PM Modi: ప్రపంచానికి స్మార్ట్‌ గవర్నెన్స్ అవసరం: ప్రధాని మోదీ

ఆధునికతవైపు పయనిస్తున్న ప్రపంచానికి కొన్ని దశాబ్దాలుగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. 

Published : 14 Feb 2024 17:53 IST

దుబాయ్‌: ఆధునిక ప్రపంచానికి సాంకేతిక ఆధారిత స్మార్ట్‌ ప్రభుత్వాలు అవసరమని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ గవర్నమెంట్ సమ్మిత్‌-2024లో ఆయన ప్రసంగించారు. గత పదేళ్లుగా మినిమమ్‌ గవర్నమెంట్‌, మాగ్జిమమ్‌ గవర్నెన్స్‌ (కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పాలన) నినాదంతో భారత ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. తమపై ప్రజలకు నమ్మకం ఏర్పడటానికి ఇదే ప్రధాన కారణమన్నారు. యూఏఈ (UAE) దేశాధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ విజన్‌ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వంలో దుబాయ్‌ ప్రపంచ ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా మారుతోందని ప్రశంసించారు. 

‘‘ప్రజల మనోభావాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే భారత ప్రభుత్వంపై వారికి విశ్వాసం ఏర్పడింది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా గత 23 ఏళ్లుగా నేను ప్రభుత్వంలో ఉన్నాను. మినిమమ్‌ గవర్నమెంట్‌.. మాగ్జిమమ్‌ గవర్నెన్స్ నినాదంతో పనిచేస్తున్నాం. మహిళాభివృద్ధికి మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. వారిని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నాం. 50 కోట్ల మంది ప్రజలను బ్యాంకింగ్‌ వ్యవస్థతో అనుసంధానించాం. ఆధునికతవైపు దూసుకుపోతున్న ప్రపంచానికి దశాబ్దాలుగా ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, ఇంధనం, నీరు, ఆహార భద్రత రూపంలో అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. మరోవైపు సాంకేతికత మనిషిని అభివృద్ధివైపు నడిపిస్తూనే.. అంతరాయాలను సృష్టిస్తోంది’’ అని ప్రధాని మోదీ తెలిపారు. 

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం యూఏఈ చేరుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఫిన్‌టెక్‌ తదితర రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య 8 ఒప్పందాల మార్పిడి జరిగింది. బుధవారం వరల్డ్‌ గవర్నమెంట్‌ సమ్మిత్‌లో పాల్గొన్న అనంతరం యూఏఈలోని తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని