చీమలు నేర్పే పాఠాలెన్నో!

‘చీమల దగ్గరకు వెళ్ళండి... సోమరిపోతుల్లారా. అవి ఎలా పనిచేస్తున్నాయో చూడండి. వాటికి దారి చూపేవాళ్ళు లేరు, శాసించేవాళ్ళు లేరు. అయినా అవి క్షణం వృథా చేయకుండా కష్టపడుతుంటాయి’ అంటాడు కింగ్‌ సాలమన్‌. అది క్రీ.పూ. వెయ్యేళ్ళ క్రితం సంగతి. ‘చీమలు గొప్ప నాగరిక జాతి’ అంటుంది ఖురాన్‌.

Published : 22 Oct 2022 23:33 IST

చీమలు నేర్పే పాఠాలెన్నో!

‘చీమల దగ్గరకు వెళ్ళండి... సోమరిపోతుల్లారా. అవి ఎలా పనిచేస్తున్నాయో చూడండి. వాటికి దారి చూపేవాళ్ళు లేరు, శాసించేవాళ్ళు లేరు. అయినా అవి క్షణం వృథా చేయకుండా కష్టపడుతుంటాయి’ అంటాడు కింగ్‌ సాలమన్‌. అది క్రీ.పూ. వెయ్యేళ్ళ క్రితం సంగతి. ‘చీమలు గొప్ప నాగరిక జాతి’ అంటుంది ఖురాన్‌. ‘నిజాయతీ, విలువల గురించి తెలియాలంటే చీమల్ని చూడాలి’ అంటుంది యూదుల గ్రంథం. దాదాపు అన్ని మత గ్రంథాలలోనూ చీమల ప్రస్తావన కన్పిస్తుంది. మతాలే కాదు; అరిస్టాటిల్‌, ప్లాటో లాంటి తత్వవేత్తలూ వాటిని ప్రశంసించారు. ఏమిటీ వాటి గొప్ప... అంటారా! రండి చూద్దాం..!

పొద్దున్నే ఆఫీసుకు వెళ్ళే హడావుడిలో చక్కెర డబ్బాకి మూత సరిగా పెట్టినట్టు లేను, సాయంత్రానికల్లా దానినిండా చీమలు చేరాయి. ఐదో అంతస్తులోకి ఈ చీమలు ఎలా వస్తాయో ఏమో’... తరచుగా విన్పించే మాటే కదా ఇది.

ఎప్పుడో కోట్లాది సంవత్సరాల క్రితం అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన గ్రహశకలం ఢీకొని అప్పటివరకూ భూమ్మీద ఉన్న డైనోసార్లు అన్నీ అంతరించిపోగా అంతటి ఉత్పాతాన్నీ తట్టుకుని నిలిచింది- చీమ. మంచుఖండమైన ఒక్క అంటార్కిటికా తప్ప ప్రపంచంలో ఇప్పుడు చీమల్లేని ప్రాంతం లేదు. పల్లెటూరి పూరిపాక నుంచి నగరంలోని బహుళ అంతస్తుల భవనం దాకా చీమలు కన్పించని వంటగది ఉండదంటే అతిశయోక్తి కాదు.  

అందుకే ఆ మధ్య శాస్త్రవేత్తలు లెక్కలేసి- ప్రపంచంలో 20 క్వాడ్రిలియన్ల చీమలు ఉంటాయని తేల్చి చెప్పారు. క్వాడ్రిలియన్‌ అంటే 20 పక్కన పదిహేను సున్నాలు పెట్టాలి. ఇంకా వివరంగా చెప్పాలంటే- ఒక్కో మనిషికీ పాతిక లక్షల చొప్పున చీమలు ఉన్నట్లు. ఈ సృష్టిలోని ప్రాణులన్నీ- మనుషులతో కలిపి- ఎంత బరువుంటాయో దానికన్నా ఈ చీమలే ఎక్కువ బరువుంటాయట. పర్యావరణ పరిస్థితులపై పరిశోధనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 అధ్యయనాలను సమన్వయం చేసి తేల్చిన లెక్క ఇది.

మరి అన్ని చీమలు ఉన్నప్పుడు మన వంటింట్లోకి రాకుండా ఎలా ఉంటాయి. డబ్బాలోకే కాదు, పొరపాటున నాలుగు పంచదార పలుకులు కింద పడినా చాలు, ఏ మూల నుంచో పరుగు పరుగున వస్తాయి. ఈసారి అలా వచ్చినపుడు వాటిని గమనించండి. నిజంగానే చీమలు ఈ భూమిమీద నివసిస్తున్న అద్భుతమైన జీవులు. మానవ సమాజంతో పోల్చదగ్గ ప్రత్యేక సంఘనిర్మాణం ఆ బుల్లి ప్రాణుల సొంతం.

పని విభజన ప్రత్యేకం!

చీమలకి మరే కీటకానికీ లేని విశిష్ట గుణాలున్నాయి. వాటిని అధ్యయనం చేసే స్పెషలిస్టుల్ని మిర్మెకాలజిస్టులంటారు. వీరంతా పరిశోధనలు చేసి ఇప్పటికి 12,467 జాతుల చీమల్ని గుర్తించారు. వాటిల్లో 850 దాకా మనదేశంలో ఉన్నప్పటికీ ఎక్కువగా కన్పించేది మాత్రం... ఎర్రచీమలు, నల్లచీమలు, గండుచీమలు, పసుపుపచ్చా గోధుమ రంగుల్లో ఉండే ఫారో యాంట్స్‌, ఆకులతో గూడు అల్లుకునే వీవర్‌ యాంట్స్‌, అడవుల్లో కనిపించే గ్రీన్‌ట్రీ యాంట్స్‌, పొలాల్లో ధాన్యాన్ని సేకరించే హార్వెస్టర్‌ యాంట్స్‌.

ఏ రకం చీమలైనా సంఘజీవనమే గడుపుతాయి. పని విభజన చేసుకుంటాయి. ఈ విభజన వాటి వయసుని బట్టి ఉంటుంది. గుడ్డు, లార్వా, ప్యూపా దశలు దాటి చీమలుగా మారగానే వాటి మొదటి పని పుట్టలోనే ఉండి లార్వా ప్యూపా దశల్లో ఉన్నవాటిని జాగ్రత్తగా చూసుకోవడం, పుట్టకి కాపలా కాయడం. కొంచెం వయసు పెరిగాక పుట్ట నిర్మాణం, తవ్వకం పని చేపడతాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆహార సంపాదన వాటి ప్రధాన బాధ్యత అవుతుంది. అప్పుడు కానీ పుట్ట వదిలి బయటకు రావు. అయితే ‘నువ్వీ పని చేయాలి’ అని నిజానికి వాటికి ఎవరూ చెప్పరు. వాటంతటవే ఒక పద్ధతిగా, అంకితభావంతో చేసుకుంటూ పోతాయి. అయినా పనుల్లో ఎక్కడా తేడా రాదు. ప్రతి పుట్టలోనూ ఒక రాణీ చీమ, కొన్ని మగచీమలు, ఎక్కువ సంఖ్యలో ఆడచీమలు ఉంటాయి. రాణీ చీమకీ, మగ చీమలకీ రెక్కలుంటాయి. పునరుత్పత్తి బాధ్యత అంతా ఒక్క రాణీ చీమదే.

