పైకి లేచిన బ్రిడ్జ్‌.. కిందికి దిగలేదు: లండన్‌ ఐకానిక్‌ వంతెన వద్ద ట్రాఫిక్‌ జామ్‌

Tower Bridge: నదిలో బోటుకు దారిస్తే.. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయిన అనూహ్య పరిణామం లండన్‌(London)లో చోటుచేసుకుంది. బోటుకు దారిచ్చేందుకు పైకి లేచిన బ్రిడ్జ్‌లో లోపం తలెత్తడమే ఆ పరిస్థితికి దారితీసింది. 

Updated : 29 Sep 2023 13:15 IST

లండన్‌: ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌(London)లోని ప్రఖ్యాత టవర్‌ బ్రిడ్జ్‌(Tower Bridge) వద్ద అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. నదిలో పడవ ప్రయాణం కోసం దారి ఇచ్చేందుకు పైకి లేచిన బ్రిడ్జ్‌లో లోపం తలెత్తడంతో అది యథాస్థానానికి రాలేకపోయింది. దాంతో రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. 

లండన్‌లో థేమ్స్‌ నదిపై నిర్మించిన టవర్‌ బ్రిడ్జ్‌ ఇటు నదీ రవాణాకు.. అటు రోడ్డు ప్రయాణాలకు వీలుగా ఉంటుంది. గురువారం మధ్యాహ్నం ఒక బోటు వెళ్లేందుకు బ్రిడ్జ్‌కు చెందిన రెండు టవర్ల మధ్యభాగాన్ని పైకెత్తారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియే. అయితే.. పైకి లేచిన భాగం బోటు వెళ్లిన తర్వాత కిందికి దిగాలి. కానీ.. లోపం కారణంగా అది యథాస్థానానికి రాలేదు. దాంతో రోడ్డు నుంచి వంతెన మీదుగా వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. అది కాస్తా లండన్‌ వీధుల్లో ట్రాఫిక్ జామ్‌(Traffic Jams)కు దారితీసింది.

అమెరికా పిల్లలకి ‘లెక్కలు’ రావడం లేదట!

‘బ్రిడ్జ్‌ పైకి లేచి ఉండటం చూసేందుకు మొదట బాగానే అనిపించింది. కొద్దిసేపటి తర్వాత అర్థమైంది దాని ఎఫెక్ట్‌. ట్రాఫిక్‌ పెరగడం మొదలైంది. అరగంట అంతరాయం తర్వాత ఆ బ్రిడ్జ్‌ కిందికి దిగడంతో అందరి మొహాల్లో సంతోషం కనిపించింది’ అని స్థానికవ్యక్తి ఒకరు వెల్లడించారు. అరగంట తర్వాత బ్రిడ్జ్‌ అసలు స్థానానికి రావడంతో ట్రాఫిక్ అంతరాయం తొలగిపోయిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

థేమ్స్‌ నదిపై ఈ కదిలే బ్రిడ్జ్‌ నిర్మాణం 1894లో పూర్తయింది. దీని జంట టవర్లు నదికి 61 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ రెండింటి మధ్య నిర్మించిన స్కైవాక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీనిపై నుంచి కిందికి చూస్తే రహదారిపై వెళ్తున్న వాహనాలు, కిందనే నీటిలో ప్రయాణిస్తున్న పడవలను చూడొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని