Israel: ఇజ్రాయెల్‌ వైఖరితో ప్రపంచ శాంతికి ముప్పు: గుటెరస్‌

Israel: ఇజ్రాయెల్‌- హమాస్ ఘర్షణలకు పరిష్కారం స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటేనని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ అన్నారు. లేదంటే ప్రపంచ శాంతి ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.

Published : 24 Jan 2024 11:09 IST

న్యూయార్క్‌: స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటును ఇజ్రాయెల్‌ (Israel) ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వ్యతిరేకించడాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ తప్పుబట్టారు. ఈ వైఖరి మారకపోతే.. ప్రపంచ శాంతికి సవాల్‌ విసురుతున్న ఇరు దేశాల వివాదం సుదీర్ఘకాలం కొనసాగే ప్రమాదం ఉందని తెలిపారు. చాలా చోట్ల తీవ్రవాద సంస్థలు పుట్టుకు రావొచ్చని హెచ్చరించారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘పాలస్తీనా (Palestina) ప్రజల స్వతంత్ర దేశ ఏర్పాటు హక్కును ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే. రెండు దేశాల ఏర్పాటు పరిష్కారాన్ని ఎవరు నిరాకరించినా ఆ నిర్ణయాన్ని తిరస్కరించాల్సిందే. ఎలాంటి స్వతంత్రం, హక్కులు, గౌరవం లేకుండా అంతమంది పాలస్తీనా ప్రజలు ఒక ప్రాంతంలో ఉండడం అసలు ఊహించలేం’’ అని గుటెరస్‌ అన్నారు. హమాస్‌- ఇజ్రాయెల్‌ ఘర్షణలు.. ప్రాంతీయంగా అల్లకల్లోలానికి దారితీస్తాయనే అంచనాలు నిజమవుతున్నాయని తెలిపారు. అందుకు ఇటీవల లెబనాన్‌, యెమెన్‌, సిరియా, ఇరాక్‌, పాకిస్థాన్‌లో జరిగిన దాడులను ఉదాహరణగా చూపారు. వెంటనే ఇరు పక్షాలు కాల్పుల విరమణ పాటించాలని సూచించారు.

ఇజ్రాయెల్‌కు భారీ షాక్‌

గుటెరస్‌ కాల్పుల విరమణ పిలుపును ఐరాసలోని ఇజ్రాయెల్ (Israel) రాయబారి గిలద్‌ ఎర్డన్ తిరస్కరించారు. 2023 అక్టోబర్‌ 7న తమపై అత్యంత క్రూరంగా దాడి చేసిన హమాస్‌ (Hamas)పై పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఏమాత్రం వెనక్కి తగ్గినా హమాస్‌ మిలిటెంట్లు మరింత రెచ్చిపోయి ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడతారని తెలిపారు. ఈ వివాదానికి మూలం ఇరాన్‌లోనే ఉందని ఆరోపించారు. హమాస్‌, హెజ్‌బొల్లా, హౌతీలకు ఆ దేశమే ఆయుధాలు సరఫరా చేస్తోందన్నారు.

ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ (Israel) దాడుల్లో 25 వేల మంది పాలస్తీనా పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. దాదాపు 85 శాతం మంది ప్రజలు వలస వెళ్లారని తెలిపారు. మిగిలిన వారు తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని