Updated : 26 Jun 2022 07:23 IST

సరదా కథలు

మధ్యతరగతి బతుకుల్లోని భిన్న కోణాలను హాస్యరసం మిళాయించి చూపించిన కథలివి. గుంటూరు గోంగూర అమోఘమైన రుచినివ్వడంతో ఆగకుండా కాంట్రాక్టర్ల, ఆఫీసర్ల పనులు సానుకూలపరచగలదని ఓ కథ నిరూపిస్తుంది. ఉద్యోగానికి వచ్చిన యువకుడి వింత ఇంటిపేరును కంపెనీ ఎండీ ఎకసెక్కెం చేసే నవ్వులాటలతో మొదలైన ‘లేడీ బాస్‌’లో కోపతాపాలతో విడిపోయిన ఆప్తులు చివరకు కలుస్తారు. స్నేహతురాలి పుట్టినరోజు సరదాగా గడపటం కోసం అనారోగ్యమని అబద్ధం చెప్పి సెలవు పెడితే మేనేజర్‌ అంబులెన్స్‌ పంపించి ఐసీయూలో చేర్చిన ప్రహసనం ‘హేపీ బర్త్‌ డే’. అవ్యక్త ప్రేమలూ, పశ్చాత్తాపాలూ, పోలీసుల రైడింగులూ, ఆఫీసుల్లో మామూళ్లూ, పెళ్లిళ్లలో కట్నాలూ, జీళ్లపాకం టీవీ సీరియళ్లూ.. ఇలా వస్తువైవిధ్యంతో ఈ పుస్తకంలోని 30 కథలూ హుషారుగా సాగుతాయి; కాలక్షేపాన్నిస్తాయి. కథనంతోపాటు సంభాషణలూ బాగున్నాయి. 

- సీహెచ్‌. వేణు

గుంటూరు గోంగూర (హాస్య కథలు)
రచన: వాణిశ్రీ
పేజీలు: 164; వెల: రూ.99/-  
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు


లేఖాసాహిత్యం

ఉత్తరం... మనసులోని మాటను అవతలి వ్యక్తికి చేరవేసే వారధి. నాటి పోస్టు కార్డు నేటి ఈమెయిల్‌, వాట్సాప్‌ సందేశాలుగా మారింది కానీ ఈ అనుసంధాన సాధనానికి సాహిత్యంలో ప్రత్యేక స్థానమే ఉంది. పెదవి విప్పి చెప్పలేని ఊసులెన్నిటికో అక్షరరూపమై లేఖాసాహిత్యంగా వెలుగొందింది. కాలంతో పాటు వచ్చిన మార్పుల్లో అది వెనక్కి వెళ్లినా మనసుల్లో దాని స్థానం చెక్కుచెదరలేదనడానికి సాక్ష్యం ఈ లేఖావళి. 175 మంది రచయిత్రులు రాసిన లేఖల సమాహారమిది. ఏమి లేఖలివీ అంటే- తల్లీబిడ్డలు ఒకరికొకరు రాసుకున్నవీ, అత్తాకోడళ్లు రాసుకున్నవీ మాత్రమే కాదు, తండ్రికీ స్నేహితులకీ ఆఖరికి దేవుడికీ... రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయి. కొన్ని పెదవుల మీద చిరునవ్వులు పూయిస్తే, కొన్ని కళ్లను చెమరింప జేస్తాయి. కొన్ని వ్యక్తిత్వాలకు అద్దం పడితే, మరికొన్ని దూరమైన బంధాలను తట్టిలేపుతాయి. మొత్తంగా లేఖాసాహిత్యాభిమానులను అలరించే ప్రయోగమిది.

- శ్రీ

ప్రియమైన నీకు...
సంపాదకురాలు: జ్యోతి వలబోజు
పేజీలు: 480; వెల: రూ. 300/-
ప్రతులకు: ఫోన్‌- 8096310140


స్ఫూర్తికథలు

ఒకప్పుడు వ్యవసాయం ప్రకృతిసిద్ధమైన విధానాలతో పర్యావరణహితంగా సాగేది. రసాయనాల వాడకం పెరగడంతో మారిపోయిన ఆ పరిస్థితి మనిషి ఆరోగ్యం మీద చూపుతున్న దుష్ప్రభావం చూశాక రైతు మళ్లీ ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనతో దిశ మార్చుకుని రసాయన రహిత సేద్యంతో విజయపథంలో సాగుతున్న వందమంది రైతుల స్ఫూర్తికథలివి. తాము నమ్మిన విధానాన్ని ఆచరణలో పెడుతున్న వీరిలో వరీ, కూరగాయలూ మాత్రమే కాదు, పూలూ పండ్లూ సాగు చేస్తున్నవారూ ఉన్నారు. ముప్పయ్యేళ్లుగా పొలంలో ప్రయోగాలు చేస్తూ రికార్డు సృష్టించిన నాగరత్నం నాయుడు, 75 సెంట్ల పొలంలో కొబ్బరితో పాటు 12 రకాల పండ్ల చెట్లనీ, అంతరపంటల్నీ సాగుచేసే రోశయ్య, అమెరికాలో ఉద్యోగం కన్నా సొంతూళ్లో సాగే మిన్న అనుకున్న విశ్వేశ్వరరెడ్డి... ఇలాంటి మరెందరి గురించో తెలుసుకోవచ్చు ఈ పుస్తకంలో.

- పద్మ

ప్రకృతి సైన్యం; రచన: డి.ప్రసాదరావు
పేజీలు: 280; వెల: రూ. 500/-
ప్రతులకు: రైతునేస్తం
ఫోన్‌- 9676797777


విషాద కవితా వీచికలు!

దిల్లీ, కశ్మీర్‌లతో మొదలుపెట్టి పోలండ్‌, జేరుసలేం వంటి మధ్య ఆసియా ప్రాంతాల మీదుగా అమెరికాదాకా ప్రయాణిస్తాం ఈ కవితల ద్వారా. ఆయా ప్రాంతాల సుప్రసిద్ధ కవులు మనల్ని తీసుకెళ్తారు... కాకపోతే అక్కడి సామాన్యుల కన్నీటి చారికల్ని చూపిస్తూ, విషాద కవితా సంచారం చేయిస్తూ. పోలండ్‌ ‘ఆషివిట్జ్‌’లో నాజీల కాన్సెంట్రేటెడ్‌ క్యాంప్‌ అల్మరాల్లో అట్టకొట్టుకుపోయి దొరికిన స్త్రీల వెంట్రుకల్ని చిత్రీకరిస్తూ సాగే కవిత ఒకటి ఇలా ముగుస్తుంది - ‘పడి ఉంటుంది ఓ బూడిద కొట్టుకుపోయిన/పిలకజడ/స్కూల్లో కొంటె పిల్లలు/గుంజిన/చిన్న రిబ్బన్‌తో’(పిలకజడ- తదేవుష్‌ రోజేవిచ్‌) అని. కవిదెప్పుడూ ప్రపంచ భాష అని చాటే అద్భుతమైన పదచిత్రణ ఇది. అమెరికా అగ్రరాజ్యం కదా... అక్కడివాళ్లకేం అనుకుంటాం కానీ ‘కాదు. నాకు బులెట్‌ ప్రూఫ్‌ కావాలి స్కూల్‌ కోసం. నాకు చావాలని లేదు’ అని ఓ పాప ఎందుకు అందో  ‘ఉపాయం’ కవిత చెబుతుంది!

- అంకిత

పదబంధం (దేశదేశాల కవిత్వ కరచాలనం)
రచన: నారాయణస్వామి వెంకటయోగి
పేజీలు: 312; వెల: రూ.200/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


బుక్‌ షెల్ఫ్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని