అమ్మాయికో ఉత్తరం

‘‘అమ్మా, నాన్నగారి సంవత్సరీకం కూడా అయిపోయిందిగా... ఇప్పుడైనా మాతోపాటూ వస్తావా అమ్మా..?’’‘‘.....’’‘‘ఏంటమ్మా, ఏం మాట్లాడవు... ఇంకా దేని గురించి నీ ఆలోచన..?’’ ఏం చెబుతుందోనని ఆత్రంగా తల్లి మొహంలోకి చూశాడు అవినాష్‌.

Published : 08 Jan 2022 23:25 IST

అమ్మాయికో ఉత్తరం

కె.రాజేశ్వరి

‘‘అమ్మా, నాన్నగారి సంవత్సరీకం కూడా అయిపోయిందిగా... ఇప్పుడైనా మాతోపాటూ వస్తావా అమ్మా..?’’

‘‘.....’’

‘‘ఏంటమ్మా, ఏం మాట్లాడవు... ఇంకా దేని గురించి నీ ఆలోచన..?’’ ఏం చెబుతుందోనని ఆత్రంగా తల్లి మొహంలోకి చూశాడు అవినాష్‌.

‘‘ఇప్పటికిప్పుడంటే ఎలారా... పొలం కౌలు గురించి మాట్లాడాలి... ఉన్నపళంగా ఇల్లు ఇలా వదిలేస్తే ఎలా... అనవసరమైనవి వదిలించి, అవసరమైన సామానంతా ఓ గదిలో సర్ది, మిగిలిన ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తే... ఎవరో ఒకరు ఇల్లు కనిపెట్టుకుని ఉంటున్నారన్న ధైర్యం ఉంటుంది’’ మౌనంగా ఉన్న కోడలు వైపు చూస్తూ అంది.

‘‘ఆ పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడమ్మా... నాకు ఎక్కువ రోజులు లీవ్‌ పెట్టడానికి కూడా కుదరదు. మళ్లీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను’’ అన్నాడు.

‘‘సర్లేరా, నువ్వంతగా చెప్పాలా... నీ దగ్గరకి కాక, నేనెక్కడికి పోతాను చెప్పు’’ అంటూ మురిపెంగా కొడుకువైపు చూసింది రుక్మిణమ్మ.

*             *              *

వాసుదేవరావు, రుక్మిణమ్మ దంపతులకి ఒక కొడుకూ, కూతురు. ఉన్న కొద్దిపాటి పొలంతోపాటూ మరికొంత పొలం కౌలుకి తీసుకుని ఎంతో కష్టనష్టాల కోర్చి కొడుకుని ఎమ్‌.టెక్‌, కూతుర్ని డిగ్రీ వరకూ చదివించారు. డిగ్రీ కాగానే కూతురి అందాన్ని చూసి అవినాష్‌ ఫ్రెండ్‌ రేవంత్‌ ఇష్టపడి మరీ పెద్దలనొప్పించి పెళ్లి చేసుకున్నాడు. కొడుక్కి మంచి జీతంతో ఓ ఎమ్‌.ఎన్‌.సి కంపెనీలో ఉద్యోగం రాగానే ఓ ధనవంతుల సంబంధం వెతుక్కుంటూ వచ్చింది.

అల్లుడికీ కొడుక్కీ ఐదెంకల్లో జీతం రావటం, వాళ్లు జీవితంలో బాగా సెటిలై పిల్లాపాపలతో సంతోషంగా గడపటం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతగానో మురిసిపోయారు... వాళ్ల సంతోషం చూసి విధికి కన్ను కుట్టిందేమో మెట్లమీది నుంచి జారిపడి తలకి బలంగా దెబ్బ తగలటంతో వాసుదేవరావుని హస్పిటల్‌కి తీసుకెళ్లేలోపే మరణించాడు. తనని ఒంటరి దాన్ని చేసి భర్త అంత హఠాత్తుగా దూర మవటాన్ని తట్టుకోలేక పోయింది రుక్మిణమ్మ. కోలుకోవటానికి చాలా సమయం పట్టింది.

తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేక పోయాడు అవినాష్‌. ‘‘ఒక్కదానివే ఇక్కడ ఎందుకమ్మా... మాతోపాటూ వచ్చేయ్‌...’’ అని ఎన్నోసార్లు బతిమాలాడు.

‘‘ఇప్పుడు నాకెక్కడికి రావాలని లేదురా... కొద్దిరోజులాగాక చూద్దాంలే’’ అంది.

ఆ తర్వాత ‘‘సంవత్సరీకం కానీయ్‌’’ అంది. అందుకనే సంవత్సరీకం కాగానే తల్లిని తనతో తీసుకెళ్లాలని అడిగాడు.

*             *              *

‘‘అమ్మా, అన్నయ్యతో చెన్నై వెళ్లావంటే మళ్లీ ఎప్పుడొస్తావో ఏమో... నాన్న ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి రావడమే, నువ్వు మా ఇంటికి వచ్చి కూడా ఏడాదిన్నర దాటిపోయింది. పిల్లలు నిన్ను మరీ మరీ అడుగు తున్నారు. ఓసారి రామ్మా ఇంటికి’’ అంటూ ఫోన్‌ చేసింది కూతురు తనూజ.

తనూజ ఫోన్‌చేసి పదే పదే అడగటంతో తెలిసిన వాళ్లు హైదరాబాదు వెళ్తుంటే వాళ్లతోపాటూ బయలుదేరింది రుక్మిణమ్మ. అల్లుడు స్టేషన్‌కి వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు.

‘‘బాగున్నారా వదినగారూ..?’’ అంటూ పలకరించిన వియ్యపురాలు దుర్గమ్మని చూసి విస్తుపోయింది రుక్మిణమ్మ.

‘నిండుగా పుష్టిగా ఉండే దుర్గమ్మగారేనా ఇంతలా చిక్కిపోయారు... ఎలా ఉండే ఆమె ఇలా అయ్యారేంటి’ అనుకుంటూ ‘‘బాగున్నాను వదినగారూ... మీరు బాగున్నారా’’ అంటూ పలకరించింది.

‘‘అమ్మమ్మా...’’ అంటూ పరుగున వచ్చిన మనవడినీ మనవరాలినీ చూసి ‘‘ఉండండర్రా... రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను కదా, స్నానం చేసి వస్తాను’’ అంటూ బ్యాగ్‌ తీసుకుని లోపలికి వెళ్లింది.

స్నానం చేసి పిల్లలతో కబుర్లు చెబుతూ టిఫిన్‌ తిని, కాఫీ తాగుతూ దుర్గమ్మనే గమనించసాగింది. ఇల్లు ఊడ్చి తుడవటం, వాషింగ్‌ మిషన్లో బట్టలు వెయ్యటం, కూరలు తరిగిచ్చి, అంట్లన్నీ తోమి తుడిచి సర్దిపెట్టటం దగ్గర్నుండీ అన్ని పనులూ చేస్తున్న దుర్గమ్మని చూసి...

‘‘అదేమిటి వదినగారూ... ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు. మాణిక్యం రావటం లేదా?’’ ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణమ్మ.

‘‘లేదమ్మా, మానేసింది’’ అంది తనూజ.

కూతురి సమాధానం విని ‘‘ఎందుకు మానేసింది. ఎన్నో ఏళ్లుగా సొంతమనిషిలా నమ్మకంగా పనిచేస్తుంది కదా’’ అంది.

‘‘ఒంట్లో బాగుండటం లేదని రెండు నెలల నుండి రావటం లేదు.’’

‘‘మరి... ఇంకెవరినైనా పనికి పెట్టుకోలేకపోయావా. ఏదో ఒకరోజో రెండ్రోజులో అయితే ఎలాగో చేసుకోవచ్చుగానీ, రోజూ ఇంట్లో పనంతా చెయ్యాలంటే మాటలా... అందులోనూ మీ ఇల్లు చాలా పెద్దది. పైగా ఇంటి చుట్టూ మొక్కలు కూడా పెంచుతుంటారు. పిల్లలతో ఇంతపని చెయ్యాలంటే కష్టం కదా.’’

‘‘చాలామందిని అడిగి చూశాను. ఎవ్వరూ దొరకటం లేదమ్మా. పనివాళ్లున్నా లేకపోయినా మన పని మనకి తప్పదు కదమ్మా’’ అని నవ్వింది తనూజ.

తనేదైనా పని అందుకోబోతే కూతురుతోపాటు దుర్గమ్మకూడా అడ్డుపడి చెయ్యనివ్వటం లేదు. ఓరోజు సాయంత్రం దుర్గమ్మ పెరట్లో మొక్కలకి నీళ్లు పోయటం చూసి తల్లి పక్కన చేరింది తనూజ.

‘‘అమ్మా, మీ అల్లుడు ఈవిడగారిని ఇక్కడికి శాశ్వతంగా తీసుకువచ్చేశాడు. ‘ఈమధ్య ఆరోగ్యం కూడా అంత బాగుండటం లేదు కదా... ఒక్కదానివే అక్కడెందుకు’ అని తీసుకొచ్చి దిగబెట్టాడు. ఆయనగారికేం, పగలంతా ఏసీ గదిలో ఆఫీస్‌లో కూర్చుంటాడు. తప్పనిసరి తద్దినంలా ఈవిడగారిని భరించాల్సింది నేనేగా... ఇక్కడ నేనేదో ఓపిగ్గా ఉండి అందరికీ చాకిరీ చేసేదానిలా కనిపిస్తున్నానేమో. అందుకే నాకు ఒళ్లుమండి కావాలనే మాణిక్యాన్ని మానిపించాను.
‘మా అత్తగారికి తను స్వయంగా చేసుకుంటే తప్ప మరొకరు చేసే ఏ పనీ నచ్చదు... నువ్వు చేసినా మళ్లీ తను చేసుకుంటుంది. కొన్నాళ్లపాటు రావద్దు. అంతగా అవసరమైతే నేనే కబురు చేస్తాన్లే’ అని చెప్పాన్లే. ఇకనుండి ఈవిడగారికి తిండీ తిప్పలూ, మందులూ, బట్టలూ అన్నీ మేమే చూసుకోవాలిగా... ఈవిడగారికి ఇన్ని జరిపి మళ్లీ పనిమనిషికి అంతంత జీతాలివ్వటం ఎందుకు... వాళ్ల ఊళ్లో ఉన్నప్పుడు పనిమనిషి లేకుండా ఇంట్లో పనంతా తనొక్కతే చేసుకోలేదా ఏంటి... అక్కడ చేసినట్లే ఇక్కడా చేస్తుంది... అంతే కదమ్మా’’ అంది.

కూతురి మాటలకి కళ్లు పెద్దవి చేసుకుని విస్తుపోయి చూసింది రుక్మిణమ్మ.

‘‘అమ్మా, అక్కడున్న పొలం అమ్మేసి పిల్లలిద్దరి పేరున ఇక్కడ రెండు ప్లాట్లు తీసుకున్నాడీయన. ఇల్లు కూడా బేరం పెట్టాం. దాన్నికూడా అమ్మేసి, ఆ వచ్చిన డబ్బును పిల్లలిద్దరి పేరుమీద ఫిక్స్‌డ్‌లో వెయ్యాలనుకుంటున్నాం.’’

అన్నట్టు మరిచాను. అన్నయ్య కూడా నిన్ను చెన్నై తీసుకువెళ్లాక మన ఊళ్లో ఉన్న ఇల్లూ, పొలం అమ్మాలని అంటున్నాడు. ఒకవేళ అవి కానీ అమ్మటం జరిగితే నాకు కూడా వాటా ఇవ్వాలి ముందే చెబుతున్నాను. ఇవ్వకపోతే ఊరుకోను. వాడికెలా నచ్చచెప్పుకుంటావో నీ ఇష్టం’’ అంది.

ఆ మాటలు విన్నాక ఇక కూతురు చెప్పేవేమీ బుర్రలోకి ఎక్కటం లేదు. ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది. మర్నాడు సాయంత్రం తనూజ ఫ్రెండ్స్‌ కాబోలు ఇద్దరు ఆడవాళ్లు వస్తే హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్లొచ్చిన విషయం తెలియక ఉతికిన బట్టలు మడతపెట్టి ఎవరిగదుల్లో వాళ్లవి సర్దటానికని హాల్లోనుండి బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది దుర్గమ్మ. ఆ తర్వాత పెరట్లోకి వెళ్లిపోయింది. ఆ వచ్చినవాళ్లల్లో ఒకామె వెళ్తూ వెళ్తూ మొక్కలకి పాదులు చేసి, నీళ్లు పెడుతున్న దుర్గమ్మని చూసి ‘‘మీ పనిమనిషి అన్ని పనులూ ఎంతో చక్కగా బాధ్యతగా చేస్తుందే... మాక్కూడా ఎవరైనా దొరుకుతారేమో కాస్త కనుక్కో’’ అంది. తనూజ ఆ మాటలు విననట్లే వెంటనే టాపిక్‌ మార్చి వాళ్లని గేటు వరకూ సాగనంపింది.

‘‘ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్లకి ఎదురుపడవద్దని చిలక్కి చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పినా ఈవిడింతే... చూసినవాళ్లంతా ‘పనిమనిషా’ అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థంకాక చస్తున్నాను. ఇంకా ఎన్నాళ్లు భరించాలో ఈవిడగారిని’’ అంటూ దుర్గమ్మ స్నానానికి వెళ్లటం చూసి తల్లిముందు విసుక్కుంది తనూజ.

ఇంట్లో ఇంతకుముందు ఉన్న పరిస్థితికీ ఇప్పటి పరిస్థితికీ చాలా తేడా కనిపించింది రుక్మిణమ్మకి. ఓ వారం పదిరోజులు మనవడూ మనవరాలితో సరదాగా గడపాలని వచ్చిందల్లా ఐదోరోజే తిరుగు ప్రయాణమైంది. పదిరోజుల తర్వాత కూతురికి ఓ ఉత్తరం రాసింది.

అమ్మా, తనూజా!

‘అన్నయ్యతో- చెన్నైకి రాను... ఇక్కడే ఉంటానని చెప్పావటకదమ్మా... ఎందుకని’ అని నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా ఎలా చెప్పాలో అర్థంకాక ఇప్పుడిలా నీకీ ఉత్తరం రాస్తున్నాను.

నిన్ను చూస్తుంటే చాలా మారిపోయావు అనిపిస్తోంది. నీలో ఉండే జాలీ, ప్రేమా, కరుణా ఏమైపోయాయో అర్థం కావటం లేదు.

చిన్నతనంలోనే భర్త చనిపోతే ఎన్నో కష్టాలు పడి ఆశలూ కోరికలూ చంపుకుని తినీ తినకా ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఇంతవాడిని చేసింది మీ అత్తగారు. వయసుడిగి, శక్తినశించి, ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో కొడుకు ఆదరణ కోసం వస్తే చివరి రోజుల్లో ఆమెని నువ్వెంత బాధ పెడుతున్నావో నీకేమైనా అర్థమవుతోందా..?

‘తిండీ తిప్పలూ, బట్టలూ అన్నీ మేమే చూసుకోవాలిగా,’ అన్నావే... ఆమెకూడా ఇంచుమించుగా నా వయసుదే కదా... ఈ వయసులో మాలాంటి వాళ్లం ఎంత తింటాం చెప్పు... ఆమె తినే ఆ నాలుగు మెతుకులు నీకు భారంగా అనిపించిందా... మీరంతా తినగా మిగిలిపోయినంత లేదు ఆమె తినే తిండి. రేపేదైనా నా పరిస్థితి బాగాలేక నీ దగ్గర ఉండాల్సివస్తే నా గురించి కూడా ఇలాగే అనుకుంటావా అమ్మా..?

ఇక ఈ వయసులో ఒళ్లు దాచుకోవటానికి ఏవో నాలుగు సాదా చీరలు తప్ప మాలాంటివాళ్లకి పట్టు పీతాంబరాలు అవసరం లేదు కదా... ఆమెకి కొనే చీరలు అన్నీ కలిపినా నువ్వు కొనుక్కునే ఒక్క చీర ఖరీదు కూడా ఉండదు. నెల మొత్తం మీ అత్తగారికి అయ్యే ఖర్చంతా చూసినా మీరూ మీ పిల్లలూ ఒకరోజు సినిమా చూసి, రెస్టరెంట్లో భోజనం చేసినంత కూడా అవదు. అవునంటావా... కాదంటావా..?

కడుపునిండా తిండి కూడా తినకుండా పాతికేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకోబట్టే నీ భర్త ఈరోజు లక్షలు సంపాదిస్తూ నిన్నూ నీ పిల్లల్నీ ఏసీ గదుల్లో ఉంచి ఏసీ కార్లల్లో తిప్పగలుగుతున్నాడు.
అనారోగ్యంతో తన పనే తను చేసుకోలేక కన్నబిడ్డ దగ్గరకి వస్తే మీ ఇంటిల్లిపాది అందరి పనులూ చేయిస్తున్నావే... అదీ పని మనిషిని మాన్పించి మరీ... ఎంత దారుణం.

తను రాకముందు నీకు ఇంటిపనికి ఒకరూ, వంటపనికి ఒకరూ ఉండేవాళ్లు కదా... వయసులో ఉన్న నువ్వే నీ ఇంట్లో పని చేసుకోలేక ఇద్దరు పనివాళ్లని పెట్టుకుంటే, వయసు మళ్లిన మీ అత్తయ్య ఇంటెడు చాకిరీ ఎలా చెయ్యగలదనుకున్నావమ్మా... అత్తగారంటే తల్లి తర్వాత తల్లిలాంటిదని ఎందుకనుకోవు... అమె స్థితిలో నేనే ఉంటే... ఒక్కసారి ఊహించుకో నీకెంత బాధ కలుగుతుందో... ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకు.
అయినా మాలాంటి వాళ్లం ఇంకా ఎన్నాళ్లుంటాం, ఎన్నేళ్లు బతుకుతాం. ఈ వయసులో మాకు ఉండేది ఒకే ఒక కోరికమ్మా... ఉన్న నాలుగు రోజులూ కన్నబిడ్డల దగ్గర మనశ్శాంతిగా బతికి, ప్రశాంతంగా తనువు చాలించాలని.
కానీ, ఈ కాలం ఆడపిల్లలకి భర్తలు కావాలి... వాళ్లు సంపాదించే లక్షల జీతం కావాలి... వాళ్ల వెనకున్న ఆస్తులు కావాలి... కానీ, వాళ్ల తల్లిదండ్రులు మాత్రం వద్దు. నోరారా వాళ్లని ‘అత్తయ్యా మామయ్యా’ అని పిలవటానికి కూడా ఇష్టపడటం లేదు.

కారణం... వాళ్లు పరాయివాళ్లు, పనికిరాని వాళ్లు, అంటరానివాళ్లు. నువ్వే నీ అత్తగారిని ఓ పనిమనిషిని చేస్తే నీ ఇంటికొచ్చినవాళ్లు అలా అనుకోవటంలో తప్పేముందమ్మా. ‘పనిమనిషి కాదు మా అత్తగారు...’ అని చెప్పే సంస్కారం నీకు లేకపోయె. నా కడుపున పుట్టి, నా పెంపకంలో పెరిగిన నువ్వే ఇలా ఉంటే, ఇక... నీ వదిన మాత్రం నన్ను బాగా చూస్తుందన్న గ్యారంటీ ఏంటి... తనూ నీలాంటి ఆడపిల్లే... నేనూ తనకు అత్తగారినే, మీ భాషలో ‘తప్పనిసరి తద్దినాన్నే’ కదమ్మా.

ఉన్న ఆస్తులు వదులుకొని, మీ ఇళ్లకి వచ్చి, మీ ఇళ్లల్లో పనిమనుషులుగా మారి, మీరనే సూటిపోటి మాటలు భరిస్తూ ‘ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా’ అని ఎదురు చూస్తూ జీవచ్ఛవాల్లా బతకాల్సిన ఖర్మ నాకు వద్దమ్మా... నీ ఇంటి వాతావరణం చూశాకే నాకీ జ్ఞానోదయమైంది. నువ్వేకాదు... ఈరోజుల్లో చాలామంది కోడళ్లు నీలానే ప్రవర్తిస్తున్నారు. అందుకే నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ నా ఇంట్లోనే ఉండాలనీ, నేను ఉన్నంతవరకూ నా ఆస్తులు కూడా అమ్మకూడదనీ నిర్ణయించు కున్నాను. చివరిగా ఓ మాట. నీలో జాలీ దయా మానవత్వమనేవి ఏమాత్రమైనా ఉంటే ఈ చివరి రోజుల్లోనైనా మీ అత్తగారికి కాస్తంత సంతోషాన్నీ మనశ్శాంతినీ కలిగించి ఆమెలో ఈ అమ్మని చూసుకుంటావని ఆశిస్తూ... కాదు కాదు అభ్యర్ధిస్తూ...

మీ అమ్మ, రుక్మిణమ్మ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..