Spy Satellite: ‘కిమ్‌’ దూకుడు.. మరోసారి నిఘా ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధం!

నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఉత్తర కొరియా మరోసారి సిద్ధమవుతున్నట్లు దక్షిణ కొరియా తెలిపింది. మే నెలలో చేపట్టిన మొదటి ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే.

Published : 17 Aug 2023 17:08 IST

సియోల్‌: గతంలో విఫలమైన నిఘా ఉపగ్రహం (Spy Satellite) ప్రయోగాన్ని మరోసారి చేపట్టేందుకు ఉత్తర కొరియా (North Korea) సిద్ధమవుతోందా..! అవుననే అంటోంది దక్షిణ కొరియా. దీంతోపాటు వచ్చే వారం అమెరికా, దక్షిణ కొరియాలు చేపట్టనున్న సంయుక్త సైనిక విన్యాసాలకు నిరసనగా.. ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ICBM) ప్రయోగాలూ నిర్వహించే అవకాశం ఉందని పేర్కొంది.

‘తమ జాతీయ దినోత్సవం (సెప్టెంబరు 9) పురస్కరించుకుని.. ఆగస్టు చివర్లో లేదా, సెప్టెంబరు ప్రారంభంలో ఉత్తర కొరియా తన నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. దీని కోసం రాకెట్ ఇంజిన్‌ను పరీక్షిస్తోంది. ఉపగ్రహ సమాచారాన్ని స్వీకరించేందుకు నేలపై అదనపు యాంటెన్నా కూడా ఏర్పాటు చేసింది’ అని దక్షిణ కొరియా నిఘా విభాగం (NIS) తమ చట్టసభ్యులకు సమాచారం అందించింది. దీంతోపాటు ఖండాంతర క్షిపణి ఉత్పత్తి కేంద్రాల వద్ద పెద్దఎత్తున కార్యకలాపాలను గుర్తించినట్లు తెలిపింది. అమెరికా- దక్షిణ కొరియా- జపాన్ త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశంతోపాటు అమెరికా- దక్షిణ కొరియా సైనిక విన్యాసాలకు నిరసనగా ఈ ప్రయోగ సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొంది.

దూసుకొస్తున్న కార్చిచ్చు.. ఖాళీ అవుతోన్న నగరం..!

ఇదిలా ఉండగా.. మే నెల చివర్లో ‘మల్లిగ్యాంగ్‌- 1’ నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించాలన్న ఉత్తర కొరియా ప్రయత్నం విఫలమైన విషయం తెలిసిందే. రెండు దశల అనంతరం రాకెట్‌ ఇంజిన్‌లు థ్రస్ట్‌ను కోల్పోవడంతో సముద్రంలో కూలిపోయింది. తాజాగా మరోసారి ఈ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు ఎన్‌ఐఎస్‌ తెలిపింది. మరోవైపు.. అమెరికా, దక్షిణ కొరియాల సైనిక విన్యాసాలకు ప్రతిగా ఉ.కొరియాలో తయారైన కొత్త ఆయుధాలతో యుద్ధ విన్యాసాలు చేపట్టాలని కిమ్‌ ఇప్పటికే తన సైన్యాన్ని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని