Kim Jong Un: కొత్త సంవత్సరంలో కిమ్‌ లక్ష్యాలివే..!

Kim Jong Un: కొత్త ఏడాదిలో సైనికపరంగా మరింత బలోపేతం కావడానికి ప్రయత్నిస్తామని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించారు. అమెరికా సహా ఇతర దేశాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తిప్పికొట్టే సామర్థ్యాన్ని సాధిస్తామని తెలిపారు.

Updated : 31 Dec 2023 13:37 IST

సియోల్‌ (దక్షిణ కొరియా): నూతన సంవత్సరం నేపథ్యంలో ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) తన తదుపరి లక్ష్యాలను ప్రకటించారు. అమెరికా నేతృత్వంలోని ఘర్షణాత్మక ఎత్తుగడలను ఎదుర్కోవడానికి యుద్ధ సంసిద్ధత కోసం ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయాలను ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్‌ఏ ఆదివారం వెల్లడించింది.

కేసీఎన్‌ఏ వివరాల ప్రకారం.. కొత్త ఏడాదిలో మరో మూడు అదనపు సైనిక నిఘా ఉపగ్రహాలను పరీక్షిస్తామని కిమ్ (Kim Jong Un) ప్రతినబూనారు. అలాగే మరిన్ని అణ్వస్త్రాలనూ సమకూర్చుకుంటామని ప్రకటించారు. అత్యాధునిక మానవ రహిత పరికరాలనూ ప్రవేశపెడతామని వెల్లడించారు. అధికార వర్కర్స్‌ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఏడాది ప్రభుత్వ లక్ష్యాలను ఆయన ప్రకటించారు. 

అమెరికాతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సవాళ్ల నేపథ్యంలో తమ ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకుంటామని కిమ్‌ (Kim Jong Un) పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో కొత్త ఆయుధాల ప్రయోగ పరీక్షల పరంపర నూతన ఏడాదిలోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉత్తర కొరియాకు (North Korea) వ్యతిరేకంగా అమెరికా, దాని మిత్రదేశాలు ఈ ఏడాది అనూహ్య చర్యలు తీసుకున్నాయని అన్నారు. తద్వారా కొరియా ద్వీపకల్పాన్ని అణుయుద్ధం అంచుకు నెట్టాయని వ్యాఖ్యానించారు.

ఈ పరిస్థితుల్లో యుద్ధ ప్రతిస్పందన సామర్థ్యాలను పొందడం తమకు అత్యావశ్యకమని కిమ్‌ (Kim Jong Un) అన్నారు. శత్రువులు తమని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే.. వాటిని దీటుగా తిప్పికొట్టేందుకు సమగ్ర, పరిపూర్ణమైన సైనిక సంసిద్ధత తమకు అవసరమని వ్యాఖ్యానించారు. 

2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో చర్చలు విఫలమైన తర్వాత కిమ్‌ (Kim Jong Un) తమ ఆయుధ సంపత్తిని మరింత పెంచుకునే పనిలో పడ్డారు. గత ఏడాది వ్యవధిలో ఉత్తర కొరియా 100కు పైగా బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో చాలా వరకు అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నవే. వీటికి దీటుగా అమెరికా, దక్షిణ కొరియా కలిసి తమ సైనిక కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. అందులో భాగంగా బాంబర్లు, విమాన వాహన నౌకలు, అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన జలాంతర్గాములను రంగంలోకి దింపాయి. అయితే, ఈ ఇరు దేశాల చర్యలను.. తమని ఆక్రమించడానికి చేస్తున్న ప్రయోగాలుగా కిమ్‌ పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని