సూప్‌... తాగను, తింటాను..!

‘సూప్‌ ఎవరైనా తింటారా... తాగుతారు కానీ’ అనిపిస్తుంది కదూ. నిజమే కానీ, ఇప్పుడు చాలామంది సూప్‌ను తింటున్నారు.

Published : 17 Dec 2022 23:55 IST

సూప్‌... తాగను, తింటాను..!

‘సూప్‌ ఎవరైనా తింటారా... తాగుతారు కానీ’ అనిపిస్తుంది కదూ. నిజమే కానీ, ఇప్పుడు చాలామంది సూప్‌ను తింటున్నారు. ఒకప్పుడు ఏవో కొద్దిగా కూరగాయల ముక్కలూ కాస్త మిరియాలూ ఉప్పూ వేసి కొంతమేర ఆకలిని తగ్గించడానికి తాగే సూప్‌ను, అన్ని రకాల పోషకాలూ జోడించి పూర్తి భోజనానికి ప్రత్యామ్నాయంగానూ తింటున్నారు.

సూప్‌... గతంలో సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితం. కానీ రోజురోజుకీ పెరుగుతోన్న రెస్టరెంట్‌ సంస్కృతితో ఈమధ్య ఇది అందరికీ పరిచయమైంది. అందునా వర్షాకాలం, చలికాలాల్లో వేడివేడిగా గొంతు దిగే సూప్‌కి డిమాండ్‌ కాస్త ఎక్కువే మరి. అయితే పలుచని సూప్‌ ఈమధ్య కాస్త చిక్కబడింది. అంటే- తక్కువ క్యాలరీలూ ఎక్కువ పోషకాలూ ఉండేలా చేస్తున్నారన్నమాట. దాంతో సూప్‌ భోజనానికి ప్రత్యామ్నాయంగానూ మారింది.

ఎలా చేస్తారు?

కూరగాయల్నీ ధాన్యాల్నీ పప్పుల్నీ మటనూ చికెనుల్నీ ఉడికించిన నీళ్లలో కొద్దిగా ఆయా ముక్కల్ని వేసి పారదర్శకంగానూ లేదా ఆలూ, చిలగడదుంప, పాలదుంప, బియ్యం, మొక్కజొన్న... వంటి పిండిపదార్థాలను కలిపి కాస్త చిక్కగానూ సూప్‌లు చేస్తుంటారు. ఈ రెండూ కాకుండా పాలు, మీగడ, వెన్న, గుడ్డు వేసి చేసే క్రీమీ సూప్స్‌ కూడా ఉన్నాయి. నిజానికి నీటి శాతం తక్కువగానూ ముక్కలన్నీ ఎక్కువగానూ వేసి చిక్కగా చేసేదాన్ని స్ట్యూ అంటారు. దీని వాడకం మనతో పోలిస్తే పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ. కానీ ఇటీవల పాక్షిక ఘనాహారంగా ఉండే ఈ చిక్కని స్ట్యూలనే సూప్‌గా పిలుస్తూ మనవాళ్లూ తింటున్నారు. దాంతో రెస్టరెంట్లూ స్టార్‌ హోటల్స్‌లోనూ వీటికి డిమాండ్‌ పెరిగింది. కొన్ని కంపెనీలు రెడీమేడ్‌ ప్యాక్‌లనీ మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఎందుకంటే ఆరోగ్యరీత్యా... బరువు తగ్గడం కోసం చాలామంది రాత్రిపూట మితాహారమే తీసుకుంటున్నారు. అందులో భాగంగా పప్పులు, మిల్లెట్స్‌, రైస్‌, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, పుట్టగొడుగులు, మటన్‌, చికెన్‌, పీతలు, నూడుల్స్‌, పాస్టా... ఇలా రకరకాల సూప్‌లు చేసుకుని వేడివేడిగా తింటున్నారన్నమాట. అదీగాక సలాడ్‌గా తినలేని ఆకుల్నీ, పీచు ఎక్కువగా ఉండి నోటిగా అంతగా రుచించని క్వినోవా, బార్లీ, ఓట్స్‌... వంటి పదార్థాలని కూడా సూప్‌ రూపంలో తింటే నోటికీ రుచిగా ఉంటుంది మరి. అన్నం తిననని మారాం చేసే పిల్లలకీ వృద్ధులకీ కూడా ఆహారాన్ని సూప్‌ రూపంలో ఇస్తే ఇష్టంగానూ తింటారు. త్వరగానూ జీర్ణమవుతుంది.

ఎందుకీ సూప్‌?

వేడిగా మృదువుగా ఉండే సూప్‌లో నీటిశాతం ఎక్కువగా ఉండటంతో అందులోని పోషకాలన్నీ కూడా ఒంటికి పట్టి చర్మం తాజాగా ఉంటుంది. అందులో వాడే సుగంధద్రవ్యాలు జీర్ణవ్యవస్థని మేల్కొలిపి, అది చక్కగా పనిచేసేందుకు తోడ్పడతాయి. కూరగాయల సూప్‌లో ఉండేవన్నీ సంక్లిష్ట పిండిపదార్థాలు కావడంతో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. దాంతో రక్తంలో చక్కెర నిల్వలు పెరగవు. కాబట్టి మధుమేహులకీ మంచిది. సూప్‌ల్లో ఉల్లి, లీక్స్‌, కొత్తిమీర... వంటివి వాడటం వల్ల పొటాషియం ఎక్కువగా లభ్యమవడంతోబాటు అది శరీరంలో అధికంగా ఉన్న సోడియంను బయటకు పంపేందుకు తోడ్పడుతుంది. ముఖ్యంగా కూరగాయల్ని ఉడికించి చేసే సూపు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల పొట్ట నిండుతుంది. స్వీట్లూ స్నాక్సూ తియ్యని శీతలపానీయాలూ వంటివి తీసుకోవడం తగ్గుతుంది. దాంతో బరువూ తగ్గుతారు. అందుకే ఒకప్పుడు భోజనానికి ముందు తీసుకునే పలుచని సూప్‌, నేడు అదే ప్రధాన ఆహారంగా మారిపోయేంత చిక్కబడిందన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..