రాణీ చీమ కీలకం

ప్రతి చీమల పుట్టకీ ఒక్కటే రాణీ చీమ ఉంటుంది. పేరుకే రాణి కానీ అధికారంతో సంబంధం లేదు. చీమల పుట్టలో ఎక్కువ తక్కువలు ఉండవు. అన్నీ సమానమే. రాణీ చీమ మగ చీమతో జతకట్టిన వెంటనే విడిగా వెళ్లి సొంతంగా పుట్ట తవ్వుకుని గుడ్లు పెడుతుంది. అవి పిల్లలయ్యేవరకూ తన రెక్కల్నే తిని బతుకుతుంది. ఆ తర్వాత ఆ పిల్లలే వందలూ వేలూ అయిపోతాయి. రాణి చీమ ఒక్కసారి మాత్రమే జతకడుతుంది కానీ జీవితాంతం రోజుకు కొన్ని వందల చొప్పున గుడ్లు చొప్పున పెడుతూనే ఉంటుంది. పెట్టిన గుడ్లలో ఎన్ని మగ, ఎన్ని ఆడ చీమలు ఉండాలీ అన్నది కూడా రాణీ చేతిలోనే ఉంటుంది. మగచీమకు మరో పనేమీ ఉండదు కాబట్టి అవి చాలా తక్కువ ఉండేలా చూస్తుంది. ఆడచీమల్లో కొన్నిటికి మాత్రమే మళ్లీ రాణీ చీమలు అయ్యే అవకాశం ఇస్తుంది. మిగిలిన గుడ్లమీద ఒక రసాయనాన్ని విడుదల చేస్తుంది. దాంతో అవి రెక్కలు లేని, గుడ్లుపెట్టలేని ఆడచీమలుగా పుడతాయి. వీటినే ‘వర్కర్‌ యాంట్స్‌’ అంటారు. మనకు పనిచేస్తూ కన్పించేవన్నీ ఇవే. రెక్కలతో పుట్టిన కొన్ని ఆడచీమలు ఏపుగా పెరిగి మగ చీమతో జతకట్టి విడిగా మరో పుట్ట పెట్టడానికి వెళ్లిపోతాయి. మగ చీమలు జతకట్టిన వెంటనే చనిపోతాయి. మిగిలేది ఇక శ్రమజీవులైన ఆడచీమలే.

చీమల శరీర నిర్మాణమూ విచిత్రమే. వాటికి మనలాగా ఊపిరితిత్తులూ చెవులూ ఉండవు. రక్తానికి రంగు ఉండదు. శరీరంపై ఉండే సన్నని రంధ్రాల ద్వారా గాలి పీల్చుకుంటాయి. రెండు కళ్లు ఉన్నట్లు కన్పిస్తాయి కానీ ఒక్కో కంటిలోనూ మళ్లీ బోలెడన్ని చిన్న కళ్లుంటాయి. తలమీద ఏంటెన్నాలు ఉంటాయి. వాటి పొట్టలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి తమకోసం, రెండోది అందరికోసం. చీమలు ఒకలాంటి రసాయనాలను విడుదల చేస్తాయి. యాంటెన్నాలతో ఆ రసాయనాల వాసనను పసిగడతాయి ఇతర చీమలు. అదే వాటి సంభాషణ. చీమ కోరలు చాలా బలంగా ఉంటాయి. వాటితోనే అవి నేలలోపలికి లోతుగా తవ్వేసి పుట్టలు కట్టుకుంటాయి. చీమలు పనిచేసే విధానాన్ని అధ్యయనం చేసిన పరిశోధకులు వాటి గుణగణాలూ శక్తి సామర్థ్యాలతో పెద్ద చిట్టానే తయారుచేశారు. క్రమశిక్షణ, సమయపాలన, పొదుపు, తోటి చీమల పట్ల ప్రేమ, సహకారం... ఇవన్నీ చీమల్లో కన్పిస్తాయి.

