Israel: ఇజ్రాయెల్‌ అనూహ్య నిర్ణయం.. మొసాద్‌ బృందాలను వెనక్కి రప్పించిన నెతన్యాహు

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన నేపథ్యంలో ఖతార్‌లోని తమ మధ్యవర్తులను ఇజ్రాయెల్‌ ఆగమేఘాల మీద వెనక్కి రప్పించింది.

Published : 02 Dec 2023 22:02 IST

జెరూసలెం: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ గడువు ముగిసిన నేపథ్యంలో ఖతార్‌లోని తమ మధ్యవర్తులను ఇజ్రాయెల్‌ వెనక్కి రప్పించింది. ఆ రెండు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి,  ఆ తర్వాత దాని గడవు పొడిగించడానికి ఖతార్‌లోని ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొసాద్‌కు చెందిన మధ్యవర్తులు కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆ గడువు శుక్రవారం ఉదయంతో ముగిసింది. ఈ లోగా హమాస్‌ ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు దిగడంతో ఇజ్రాయెల్‌ మరోసారి భూతల దాడులను ఉద్ధృతం చేసింది. ఫలితంగా బందీల విడుదల నిలిచిపోయింది.

తాజా పరిస్థితుల నేపథ్యంలో కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినవారు ఖతార్‌లో ఉండటం శ్రేయస్కరం కాదని భావించిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సత్వరమే వాళ్లను స్వదేశానికి రప్పించాలని మొసాద్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బార్నెయాను ఆదేశించారు. హమాస్‌ సంస్థ ఖతార్‌ కేంద్రంగానే తమ ఉగ్రకార్యకలాపాలను నిర్వహిస్తుండటమే ఇందుకు కారణం. ప్రధాని ఆదేశాల మేరకు దోహాలో ఉన్న ఇజ్రాయెల్‌ మధ్యవర్తులంతా స్వదేశానికి పయనమైనట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. 

అక్టోబర్‌ 24న ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య గాజాలో కాల్పుల విరమణ, బందీల బదిలీ ఒప్పందం జరగడంతో వారం రోజుల పాటు దాడులు చోటుచేసుకోలేదు. తొలుత నాలుగు రోజులే ఒప్పందం చేసుకున్నప్పటికీ, అనంతరం బందీల విడుదల కోసం ఈ వ్యవధిని పెంచారు. ఈ గడువు శుక్రవారం ఉదయంతో ముగిసింది. కాల్పుల విరమణను ఇంకా కొన్నిరోజులపాటు కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ దాడులు మళ్లీ ప్రారంభమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని