Israel: భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది..! సైనికుల మృతిపై నెతన్యాహు

గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆ దేశ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు.

Published : 25 Dec 2023 02:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ సైన్యాని (IDF)కీ యుద్ధభూమిలో ప్రతిఘటన ఎదురవుతోంది. శుక్రవారం నుంచి దక్షిణ, మధ్య గాజాలో 14 మంది సైనికులు మృతి చెందినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి నెతన్యాహు (Netanyahu) విచారం వ్యక్తం చేశారు. ‘‘ఇది కఠినమైన ఉదయం. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. అయితే.. పోరాటాన్ని కొనసాగించడం తప్ప తమకు వేరే మార్గం లేదని నెతన్యాహు ఓ ప్రకటనలో తెలిపారు (Israel Hamas Conflict).

ఫ్రాన్స్‌లో విమానం నిలిపివేత.. న్యాయమూర్తి ముందుకు ప్రయాణికులు

‘‘చివరి వరకు పూర్తి శక్తితో పోరాడతాం. హమాస్‌ నిర్మూలన, బందీలకు విముక్తి, గాజా ఇకపై ఇజ్రాయెల్‌కు ముప్పుగా ఉండదని నిర్ధారించుకునేవరకు ఇది సాగుతుంది’’ అని చెప్పారు. ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. తాజా మరణాలతో హమాస్‌తో యుద్ధంలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన ఇజ్రాయెల్‌ సైనికుల సంఖ్య 153కు చేరుకుంది. అక్టోబరు 7న హమాస్‌ మెరుపుదాడులకు ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 20,400 మంది పాలస్తీనీయన్లు మృతి చెందినట్లు హమాస్‌ ఆధీనంలోని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని