ఇల్లు... ఆర్డర్‌ పెట్టొచ్చు..!

సొంతిల్లు... ప్రతి మనిషీ కనే కల. పుల్లా పుడకా ముక్కున తెచ్చి పక్షి గూడు కట్టుకున్నట్టుగా ఒక్కో ఇటుకా పేరుస్తూ మనిషి ఇల్లు కట్టుకుంటాడు. అది పూర్తవడానికి చేతినిండా డబ్బుంటే సరిపోదు.

Updated : 12 Feb 2023 10:10 IST

ఇల్లు... ఆర్డర్‌ పెట్టొచ్చు..!

సొంతిల్లు... ప్రతి మనిషీ కనే కల. పుల్లా పుడకా ముక్కున తెచ్చి పక్షి గూడు కట్టుకున్నట్టుగా ఒక్కో ఇటుకా పేరుస్తూ మనిషి ఇల్లు కట్టుకుంటాడు. అది పూర్తవడానికి చేతినిండా డబ్బుంటే సరిపోదు. ముడిసరకు నాణ్యతలో, చేపట్టే నిర్మాణంలో ఎలాంటి లోపమూ లేకుండా చూసుకోవడానికి ఎంతో సమయం వెచ్చించాలి. అంతా సిద్ధంగా ఉన్న ఫ్లాట్‌ కొనుక్కున్నా మళ్లీ లోపల ఇంటీరియర్స్‌ అనీ, ఉడ్‌ వర్క్‌ అనీ... వెంటపడి చేయించుకోవాలి. అలా కాకుండా భోజనానికి ఆప్‌లో ఆర్డర్‌ పెట్టినట్లే మనకెలాంటి ఇల్లు కావాలో ఆర్డర్‌ పెడితే..? కలో కథో కాదు, నిజంగానే! రెడీమేడ్‌ ఇళ్లు ఇప్పటి ట్రెండ్‌ మాత్రమే కాదు, భవిష్యత్‌ అవసరం కూడా... అంటున్నారు నిపుణులు. ఎందుకో ఏమిటో చూడండి మరి..!

ఉద్యోగం రావడం ఆలస్యం... పెళ్లి చేసుకుని ఒక సొంతిల్లు ఏర్పరచుకోవడం అనేది వ్యక్తిగత జీవిత లక్ష్యాలుగా మారతాయి మన సమాజంలో. అయితే ఇల్లు కట్టుకోవడం అంత తేలికేమీ కాదు. అందుకే ముందు స్థలం కొనుక్కోవడం మీద దృష్టిపెట్టేవారు. రిటైరయ్యే లోపల ఇల్లు కట్టుకోలేకపోతామా అనుకునేవారు. ఇంటికోసం బ్యాంకులు దీర్ఘకాల రుణాలు ఇచ్చే పద్ధతీ, అపార్ట్‌మెంట్ల నిర్మాణమూ అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు చేతిలో డబ్బు లేకపోయినా సొంతింటి కల నెరవేర్చుకోవడం సాధ్యమవుతోంది. ఇల్లంటే ఇప్పటివరకూ మనకు తెలిసింది... స్థలం ఉంటే సొంతంగా కట్టుకోవడం, లేదా ఏ కాంట్రాక్టర్‌కో ఇచ్చి కట్టించుకోవడం- అది పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. ఖర్చు కూడా ముందు అనుకున్నదానికన్నా ఎక్కువే అయి తీరుతుంది. మరో మార్గం- అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుక్కోవడం. ఇది కూడా వాళ్లు చెప్పిన సమయానికి మన చేతికి రాదు, ఇంటీరియర్స్‌ కోసం అదనపు ఖర్చూ అవుతుంది. ఈ రెండూ కాకపోతే ఇల్లైనా ఫ్లాట్‌ అయినా సెకండ్‌ హ్యాండ్‌ది కొనుక్కోవడం.

ఇవేవీ కాకుండా కాస్త తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలో ఆధునికమైన సొంతిల్లు ఏర్పర్చుకోవడానికి వీలయ్యే విధానమే... ప్రి-ఫ్యాబ్రికేటెడ్‌ హౌసింగ్‌. అంటే కట్టాల్సిన చోట కాకుండా ఫ్యాక్టరీలో కట్టి తీసుకొచ్చి కావాల్సిన చోట పెట్టుకోవడానికి వీలయ్యే ఇల్లు.

నగరాల్లో రోడ్ల పక్కన చిన్న చిన్న గదుల్లాంటి వాటిని అమ్మడం చూసేవుంటారు. చెక్క గోడలతో కింద చక్రాలతో ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లడానికి వీలయ్యే వీటిని ‘మొబైల్‌ హౌస్‌’లనీ, షిప్పింగ్‌ కంటైనర్లతో చేస్తారు కాబట్టి ‘కంటైనర్‌ హోమ్స్‌’ అనీ అంటున్నారు. షాపులు, టీ దుకాణాలు, టిఫిన్‌ సెంటర్లూ లాంటివి పెట్టుకోవడానికి ఎక్కువగా వాడుతున్నారు వీటిని. కొందరు ఫామ్‌ హౌసులూ గెస్టు హౌసులుగానూ వినియోగిస్తున్నారు. అయితే అలా వాడాల్సి వచ్చినప్పుడు చక్రాలతో తయారుచేసిన ఈ ఇళ్లను అవి కనపడకుండా కింద చిన్నగోడ లాంటిది నిర్మించడమో, లేదా స్టీల్‌ ఫ్రేమ్‌లాగా కట్టిన మరో వేదికమీదికి ఆ ఇంటిని మొత్తంగా మార్చడమో చేస్తారు. దాదాపుగా నూటికి నూరు శాతం ఫ్యాక్టరీల్లోనే తయారుచేసి మనకు కావలసిన చోట తెచ్చి పెట్టుకునే ఈ ఇళ్లను ‘మాన్యుఫాక్చర్డ్‌ హౌసెస్‌’ అని కూడా అంటారు. అంటే అచ్చంగా రెడీమేడ్‌ ఇళ్లన్నమాట. కాకపోతే ఇవి ఎంతోకాలం మన్నవు, జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. పైగా మనకు కావలసినట్లు తయారుచేయించుకోవడం కాకుండా ఉన్నవాటిల్లోనే మనకు నచ్చినవి కొనుక్కోవాలి.

ప్రి ఫ్యాబ్రికేటెడ్‌ హౌసింగ్‌ విధానంలో ఒకరకం మాత్రమే ఈ మొబైల్‌ ఇళ్లు. ఇవి కాకుండా అచ్చంగా అన్నిట్లోనూ మన సంప్రదాయ ఇళ్లతో సమానంగా ఉండి, ఆధునికంగా కనిపించే భవనాలూ ఉన్నాయి. వాటిని మాడ్యులర్‌ హౌస్‌లంటారు.

అవెలా కడతారు?

సంప్రదాయ విధానంలో మనకి ఉన్న స్థలానికి తగ్గట్టుగా ఎన్ని గదులు కావాలో ప్లాన్‌ తయారుచేసుకుని దాని ప్రకారం పునాదులు వేసి ఆ పైన ఇల్లు కట్టుకుంటాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యేదాకా ప్రతి పనీ అక్కడే జరుగుతుంది. ఇటుకలూ సిమెంటూ స్టీలూ అన్నీ అక్కడే పెట్టుకుంటాం. అవసరాన్ని బట్టి వాడుకుంటూ ఉంటాం. వాటితో పనిలేకుండా ఇల్లంతా విడి భాగాలుగా ఒక ఫ్యాక్టరీలో తయారై వచ్చి మన స్థలంలో ఇల్లుగా రూపుదిద్దుకుంటే- దాన్ని ‘ప్రి-ఫ్యాబ్‌ హౌస్‌’ అంటారు. రెడీమేడ్‌ ఇళ్లన్నిటికీ ‘ప్రి-ఫ్యాబ్‌’ అన్న మాట వాడినప్పటికీ అందులో మళ్లీ తేడా ఉంది. ప్రి-ఫ్యాబ్‌ విధానంలో మూడు రకాలున్నాయి. పైన చెప్పుకున్న కంటైనర్‌ ఇళ్లు ఒకరకం అయితే ప్యానెల్‌ బిల్డ్‌, మాడ్యులర్‌ ఇళ్లు మిగిలినవి. ముందు ఫ్లోరింగ్‌ వేసి దానిమీద ఫ్యాక్టరీలో తయారైన ప్యానల్స్‌ని గోడల్లాగా పేర్చుకుంటూ కట్టే ఇళ్లని ప్యానెల్‌ బిల్డింగ్‌ అంటారు. విశాలమైన గదులూ ఎత్తైన పైకప్పుతో ఉండే వీటిని వాణిజ్య అవసరాలకీ సమావేశమందిరాల్లాంటి వాటికీ వాడతారు. ప్యానెల్స్‌ని ఒకచోటి నుంచి మరో చోటికి తీసుకెళ్లడమూ, అక్కడ అమర్చడమూ తేలిక. అవసరమైతే వాటికి టాయ్‌లెట్లూ, వాష్‌ బేసిన్లూ లాంటివి కూడా ముందే బిగించి తీసుకెళ్లవచ్చు.

మాడ్యులర్‌ హౌస్‌ అలా కాదు. ఇంటిని కొన్ని భాగాలుగా(బాక్సులుగా) విభజించి విడి విడిగా తయారుచేస్తారు. వాటిని మాడ్యూల్స్‌ అంటారు. అంటే హాలూ పడకగదీ వంటగదీ బాత్‌రూమూ... ఇలా దేనికదే ఒక యూనిట్‌గా ఫ్యాక్టరీలో తయారుచేసి ట్రక్కుమీద తెచ్చి క్రేన్‌ సాయంతో ఎత్తి అప్పటికే సిద్ధంగా ఉన్న పునాదుల మీద పెట్టాల్సిన చోట పెట్టి తర్వాత అన్నిటినీ కలుపుతారు. ఒకప్పుడు వీటిని ట్రక్కు మీద తీసుకెళ్లడానికి వీలుగా పరిమిత వైశాల్యంతో మాత్రమే తయారుచేసేవారు. ఇప్పుడు ఎంత పెద్దవి కావాలన్నా చేసి తీసుకురాగల సాంకేతికత అందుబాటులో ఉంది. దాంతో వ్యక్తుల అభిరుచుల మేరకు ఇళ్లను కస్టమైజ్‌ చేసి మరీ కడుతున్నాయి నిర్మాణ సంస్థలు. బాక్సులుగా ఉండే ఈ ఇంటి నిర్మాణంలో ఇంటి ముందు వరండా, కారు కోసం గరాజ్‌ లాంటివి కట్టడం గతంలో వీలయ్యేది కాదు. అందుకని దీనికి ప్యానెల్‌ విధానాన్నీ జత చేసి ఇప్పుడు అన్ని వసతులతో మాడ్యులర్‌ హౌస్‌లను కడుతున్నారు. దాదాపుగా 70 నుంచి 90 శాతం నిర్మాణం ఫ్యాక్టరీలో పూర్తిచేసుకుని వస్తాయి మాడ్యులర్‌ ఇళ్లు. ఆ మిగతా నిర్మాణాన్ని ఇంటి స్థలంలో దాన్ని పెట్టాక పూర్తిచేస్తారు.

ఇది చిన్న ఇళ్లకే సాధ్యమేమో?

కాదు, ఎంత పెద్ద భవనాలైనా ఈ విధానంలో కట్టుకోవచ్చు. అమెరికా, కెనడా, బ్రిటన్‌ లాంటి దేశాల్లో రెండంతస్తుల ఇండిపెండెంట్‌ ఇళ్లను ఇలాగే కట్టుకుంటున్నారు. యూరప్‌లో ఐదారు అంతస్తుల వరకూ కడుతున్నారు. ఇవే కాదు, వంతెనలూ స్టేడియంలూ... ఏవైనా మాడ్యులర్‌ విధానంలో కట్టొచ్చు. ఒకసారి ఇల్లు కట్టుకున్నాక మనకో కొత్త ఆలోచన వస్తుంది. మరో గది ఉంటే బాగుండేదనో, ద్వారం ఇటు కాకుండా అటు ఉంటే సౌకర్యంగా ఉంటుందనో... అనిపిస్తుంది. సంప్రదాయ విధానంలో కట్టిన ఇంట్లో అలాంటి మార్పులు చేయడం కష్టసాధ్యం. చాలా ఖర్చవుతుంది, పైగా అలా మరమ్మతులు చేసే క్రమంలో మిగతా భాగాలూ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మాడ్యులర్‌ ఇంట్లో ఆ భయం లేదు. ఇల్లు కట్టేసిన తర్వాత కూడా ఏమన్నా మార్పులు కావాలంటే తేలిగ్గానే చేసుకోవచ్చు. అది కూడా మిగిలిన ఇంటికి ఎలాంటి నష్టం కలగకుండానే. అదనంగా ఇంకో గది వేయాలనుకున్నా, డాబా మీద రెండు గదులు వేసి అద్దెకు ఇవ్వాలనుకున్నా... నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.

దృఢంగా ఉంటాయా?

ప్రి-ఫ్యాబ్‌ విధానంలో కంటైనర్‌ ఇళ్లు అంత దృఢంగా ఉండవు కానీ మాడ్యులర్‌ ఇళ్లు సంప్రదాయ పద్ధతిలో కట్టిన ఇళ్లతో సమానంగా పటిష్ఠంగా ఉంటాయి. వాటికన్నా ఒకింత నాణ్యంగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే- మామూలుగా ఇళ్లు కట్టేటప్పుడు వాడే ముడి సరకులన్నీ అదే ప్రాంగణంలో ఒక తాత్కాలిక షెడ్డులోనో ఆరుబయటో నిల్వ చేస్తారు. ఎండా వానాలాంటి వాతావరణ ప్రభావానికి లోనవడం వల్ల వాటి నాణ్యత తగ్గవచ్చు. ఒక్కోసారి ఇసుకో, సిమెంటో కొరత ఏర్పడి సగం కట్టిన ఇంటిని కొన్నాళ్లపాటు నిలిపేయాల్సి రావచ్చు. ఈ సమస్యలేవీ మాడ్యులర్‌ ఇళ్లకు ఉండవు. వీటి నిర్మాణం పూర్తిగా ఫ్యాక్టరీ లోపల, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు లేనిచోట జరుగుతుంది. దాంతో నాణ్యమైన ముడిసరకు వల్ల నిర్మాణమూ పటిష్ఠంగా ఉంటుంది. అపార్ట్‌మెంట్‌లాగా వీటి విలువ తగ్గడం ఉండదు.

ఎలా కడతారు, ఎంత సమయం పడుతుంది?

స్టీలు, కలప, కాంక్రీట్‌... అన్నిటితోనూ మాడ్యులర్‌ భవనాలను కట్టవచ్చు. భవనం సైజుని బట్టి ఎంత సమయం పడుతుందో చెబుతారు. తక్కువలో తక్కువ ఆరువారాల్లో కూడా ఒక ఇంటిని కట్టేయవచ్చు. ఇంటి స్థలంలో పునాదులు వేయడానికి కాస్త సమయం పడుతుంది కదా, అదే సమయంలో ఫ్యాక్టరీలో ఇల్లు కూడా తయారైపోతుంటుంది. కాబట్టి మామూలు నిర్మాణానికి పట్టే సమయం కన్నా తక్కువ సమయంలో దీన్ని పూర్తిచేయవచ్చంటున్నాయి ఈ రంగంలో ఉన్న సంస్థలు.

ఏయే సంస్థలు ఈ సేవల్ని అందిస్తున్నాయి?

మన దేశంలో టాటా స్టీల్‌ నెస్ట్‌-ఇన్‌, ఎండిఐపీఎల్‌, లూమ్‌ క్రాఫ్ట్స్‌ లాంటి పలు సంస్థలు మాడ్యులర్‌ భవనాలను నిర్మిస్తున్నాయి.

వీటి వల్ల లాభాలేమిటి?

మరో పాతికేళ్లకల్లా ప్రపంచ జనాభా 950 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా వేస్తోంది. దానికి తగ్గట్టు నివాస, వ్యాపార, పారిశ్రామిక సముదాయాల అవసరమూ పెరుగుతుంది. మరోపక్క పల్లెల నుంచి పట్టణాలవైపు వలసా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నగరాలమీద ఒత్తిడి పెరగడం సహజం. మరోపక్క పెరుగుతున్న నిర్మాణ వ్యయం కూడా సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశాన్నివ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా కాస్త వెసులుబాటునిచ్చే మాడ్యులర్‌ నిర్మాణ రంగమే సరైన మార్గమని నిపుణులు అంటున్నారు. ఇప్పటికీ చాలామంది వీటిని తాత్కాలిక నిర్మాణాలుగానే భావిస్తున్నారనీ, సురక్షితం కాదనుకుంటున్నారనీ, ఆ అపోహల్ని తొలగించి మాడ్యులర్‌ భవనాల పట్ల అవగాహన కల్పించడం తక్షణావసరమనీ చెబుతున్నారు. అందుకు వారు వివరిస్తున్న కారణాలేంటంటే...

* మామూలు ఇళ్లలాగే మాడ్యులర్‌ భవనాలు దశాబ్దాల పాటు మన్నుతాయి. భవన నిర్మాణ నియమాలకు కట్టుబడి అన్ని జాగ్రత్తలూ తీసుకుని నిర్మించే ఈ భవనాలు సంప్రదాయ కట్టడాలకు ఏమాత్రం తీసిపోవు. నిర్మాణ సమయంలో ప్రతి దశలోనూ నిపుణులు వాటిని తనిఖీ చేస్తూనే ఉంటారు. ఆ భవనాన్ని
కట్టించుకునేవారు కూడా ‘పూర్తయ్యేదాకా చూడలేమేమో, అంతా తయారయ్యాక నచ్చకపోతే ఎలా...’ అనుకోనక్కర లేదు. ప్రతి దశలోనూ వెళ్లి చూసుకోవచ్చు. ఏవైనా మార్పులు ఉంటే చెప్పవచ్చు. కొన్ని సంస్థలు పని ఎంతవరకూ వచ్చిందో యజమానులకు ఎప్పటికప్పుడు తెలిపే డాష్‌బోర్డులనూ ఏర్పాటుచేస్తున్నాయి.

* ఖర్చు తక్కువ. మామూలు ఇళ్లకన్నా కచ్చితంగా 15 నుంచి 20 శాతం దాకా ఖర్చు తగ్గుతుందని చెబుతున్నాయి నిర్మాణ సంస్థలు.

* సాధారణ నిర్మాణాలకన్నా మూడు రెట్ల వేగంతో వీటిని పూర్తిచేయవచ్చు. ఇరుగుపొరుగుకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా తక్కువ సమయంలో ఇల్లు రెడీ అయిపోతుంది. భవన నిర్మాణానికి వాడే ఇటుకలూ సిమెంటూ ధూళీ లాంటివాటి వల్ల పరిసరాలు పాడయ్యే ప్రశ్నే ఉండదు.

* నిర్మాణ రంగంలో కార్మికులకు ప్రమాదాలు జరగడం సహజం. ఫ్యాక్టరీల్లో అన్ని వసతుల మధ్య యంత్రాల సాయంతో ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది కాబట్టి శ్రామికులు సురక్షిత వాతావరణంలో పనిచేస్తారు.

* మారుమూల ప్రాంతాల్లోనూ సౌకర్యవంతమైన ఇళ్లు కట్టుకోవచ్చు.

ఎవరికి ఎక్కువ ఉపయోగం?

అన్ని రకాల భవనాలూ ఈ విధానంలో కట్టించుకోవచ్చు కాబట్టి అందరికీ ఉపయోగకరమే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నివాస భవనాలతో పాటు విద్యా, వైద్య రంగాలకు మాడ్యులర్‌ భవనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతోనే ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లి ఎంత సైజులో కావాలంటే అంత సైజు భవనాన్ని కట్టించుకోవచ్చు. కాబట్టి ఆస్పత్రులూ పాఠశాలలూ లేనిచోట ఈ విధానంలో తక్కువ పెట్టుబడితో అవసరమైన మేరకే చిన్నగా కట్టి వాటిని ఏర్పాటుచేయవచ్చు. అవసరం పెరిగే కొద్దీ విస్తరించుకునే వెసులుబాటు ఎలాగూ ఉంటుంది. మొట్టమొదటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టనక్కరలేదు. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మాడ్యులర్‌ భవనాల వల్ల లాభాలే ఎక్కువంటారు నిపుణులు.

 

ఎలాంటి ఇబ్బందులు?

పెద్ద ఇబ్బందులేమీ కావు కానీ, కొన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది. అవేంటంటే...

* ఫ్యాక్టరీ నుంచి ఇంటి స్థలానికి విడి భాగాలను తరలించడం అన్నిటికన్నా ప్రధానమైన సమస్య. రవాణాలో వాటికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాలి. మాడ్యూల్స్‌ సైజుని బట్టి తగిన వాహనాలు కావాల్సి ఉంటుంది. ఆ వాహనాల మీద వాటిని తీసుకెళ్లడానికి రోడ్డు మార్గం కూడా అనువుగా ఉండాలి. అందుకని నిర్మాణ సంస్థలే అందుకు తగిన వాహనాలతో రవాణా ఏర్పాట్లూ చేస్తున్నాయి. ఎక్కువ దూరం రవాణా చేయాల్సి ఉంటే ఖర్చు కాస్త పెరగవచ్చు.

* విడిభాగాలను సమంగా అతికించడం ఈ విధానంలో కీలకమైన అంశం. నేల, గోడలు, పైకప్పు, బీమ్స్‌... అన్నీ సరిగ్గా అతుక్కోవాలి. కొలతల్లో సెంటీమీటరు కూడా తేడా రాకూడదు. ఎక్కడ ఏ కొంచెం తేడా వచ్చినా ఆ ప్రభావం మొత్తం నిర్మాణం మీద పడుతుంది. కాబట్టి నైపుణ్యమూ ప్రభుత్వ అనుమతులూ ఉన్న సంస్థలనే తయారీకి ఎంచుకోవాలి.

* బ్యాంకుల నియమాలు కాలానుగుణంగా మారితే పర్వాలేదు. లేకపోతే రుణం విషయంలో స్పష్టత వచ్చాకే ముందుకు వెళ్లాలి. కొన్ని నిర్మాణ సంస్థలు కూడా రుణ ఏర్పాటు చేస్తున్నాయి. మనం ఎంచుకున్న సంస్థ ఆ వెసులుబాటు కల్పిస్తోందో లేదో తెలుసుకోవాలి.

* నివసించే ఇల్లు లేదా వ్యాపారమో హోటలో మరో ఆఫీసో నిర్వహించుకోవడానికి కట్టించుకున్న భవనం... గ్రాండ్‌గా రాజ ప్రాసాదంలాగా కన్పించాలనుకునేవారికి మాడ్యులర్‌ భవనాలు పనికి రావు. ఇవి సింపుల్‌గా, చిన్నగా, ఆధునికంగా కన్పిస్తాయి. అయితే పర్యావరణపరంగానూ వీటి వల్ల జరిగే మేలు కోసమైనా మాడ్యులర్‌ ఇళ్లకే ఓటేయాలంటున్నారు నిపుణులు.

అదెలా..?

సాధారణ భవన నిర్మాణానికి వాడే ముడిసరకు తయారీ, ఇంధన వినియోగమూ కలిసి 22 శాతం కర్బన వాయువుల విడుదలకు కారణమవుతున్నాయట. వాటితో కట్టిన భవనాలు కూడా నిరంతరం కర్బనవాయువులను విడుదల చేస్తూనే ఉంటాయి. మరో పక్క కొత్త భవనాలను కట్టేటప్పుడూ, పాతభవనాలను కూల్చివేసినప్పుడూ తయారయ్యే చెత్త ఒక్క అమెరికాలోనే ఏటా యాభైకోట్ల టన్నులు ఉంటుందట. అదే మాడ్యులర్‌ ఇళ్లయితే ఫ్యాక్టరీలో తయారుచేస్తారు కాబట్టి వ్యర్థాలు మన ఇంట్లో వాడే చెత్తబుట్టకు మించి ఉండవట. ఒకవేళ పాత భవనాన్ని కూల్చివేసినా ఆ వ్యర్థాలన్నిటినీ మొత్తంగా రీసైక్లింగ్‌ చేయవచ్చు. దాంతో అటు కాలుష్యమూ తగ్గుతుంది, ఇటు భూమికి వ్యర్థాల భారమూ తగ్గుతుంది. అంతేకాదు, వీటి నిర్మాణంలో తీసుకునే జాగ్రత్తల వల్ల విద్యుత్‌ వినియోగమూ తగ్గుతుంది. పైగా ఈ ఇళ్లను కట్టేటప్పుడే సోలార్‌ ప్యానెల్స్‌, వాన నీటి సంరక్షణ తదితర ఏర్పాట్లను చేసుకోవచ్చు.

వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే- ఆరోగ్యకరమైన రేపటి సమాజం కోసం మాడ్యులర్‌ ఇళ్లను ఎంచుకోమంటున్నారు నిపుణులు. మరి మీ ఇంటికి ఆర్డర్‌ ఎప్పుడు పెడుతున్నారు..?


పెరుగుతున్న ఆదరణ

మాడ్యులర్‌ భవనాలకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీటి నిర్మాణం ఊపందుకుంటోంది. 2020లో మాడ్యులర్‌ నిర్మాణాల మార్కెట్‌ విలువ ఆరు లక్షల కోట్లు. 2028 కల్లా ఇది పది లక్షల కోట్లు దాటవచ్చని ఫార్చూన్‌ బిజినెస్‌ ఇన్‌సైట్స్‌ విశ్లేషకుల అంచనా. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా చూస్తే జనాభాలోనూ పెద్ద వాటా కలిగి ఉన్న ఆసియా పసిఫిక్‌ ప్రాంతమే మాడ్యులర్‌ భవన నిర్మాణంలో ముందు వరసలో ఉంది. అందులోనూ చైనాది మొదటిస్థానం. ఆ తర్వాత వేగంగా పెరుగుతున్నది మన దేశంలోనేనట. జపాన్‌లో కూడా వీటికి మంచి ఆదరణ లభిస్తోంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..