బృందస్ఫూర్తి

టీమ్‌ వర్క్‌కి చక్కటి ఉదాహరణ చీమలే. ఒక ప్రయోజనం కోసం అన్నీ కలిసి ఒకేలా పనిచేయడం అబ్బురపరుస్తుంది. సమావేశాలూ చర్చలూ ఏమీ లేకుండా జరగాల్సిన పని గురించి అవి మిగిలినవాటితో క్షణాల్లోనే సంభాషిస్తాయి. పరిశీలనతోనే నిర్ణయాలు తీసుకుంటాయి. ఒక చీమ ఆహారం తెస్తూ కనిపిస్తే అది వచ్చే వేగాన్ని బట్టి అక్కడ ఇంకా ఆహారం ఉందా, వెళ్లాల్సిన అవసరం ఉందా అన్నది పుట్ట దగ్గర ఉన్న చీమలు నిర్ణయించుకుంటాయట. వరదలు వచ్చినప్పుడు ఒక్కోసారి వాటి పుట్టల లోపలికి నీళ్లు వచ్చేస్తాయి. అలా వచ్చినప్పుడు చీమలు కంగారుపడి తలో దారీ పట్టవు. పుట్టలో ఉన్న బలమైన చీమలన్నీ కలిసి చేయీ చేయీ పట్టుకుని నిలబడతాయి. వాటిమీద చిన్న, వృద్ధ చీమలు చేరతాయి. ఏ ఆధారమూ లేకుండా కేవలం చీమలే బల్లకట్టులా తయారై నీటిపైన తేలుతూ సురక్షిత ప్రాంతానికి చేరుకుంటాయి. మనుషుల్లాగా అవి కూడా ఒకదానినొకటి పట్టుకుని నిలబడి మిగతా వాటికి వంతెనలాగా కూడా పనిచేస్తాయి. ప్రతి పనిలోనూ అవి బృందస్ఫూర్తిని ప్రదర్శిస్తాయి. టైమ్‌ మేనేజ్‌మెంట్‌లోనూ చీమల తర్వాతే ఎవరైనా. అవి ఎండని బట్టి దిక్కుల్నీ సమయాన్నీ గుర్తించగలవు.

శుభ్రతకు పెద్దపీట

ఎలాంటి వాతావరణానికి అయినా అలవాటుపడిపోయి బతకగలుగుతున్న చీమలపై యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌హేగెన్‌కి చెందిన సెంటర్‌ ఫర్‌ సోషల్‌ ఎవొల్యూషన్‌ పరిశోధకులు పలు పరిశోధనలు చేశారు. నిజానికి లక్షలాది చీమలు పుట్టలో ఒకేచోట ఉండటం వల్ల వాటికీ మనకీ కూడా ఎన్నో వైరస్‌లూ వ్యాధులూ ప్రబలే అవకాశం ఉంది. కానీ చీమలు అలా వ్యాధులతో చనిపోయిన దాఖలాలు కానీ వాటివల్ల వైరస్‌లు వ్యాపించిన సందర్భాలు కానీ లేవు. ఈ అంశం మీద చేసిన పరిశోధనలో తేలిందేమిటంటే- అవి సొంతంగా వైద్యం కూడా చేసుకుంటున్నాయని. అడవుల్లో ఉండే చీమలు చెట్లలోని రసాలను యాంటిబయోటిక్స్‌లా ఉపయోగిస్తాయట. వాటి పుట్టలలోకి బ్యాక్టీరియా, ఫంగై లాంటివి చేరకుండా ఉండటానికి చెట్ల బెరళ్ళ నుంచి స్రవించే ద్రవాలను(ట్రీ రెసిన్స్‌- వీటికి యాంటి మైక్రోబియల్‌ లక్షణాలు ఉంటాయి) తెచ్చి పుట్ట మట్టిలో కలుపుతాయట. వాటి పుట్టల్లో ఏకంగా 20 కిలోల దాకా రెసిన్‌ ఉండటాన్ని గమనించారు పరిశోధకులు. అంతేకాకుండా చీమలు సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఉన్న ప్రాంతానికి వెళ్లి వచ్చినప్పుడు పుట్ట దగ్గరున్న మిగిలిన చీమలు వాటిని శుభ్రంచేసి కానీ లోనికి రానీయవట. చీమల శరీరంలోనూ యాంటి మైక్రోబియల్‌ రసాయనాలను తయారుచేసే గ్రంథి ఒకటి ఉంది. దానివల్ల కూడా వాటిని సూక్ష్మక్రిములు ఏమీ చేయలేవు. శుభ్రత కూడా వాటి ఆరోగ్యానికి మరో కారణం. ఎప్పటికప్పుడు చెత్తను తీసుకెళ్లి పుట్టకు దూరంగా పడేస్తాయి. రాణీ చీమను అవి రక్షించుకునే తీరు మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. అది పుట్టలోనుంచి బయటకు రాదు. లార్వా, ప్యూపా దశల్లో ఉన్నవేమో రాలేవు. పుట్టలో నిల్వ ఉన్న ఆహారం తింటాయి. ఇంకా వాటికి కావలసిన ద్రవాహారాన్ని స్టోరేజ్‌ యాంట్స్‌ తమ రెండో పొట్టలో దాచుకుని తెచ్చి నోటి ద్వారా వాటికి అందిస్తాయి. ఒకవేళ బయటి నుంచి తెచ్చిన ఈ తాజా ఆహారంలో విషపదార్థాలు ఏమన్నా ఉంటే ఈ చీమలే చచ్చిపోతాయి. రాణికీ, రేపటి తరానికీ ఎలాంటి హానీ జరగకుండా చేసుకున్న ఏర్పాటిది.

ఇవన్నీ పక్కనపెట్టి ఒకవేళ ఏదైనా చీమ జబ్బు పడడమో, లేక వృద్ధాప్యం మీద పడడమో జరిగితే... అప్పుడు అవేం చేస్తాయో తెలుసా! తమ అనారోగ్యం మిగిలినవాటికి అంటకూడదని పుట్టకి దూరంగా వెళ్లి ఒంటరిగానే మరణాన్ని ఆహ్వానిస్తాయట. చక్కటి క్రమశిక్షణతో సాగే చీమల ఈ జీవనవిధానం మానవ సమాజానికీ ఎంతో మేలు చేస్తోందంటారు శాస్త్రవేత్తలు.

ఎన్నో ప్రయోజనాలు

చీమల్ని ‘పర్యావరణ ఇంజినీర్లు’ అంటారు. అవే లేకపోతే నేల సారహీనంగా, గట్టిగా రాయిలాగా అయిపోయేది. చీమలు పుట్టలు పెట్టుకోవడానికి సొరంగాలు తవ్వీ తవ్వీ వదులుగా చేయడం వల్ల అది ఆరోగ్యంగా పంటలకు అనువుగా తయారవుతోంది. వానపాములకన్నా చీమలే ఈ పనిని ఎక్కువగా చేస్తాయంటున్నారు పరిశోధకులు. అదే కాక, వ్యర్థాలు కుళ్లి భూమిలో కలిసిపోయేలా చేయడానికీ విత్తనాల వ్యాప్తికీ తోడ్పడుతున్నదీ చీమలే. కొన్నిరకాల చెట్లు ఫలదీకరణకి పూర్తిగా చీమల మీదే ఆధారపడతాయట. పంటల్ని పాడుచేసే పలు కీటకాల్ని ‘వీవర్‌ యాంట్స్‌’ అనే చీమలు తింటాయి. జీడిమామిడి తోటల్లో వీటిమీద ఇటీవలే ఒక పరిశోధన చేశారు. క్రిమిసంహారకాలు వాడకుండా ఈ చీమల సాయంతో సాగుచేస్తే 49 శాతం దిగుబడి పెరిగిందట. ఉత్పత్తిలో నాణ్యత ఏకంగా 71 శాతం పెరిగిందట. ఈ దిశగా ఇప్పుడు మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. చీమల్ని ప్రకృతిసిద్ధమైన పారిశుద్ధ్య కార్మికులంటారు. ఇళ్లలో కిందపడిన ఆహారపదార్థాలను తీసుకెళ్లడమే కాదు, బొద్దింకల లార్వాలను తినేయడం ద్వారా వాటి వ్యాప్తినీ అరికడతాయి. అచ్చంగా చీమల్ని తినే జంతువులూ ఉన్నాయి. కొన్ని చోట్ల గిరిజనులూ వీటిని ఆహారంగా తీసుకుంటున్నారు. జీవ వైవిధ్యాన్ని సమతౌల్యం చేయడంలో వీటి పాత్ర కీలకమైనదే. అసలు చీమలే లేకపోతే ప్రపంచం ఇంత అందంగా ఉండేది కాదంటారు శాస్త్రవేత్తలు.

పలు రోబోలను అనుసంధానించి ఒకే పనిచేయడానికి వాడే ‘స్వార్మ్‌ రోబోటిక్స్‌’కి స్ఫూర్తి చీమలదండు కాగా, శక్తిమంతమైన అంతరిక్ష నౌక డిజైన్‌కి ప్రేరణ చీమ శరీరమేనట!

ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే... అనాదిగా చీమ మనకి ఆదర్శం అయింది. చిన్నపిల్లల కథల్లో చేరి క్రమశిక్షణ నేర్పుతోంది..! పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోయి జీవించడమెలాగో పెద్దలకు చెబుతోంది!


కుడితే... బుల్లెట్‌ దిగినట్లే!

నకు ఇళ్లలో ఆహార పదార్థాల చుట్టూ చేరే చీమల రకాలను షుగర్‌ యాంట్స్‌ అంటారు. ఇవి పెద్దగా కుట్టవు కానీ చీమల్లోనూ కొన్ని ప్రమాదకరమైనవి ఉన్నాయి. పెద్ద పెద్ద కోరలతో ఇతర కీటకాలను చంపి తినేసే ఆర్మీ చీమలు కుట్టాయంటే చుర్రుమంటుంది. ఇవి ఇతర కీటకాల మీదే కాదు, మనుషుల మీదా దాడిచేస్తాయి. ఎర్రచీమల్లో పెద్దగా ఉండి కుట్టేవాటిని ఫైర్‌ యాంట్స్‌ అంటారు. పేరుకు తగ్గట్టే అవి కుడితే మంట తీవ్రంగా ఉండి దద్దుర్లు వస్తాయి. చిన్న చిన్న జంతువులని కుట్టి చంపగలవు ఈ చీమలు. ఇక, బులెట్‌ యాంట్స్‌ కుడితే అచ్చంగా తుపాకీ గుండు దిగినట్లే ఉంటుందట. కీటకాలు కుడితే పెట్టే నొప్పి తీవ్రతని కొలిచే స్కేల్‌లో మొదటి స్థానం దీనిదే. ఆ నొప్పితో 24 గంటలపాటు ప్రాణం పోయినంత పనవుతుందట. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర చీమలు’ అని గిన్నిస్‌ బుక్‌ పేర్కొన్న వాటిని ‘బుల్‌డాగ్‌ యాంట్స్‌’ అంటారు. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కన్పించే ఇవి శత్రువులను వెంటాడి మరీ కుడతాయి. ఇవి కుడితే ఒకోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు.


చాలా సింపుల్‌..!

ఇంట్లో చీమలు చేరాయంటే వదిలించుకోవడం కష్టం అనుకుని చాలామంది రసాయన క్రిమిసంహారకాలను వాడతారు. నిజానికి చీమల్ని దూరంగా ఉంచడం చాలా తేలిక. మూలల్లో, గోడకీ నేలకీ మధ్య ఏర్పడే రంధ్రాలనుంచి అవి వస్తాయి కాబట్టి వాటిని మూసివేయాలి. ఆహారపదార్థాలన్నిటికీ మూతలు గట్టిగా బిగించి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే చీమల సమస్య ఉండదు. ఒకవేళ వచ్చినా ఆ మార్గంలో చాక్‌పీసుతో గీత గీస్తే చాలు. చీమలు అవి నడిచిన దారిలో ఫెరమోన్స్‌ అనే రసాయనాలను విడుదల చేస్తాయి. వాటి ఆధారంగానే దారి గుర్తుంచుకుంటాయి. చాక్‌పీసుతో గీసినప్పుడు ఆ వాసన పోతుంది కాబట్టి వాటికి దారి గుర్తుండదు. ఇక, పువ్వుల్లో మకరందం కోసం కొన్నిరకాల చీమలు మొక్కల్లోకీ వస్తాయి. అలాంటప్పుడు గోరువెచ్చటి నీటిలో బోరిక్‌ యాసిడ్‌ కలిపో, నీటిలో కొద్దిగా షాంపూ కలిపో, నిమ్మరసం కలిపో స్ప్రేచేస్తే చాలు. కీర దోసకాయ తొక్కలు, దాల్చినచెక్క పొడి, వెనిగర్‌ లాంటి వాసనలూ... చీమల్ని దూరంగా ఉంచుతాయి.


ఆశ్చర్యపరుస్తాయి..!

చీమలపైన చేస్తున్న పరిశోధనల్లో వెల్లడైన విషయాలు పరిశోధకుల్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

* చిన్నగా సన్నగా కన్పించే ఈ కీటకాలు ఏకంగా తమ బరువుకి యాభై రెట్లు, కొన్ని జాతులైతే వందరెట్లు ఎక్కువ బరువునీ మోయగలవు. అత్యంత బలవంతుడైన మనిషి కూడా తన బరువు కన్నా రెండున్నర రెట్లు బరువును మాత్రమే మోయగలడు.

* కీటకాల్లో చీమలు దీర్ఘాయుష్కుల కిందే లెక్క. మామూలు చీమలు ఏడాది పైన బతుకుతాయి కానీ రాణీ చీమ చాలా ఏళ్లు బతుకుతుంది. అది చనిపోయాక కొద్దిరోజుల్లోనే ఆ పుట్టలోని చీమలన్నీ చనిపోతాయి.

* మిగిలిన ప్రాణుల్లా చీమలు నిద్రపోవు. పన్నెండు గంటలకోసారి ఎనిమిది నిమిషాలపాటు విశ్రాంతి తీసుకుంటాయి.

* ఎయిర్‌ కండిషనర్‌ అవసరం లేని భవనాలు నిర్మించడానికి చీమల పుట్టల్నే నమూనాగా తీసుకుంటున్నారు ఇంజినీర్లు. అవి భూమి లోపలా, పైనా కూడా రెండంతస్తుల మేడంత పుట్టల్ని చక్కగా గాలి వెళ్లేలా కట్టుకుంటాయి. వాన కురిసినా పడిపోకుండా గోడలు బలంగా ఉండేందుకు మట్టి, ఇసుకతో పాటు పుల్లల్నీ వాడతాయి. లోపల గుడ్లకీ, ఆహారం నిల్వ చేయడానికీ, విశ్రాంతికీ పలు గదులుంటాయి.

* మనుషులు కోళ్లనీ మేకల్నీ పెంచుకుని ఆహారంగా వినియోగించుకున్నట్లు చీమలు ‘ఎఫిడ్స్‌’ అనే కీటకాల్ని పెంచుకుంటాయి. ఆహారం దొరకనప్పుడు వాటిని తినేస్తాయి. కొన్ని జాతుల చీమలు ఫంగస్‌లాంటి వాటిని సాగుచేస్తాయి.

* ఆహారాన్ని కలిసి మోసుకెళ్లడమే కాదు, తోటి చీమ చనిపోయినా అన్నీ కలిసి తీసుకెళ్తాయి. పుట్ట పక్కన ఒక ప్రత్యేకమైన స్థలాన్ని శ్మశానంలా వినియోగిస్తాయి.

* కొన్ని చీమలు చుట్టుపక్కల పుట్టల మీద దాడి చేసి అక్కడి చీమల్ని తమ బానిసలుగా చేసుకుని పనులు చేయించుకుంటాయి.

* చాలా ప్రాంతాల్లో చీమల్ని ఆహారంగా తీసుకుంటారు. జంతుసంబంధ మాంసకృత్తులకు ప్రత్యామ్నాయంగా వీటిని పరిగణించవచ్చంటున్నారు పరిశోధకులు. వీటిల్లో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువ. నారింజ పండులోకన్నా నల్లచీమల్లో ఎక్కువ పాలీఫెనాల్స్‌ ఉన్నట్లు ఒక పరిశోధనలో వెల్లడైంది. థాయ్‌లాండ్‌, కొలంబియా లాంటి దేశాల్లో వీటిని ప్రాసెస్‌ చేసి మాంసం కన్నా ఎక్కువ ఖరీదుకి అమ్ముతారు. క్యాండీలు, లాలీపాప్‌లు, చాక్లెట్లు, వేఫర్స్‌... అన్నీ చీమలతో తయారై పిల్లలకీ పెద్దలకీ కూడా నోరూరిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..