Plane: గాలులకు ఊగిపోతూ విమానం ల్యాండింగ్‌.. వణికిపోయిన ప్రయాణికులు: వీడియో వైరల్‌

Plane: బలమైన ఈదురుగాలుల ప్రభావంతో గాల్లో ఉన్న ఓ విమానం ఊగిపోయింది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య రన్‌వేపై ల్యాండ్ అయ్యింది.

Updated : 29 Dec 2023 18:01 IST

లండన్‌: యూకే (UK), ఐర్లాండ్‌ దేశాలను గెరిట్‌ తుపాను వణికిస్తోంది. తుపాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ఈ దేశాల్లో విమాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులు ప్రభావంతో ఇటీవల ఓ విమానం (Plane) ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదకరంగా ఊగిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

డిసెంబరు 27న ఈ ఘటన చోటుచేసుకుంది. లాస్‌ఏంజెల్స్‌ నుంచి వచ్చిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌ 777 విమానం.. లండన్‌ (London)లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌  (Heathrow airport)లో అత్యంత ప్రమాదర పరిస్థితుల మధ్య దిగింది. రన్‌వేపై ల్యాండ్‌ అవుతుండగా ఈదురు గాలుల ప్రభావంతో విమానం విపరీతంగా ఊగిపోయింది. విమానం రెక్క ఒకవైపు ఒరిగి దాదాపు నేలను తాకబోయింది. దీంతో అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

మీ విమానం బోల్టులు సరిచూసుకోండి.. కోరిన బోయింగ్‌..!

దాదాపు 10 సెకన్ల పాటు కుదుపులకు గురైన విమానం చివరకు సురక్షితంగా రన్‌వేపై దిగింది. విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌ను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసే ‘బిగ్‌ జెట్‌ టీవీ’ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియోను బిగ్‌ జెట్‌ టీవీ తమ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. అయితే, ఈ ఘటన సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నది మాత్రం తెలియరాలేదు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఏవియేషన్ అధికారులు వెల్లడించారు.

గెరిట్‌ తుపాను కారణంగా యూకే, గ్లాస్గోలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్ 13కి పైగా విమానాలను రద్దు చేసింది. బార్సిలోనా, బెర్లిన్‌ వంటి ఐరోపా నగరాలకు వెళ్లే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. స్కాట్లాండ్‌లో పలు రైళ్లను కూడా రద్దు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని