Houthi Rebels: ఎర్ర సముద్రంలో ఆగని దాడులు..!

ఎర్ర సముద్రంలో రెండు నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడ్డారు.

Published : 15 Dec 2023 22:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు (Houthi Rebels) కొంతకాలంగా నౌకలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్‌, క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎర్ర సముద్రం (Red Sea)లో వారు మరోసారి రెచ్చిపోయారు. రెండు రవాణా నౌకలపై దాడులకు పాల్పడ్డారు. దీంతో ఇవి మంటల్లో చిక్కుకుపోయాయి. దాడులకు గురైన నౌకల్లో ఒకటి జర్మనీ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థకు చెందిన నౌక కాగా (Al Jasrah).. మరొకటి స్విట్జర్లాండ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఎంఎస్‌సీ సంస్థకు చెందినది(MSC Palatium III). మరోవైపు.. సోమాలియాకు చెందినవారుగా భావిస్తోన్న కొంతమంది దుండగులు.. అరేబియా సముద్రంలో ఓ బల్గేరియన్ నౌకను స్వాధీనం చేసుకున్నారు.

మొదటి దాడిలో.. గ్రీస్‌లోని పిరియాస్‌ ఓడరేవు నుంచి సింగపూర్‌కు వెళ్తోన్న జర్మనీ సంస్థ నౌక ముందు భాగం ధ్వంసమైందని, ఒక కంటైనర్‌ సముద్రంలో పడిపోయినట్లు ప్రైవేటు నిఘా సంస్థ ఒకటి తెలిపింది. ఈ క్రమంలోనే డెక్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అయితే.. నౌకా సిబ్బంది అంతా క్షేమమేనని తేలింది. బ్రిటన్‌ సైన్యానికి చెందిన సముద్ర వాణిజ్య కార్యకలాపాల విభాగం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మరోవైపు.. స్విట్జర్లాండ్‌కు చెందిన నౌక దిశగా రెండు క్షిపణులు దూసుకురాగా.. ఒకటి సముద్ర జలాల్లో కూలిపోయింది. మరొకటి నౌకను తాకడంతో మంటలు చెలరేగాయి. సిబ్బంది గాయపడ్డారా? లేదా? వివరాలు తెలియరాలేదు. ఈ దాడులకు తామే బాధ్యులమని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.

ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్న వేళ.. నౌకలపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే నౌకలు, లేదా ఇజ్రాయెల్‌తో సంబంధమున్న నౌకలను తాము లక్ష్యంగా చేసుకుంటున్నట్లు హౌతీ రెబల్స్‌ ప్రకటించారు. భారత్‌కు వస్తున్న ఓ నౌకను ఇటీవల హైజాక్‌ చేయడంతో పాటు.. ఫ్రాన్స్‌ యుద్ధ నౌకపైకి డ్రోన్లను పంపించారు. భారత్‌లో తయారైన జెట్‌ ఇంధనాన్ని తీసుకెళ్తోన్న ఆర్డ్‌మోర్‌ అనే నౌకపై బుధవారం బాబ్‌ ఎల్‌-మండెప్‌ ప్రాంతంలో దాడికి యత్నించారు. అయితే, మిలిటెంట్లు ప్రయోగించిన క్షిపణి గురి తప్పింది. అంతకుముందు నార్వే జెండాతో ఉన్న ఓ రవాణా నౌకపై క్షిపణి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని