Israel-Hamas: యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉంది: అమెరికా

Israel-Hamas: హెజ్‌బొల్లా సైతం ఇజ్రాయెల్‌పై దాడులకు దిగిన నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఆదివారం పశ్చిమాసియా పర్యటనకు బయలుదేరారు.

Published : 08 Jan 2024 08:18 IST

జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న యుద్ధం (Israel-Hamas conflict) మరింత విస్తరించే ప్రమాదం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ (Antony Blinken) హెచ్చరించారు. ఇది పశ్చిమాసియా ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పు కలగజేస్తుందని చెప్పారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొందని వివరించారు. లెబనాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్‌బొల్లా (Hezbollah) సైతం ఇజ్రాయెల్‌పై దాడులకు దిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాల్లో భాగంగా ఆదివారం ఆయన ఆకస్మికంగా ఈ ప్రాంత పర్యటన చేపట్టారు.

పర్యటనలో జోర్డాన్‌ రాజు అబ్దుల్లా-2తో పాటు ఖతర్‌ ప్రధానమంత్రి షేక్‌ అబ్దుల్‌ రహమాన్‌ అల్‌ థానితో బ్లింకెన్‌ చర్చలు జరిపారు. హమాస్‌ ఉప నేత సలేహ్‌ అరౌరీని లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోనే ఇజ్రాయెల్‌ హతమార్చిన నేపథ్యంలో.. బందీల విడుదల ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశం ఉందని బ్లింకెన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఖతర్‌ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. అయినప్పటికీ తాము ఇరు పక్షాలతో చర్చలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

ఇజ్రాయెల్‌ దాడి వల్లే అరౌరీ మృతిచెందాడని.. దీనికి ప్రతీకారంగానే శనివారం ఎదురుదాడి చేశామని హెజ్‌బొల్లా ప్రకటించింది. అయితే, హమాస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న హెజ్‌బొల్లాపై ఒత్తిడి పెరిగిందని ఇజ్రాయెల్‌ త్రిదళాధిపతి లెఫ్టినెంట్‌ కర్నల్‌ హెర్జ్వీ హలేవీ తెలిపారు. దీంతో అది యుద్ధంలో నేరుగా పాల్గొనాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నారు. ఫలితంగా మరో యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

మరోవైపు హెజ్‌బొల్లా (Hezbollah) దాడులతో ‘మౌంట్‌ మెరోన్‌’పై ఉన్న తమ కీలక గగనతల నిఘా స్థావరం దెబ్బతిందని ఇజ్రాయెల్‌ (Israel) ప్రకటించింది. అయితే, తమ గగనతల రక్షణ వ్యవస్థలకు మాత్రం ఎలాంటి ముప్పు వాటిల్లలేదని తెలిపింది. మౌంట్‌ మెరోన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ బేస్‌ ఇజ్రాయెల్‌కు ఆక్రమిత పాలస్తీనాలో ఉన్న అతి కీలక స్థావరం. అక్కడి నుంచే సిరియా, లెబనాన్‌, తుర్కియే, సైప్రస్‌తోపాటు మధ్యదరా సముద్ర ఉత్తర, తూర్పు బేసిన్‌లవైపు ఆపరేషన్స్‌ను ఇజ్రాయెల్‌ నిర్వహిస్తుంటుంది. ఇది ఇజ్రాయెల్‌ ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌కూ కీలక స్థావరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని