North Korea: రాకెట్‌ దశను గాల్లోనే పేల్చేసిన ఉ.కొరియా.. ఎందుకంటే..?

ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగంలో తొలిదశ పరికరాలు సముద్రంలో పడకముందే పేల్చేశారు. కిమ్‌ సర్కారు వ్యూహాత్మకంగానే ఈ చర్యకు పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు. 

Published : 26 Nov 2023 11:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల ఉత్తర కొరియా(North Korea)లోని కిమ్‌ సర్కార్‌ ఒక నిఘా ఉపగ్రహాన్ని విజయంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనిని ప్రయోగించే సమయంలో ఎలాంటి ఆధారాలు, పరికరాలు.. అమెరికా, దక్షిణ కొరియాలకు చిక్కకుండా ఉత్తరకొరియా చాలా జాగ్రత్తలు తీసుకొంది.  ఈ విషయాన్ని స్పేస్‌ డాట్‌కామ్‌ వెలుగులోకి తెచ్చింది. ఈ ఉపగ్రహ ప్రయోగానికి వాడిన రాకెట్‌ తొలి దశను గాల్లోనే పేల్చినట్లు గుర్తించారు. దక్షిణ కొరియా(South Korea) యోన్‌సై విశ్వవిద్యాలయం ఉల్కలను గమనించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలో ఉత్తరకొరియా శాటిలైట్‌ ప్రయోగం నిక్షిప్తమైంది.

ఉపగ్రహాన్ని తీసుకెళుతున్న చోలీమా-1 రాకెట్‌ గాల్లోకి ఎగిరిన తర్వాత తొలి దశ విడిపోయి గాల్లోనే పేలిపోయినట్లు గుర్తించారు. దాని శకలాలు చెల్లాచెదురైపోయాయి. దీనిని ఉద్దేశపూర్వకంగానే గాల్లో ధ్వంసం చేసినట్లు విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్‌ యంగ్‌ ఇక్‌ పేర్కొన్నట్లు స్పేస్‌ కామ్‌ వెల్లడించింది. గత ప్రయోగాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపించలేదని ఆయన చెప్పారు. ఈ రాకెట్‌ తొలి దశ సముద్రంలో కూలితే అమెరికా, దక్షిణ కొరియా నౌకా దళాలు అక్కడి నుంచి రాకెట్‌ శకలాలను సేకరించి వాటి ఆధారంగా తమ టెక్నాలజీని గుర్తిస్తారనే భయంతో.. ఉత్తర కొరియా ఈ పనిచేసినట్లు యంగ్‌ విశ్లేషించారు. ఇక మరో వైపు ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్‌ మెక్‌డోవెల్‌ కూడా ఉత్తరకొరియా ఉపగ్రహం కక్ష్యకు చేరిందన్నారు. ఒక వస్తువు కొత్తగా కక్ష్యలోకి వచ్చినట్లు అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ బృందాలు గుర్తించాయని వెల్లడించారు. 

కొత్త వైరస్‌ లేదు.. అవి సీజనల్‌ నిమోనియా సమస్యలే..: చైనా

గతంలో ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడానికి విఫల యత్నాలు చేసింది. అనంతరం ఇటీవల ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ రష్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాము ఉత్తరకొరియా ఉపగ్రహ ప్రయోగానికి సాయం చేస్తామని రష్యా అధినేత పుతిన్‌ హామీ ఇచ్చారు. అయితే.. అది ఎలాంటి సాయమో వెల్లడించలేదు. ఇది జరిగిన కొన్నాళ్లకే ఉత్తరకొరియా విజయవంతంగా నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది.

ఇక ఉ.కొరియా చర్య ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రాజేసింది. దక్షిణ కొరియా కూడా నవంబర్‌ చివరినాటికి తమ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపుతామని ప్రకటించింది. కాకపోతే అమెరికా కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ సాయం తీసుకొంటుందని అంతా భావిస్తున్నారు. 

ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఉద్రిక్తతలను రాజేసింది. దీనికి ప్రతిగా 2018లో తాము ఉత్తరకొరియాతో చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తామని దక్షిణ కొరియా ప్రకటించింది. ఈ అంశాన్ని దక్షిణ కొరియా ప్రధాని హాన్‌ డక్‌ సూ వెల్లడించారు. మరోవైపు ఉత్తర కొరియా కూడా ఇలాంటి ప్రకటనే చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని