North Korea: సరికొత్త క్షిపణి ఇంజిన్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా..!

ఉత్తర కొరియా మరో సరికొత్త శ్రేణి క్షిపణి ఇంజిన్‌ను పరీక్షించింది. ఆ దేశంపై  ఇప్పటికే ఐరాస అంక్షలు ఉన్నా ఈ పరీక్ష జరగడం గమనార్హం. ఇది తమ వ్యూహాత్మక దాడి సామర్థ్యాన్ని పెంచుతుందని ఉత్తరకొరియా చెబుతోంది. 

Updated : 15 Nov 2023 13:42 IST

ఇంటర్నెట్‌డెస్క్: విమర్శలను లెక్కచేయకుండా ఉత్తర కొరియా క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. తాజాగా కిమ్‌ సర్కారు ఓ మధ్యశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి కోసం ఘన ఇంధనం ఆధారంగా నడిచే ఇంజిన్‌ను పరీక్షించింది. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ ప్రకటించింది. ఈ క్షిపణుల వినియోగానికి సంబంధించి ఉత్తరకొరియాపై ఆంక్షలు ఉన్నాయి.

‘‘ఉత్తర కొరియా మరోసారి మధ్యశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణుల (ఐఆర్‌బీఎం) కోసం సరికొత్త హై థ్రస్ట్‌ సాలిడ్‌ ఫ్యూయల్‌ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. ఇవి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనవి. ఈ పరీక్షతో నమ్మకమైన, ఆధారపడదగిన ఐఆర్‌బీఎంల తయారీ వేగవంతం అవుతుంది’’ అని కేసీఎన్‌ఏ పత్రిక పేర్కొంది. ఈ పరీక్ష నవంబర్‌ 11-14 మధ్యలో జరిగినట్లు వెల్లడించింది.

ఆరేళ్ల తర్వాత అమెరికాలో అడుగుపెట్టిన జిన్‌పింగ్‌.. నేడు బైడెన్‌తో భేటీ

ఈ పరీక్షలపై కేసీఎన్‌ఏ కథనం ప్రకారం ఉత్తరకొరియా జనరల్‌ మిసైల్‌ బ్యూరో స్పందిస్తూ.. ‘‘దేశం అత్యంత దారుణమైన అస్థిర పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో వ్యూహాత్మక దాడులు చేసే సామర్థ్యాన్ని సైన్యానికి అందించడంలో ఈ పరీక్షలు చాలా కీలకం’’ అని పేర్కొంది.  క్షిపణుల్లో ఘన ఇంధన ఇంజిన్ల వినియోగంతో వాటి రవాణా తేలికవుతుంది. అంతేకాదు.. వీటిని ప్రయోగించడం కూడా తేలిక. ఈ ఫీచర్ల కారణంగా ఈ క్షిపణులను గుర్తించడం కూడా ప్రత్యర్థులకు కష్టంగా మారుతుంది. ఇటీవల కాలంలో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను వేగవంతం చేసింది. కొన్నాళ్ల క్రితమే తొలిసారి ఘన ఇంధన సాయంతో ప్రయోగించే ఖండాంతర క్షిపణి, సబ్‌మెరైన్‌ నుంచి ప్రయోగించే మిసైల్‌ను పరీక్షించింది. వాస్తవానికి ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలపై ఐరాస ఆంక్షలు ఉన్నాయి.

మరో వైపు రష్యా సహజవనరుల శాఖ మంత్రి అలెగ్జాండర్‌ కొజెలోవ్‌ ప్యాంగ్యాంగ్‌లో పర్యటిస్తున్న సమయంలోనే ఈ పరీక్ష జరపడం గమనార్హం. ఆయన పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, టెక్నాలజీ వంటి అంశాల్లో సహకారంపై చర్చలు జరుగుతున్నాయి. మరో వైపు రష్యాకు ఈ దేశం నుంచి భారీగా ఆయుధాలు సరఫరా అవుతున్నాయి. ఆగస్టులోనే దాదాపు 10లక్షల ఫిరంగి గుండ్లను ఉత్తర కొరియా పంపించి ఉండవచ్చని దక్షిణ కొరియా నిఘా విభాగం ఇటీవల అంచనా వేసింది. నౌకలు, ఇతర మార్గాల ద్వారా ఈ ఫిరంగి గుండ్లు తరలించినట్లు దక్షిణ కొరియా (South Korea) జాతీయ నిఘా విభాగం భావిస్తున్నట్లు స్థానిక చట్టసభ సభ్యుడు యూ సాంగ్‌-బుమ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని