం కలుగుతోందని గుర్తించారు. ఇలా రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతినడంతోనే (Pulmonary Embolism) గుండెపోటుకు దారితీస్తున్నట్లు అనుమానించారు. ఆ క్రమంలో కొన్ని గంటల వ్యవధిలోనే ఆ విద్యార్థి హృదయం ఆరుసార్లు ఆగిపోయిందని వైద్యులు వెల్లడించారు.

విద్యార్థుల వింత ప్రవర్తన.. మాస్‌ హిస్టీరియా కావొచ్చని అనుమానం!

అతుల్‌ని రక్షించేందుకు తీవ్రంగా కృషి చేసిన  వైద్యులు.. ఎప్పటికప్పుడు అతడి హృదయ స్పందనలను పర్యవేక్షించారు. ఇలా తదుపరి 24గంటల్లో మొత్తం ఐదుసార్లు గుండె ఆగిపోయినట్లు గుర్తించారు. రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఔషధాలు అందించడం మొదలుపెట్టారు. ఎక్మో (ECMO) అవసరం పడుతుండవచ్చని సమీపంలోని సెయింట్‌ థామస్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఔషధాల పనితీరు, వైద్యుల కృషితో అతడి ఆరోగ్యం మెల్లగా కుదుటపడింది. ఎక్మో అవసరం లేకుండానే అతుల్‌ కోలుకున్నాడు. అలా రెండు వారాల తర్వాత సెయింట్‌ థామస్‌ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అవడంతో వైద్యులు, అతడి కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.

అతుల్‌ తండ్రి అజయ్‌.. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లి శ్రీవిద్య. సియాటెల్‌లో గణితం ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.  తమ కుమారుడిని రక్షించిన లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ హెల్త్‌కేర్‌ ఆసుపత్రి సందర్శించిన వీరు.. అతుల్‌ ప్రాణాలు కాపాడిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇంపీరియల్‌ కాలేజీ హెల్త్‌కేర్‌ కూడా తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని