లౌక్యం తెలియని మనిషి

ఎయిర్‌ ఇండియా విమానం లాస్‌ ఏంజెలెస్‌ నుంచి బయల్దేరి 10 గంటలైంది. ఫ్లైట్‌లో విశ్వనాథ్‌ చాలా టెన్షన్‌గా ఉన్నాడు. హైదరాబాద్‌ చేరుకోడానికి మరో పన్నెండు గంటలు పట్టొచ్చు.

Published : 17 Apr 2022 00:12 IST

లౌక్యం తెలియని మనిషి

- జీవీ రమేష్‌

యిర్‌ ఇండియా విమానం లాస్‌ ఏంజెలెస్‌ నుంచి బయల్దేరి 10 గంటలైంది. ఫ్లైట్‌లో విశ్వనాథ్‌ చాలా టెన్షన్‌గా ఉన్నాడు. హైదరాబాద్‌ చేరుకోడానికి మరో పన్నెండు గంటలు పట్టొచ్చు. మాటిమాటికీ వాచీ చూసుకుంటున్నాడు. ఫోన్‌ చెక్‌ చేసుకుంటున్నాడు.

‘ఏమండీ, ఆర్యన్‌కి యాక్సిడెంట్‌ అయింది. తలకు దెబ్బ తగిలింది, రక్తం చాలా పోయింది’ అంటూ భార్య అపర్ణ ఫోన్‌లో ఏడుస్తూ చెప్పిన దగ్గర్నుంచి విశ్వనాథ్‌ బుర్ర పని చేయడం మానేసింది. ఫ్లైట్‌ ఎక్కే వరకూ తానేం చేస్తున్నాడో తనకే తెలీదు. ఓ పెద్ద కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న విశ్వనాథ్‌కు ఆర్యన్‌ ఒక్కగానొక్క సంతానం. బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈమధ్యే క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగం కూడా వచ్చింది. వారం కిందట తాను అమెరికా బయల్దేరినప్పుడు నవ్వుతూ వీడ్కోలు చెప్పాడు. ఆస్పత్రిలో అపర్ణ ఒక్కత్తే ఉండి ఉంటుంది, ఆమెకు సాయంగా ఎవరైనా ఉంటే బాగుణ్ణు... ఈ మాట ఎన్నిసార్లు అనుకున్నాడో లెక్కలేదు. నిజానికి విశ్వనాథ్‌ ఎవరూ లేని వాడు కాదు... అందర్నీ దూరం చేసుకున్నవాడు.

చిన్నప్పట్నుంచీ విశ్వనాథ్‌ లెక్కల మనిషి. తండ్రి రామ్మూర్తిది కొడుక్కి పూర్తి విరుద్ధమైన పద్ధతి. కలో గంజో అయినా నలుగురితో కలిసి పంచుకోవాలనేది ఆయన తత్వం. కష్టాల్లో ఉన్నవారికి మాట సాయమే కాకుండా, అవసరమైతే పదో పరకో ఇచ్చి పంపించేవాడు. విశ్వనాథ్‌కి తండ్రి నైజం అస్సలు నచ్చేది కాదు. పదో క్లాసు పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్‌ కోసం వంద కిలోమీటర్ల దూరంలో ఉండే పట్టణానికి బయల్దేరాడు. ‘నీ తమ్ముడి- చెల్లెలి బాగోగులు కూడా నేను చూసుకోవాలి, పక్క ఊళ్ళో ఉన్న కాలేజీలో చేరు’ అని తండ్రి చెబితే కుదరదని మొండికేశాడు. మంచి కాలేజీలో చేరితేనే చదువులు బాగుంటాయనీ మంచి ఉద్యోగం వస్తుందనీ తండ్రితో వాదించాడు. ‘ఊరందరికీ పంచి పెడుతున్నావు కదా... నాకు పెట్టడానికి డబ్బు లేదా?’ పదో తరగతి పాసైన కొడుకు నుంచి వచ్చిన ఈ ప్రశ్నకు ఆ తండ్రి దగ్గర సమాధానం లేకుండా పోయింది. తన స్థోమతకు మించినదే అయినా చివరకు రామ్మూర్తి విశ్వనాథ్‌ని పట్టణానికి పంపించాడు. ‘నువ్వు మంచి ఉద్యోగం చేసి, చెల్లినీ తమ్ముణ్ణీ బాగా చూసుకోవాలి’... పట్నం బస్సు ఎక్కించినప్పుడు తండ్రి అన్న మాటల్ని విశ్వనాథ్‌ విననట్లే నటించాడు.

ఇంటర్మీడియట్‌, ఆ తర్వాత ఇంజినీరింగ్‌ కూడా పట్నంలోనే చదివాడు. ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తన క్లాస్‌మేట్‌ అపర్ణను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆ అమ్మాయి బాగా ఆస్తిపరురాలు కావడం, తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడం వల్ల ప్రేమ అనే పదాన్ని ఇన్వెస్ట్‌ చేసి, రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోయాడు.

చదువుకున్నన్నాళ్ళూ ప్రతీ నెలా డబ్బుల కోసం తండ్రి వెంట పడిన విశ్వనాథ్‌ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంటి ముఖం చూడటం మానేశాడు. తన పెళ్ళి నిశ్చయమైపోయిన తర్వాత తప్పదన్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు కూడా ఏదో బంధువుల పెళ్ళికి వెళ్ళినట్లే వెళ్ళి వచ్చేశారు. విశ్వనాథ్‌ చదువు కోసం ఉన్న రెండెకరాలూ అమ్ముకున్న రామ్మూర్తి తన చిన్న కొడుకు శంకర్‌ను డిగ్రీ మాత్రమే చదివించగలిగాడు. ఊళ్ళో జూట్‌ మిల్లులో క్లర్క్‌గా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు శంకర్‌. ఇక ఒక్కగానొక్క చెల్లి పెళ్ళి విషయంలో కూడా విశ్వనాథ్‌ పెద్దగా జోక్యం చేసుకోలేదు. నామమాత్రానికి నాలుగు డబ్బులిచ్చి, అంతకంటే ఇవ్వలేనని తేల్చి చెప్పేశాడు.

అత్తింటి బంధువుల దగ్గరకు వెళ్దామని అపర్ణ అడిగినా, విశ్వనాథ్‌ పట్టించుకునేవాడు కాదు. తను పనిచేసే కంపెనీలో కూడా స్వార్థపరుడనే ముద్ర పడిపోయింది. తను ఎదగడం కోసం అందర్నీ నిచ్చెనలా వాడుకున్నాడు. ఇతరుల కష్టాన్ని కూడా తన ఖాతాలో వేసుకుని ప్రమోషన్లు సాధించుకున్నాడు. మేనేజర్‌ స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతన్ని గౌరవించినా, ఏ ఒక్కరికీ విశ్వనాథ్‌ మీద మంచి అభిప్రాయం లేదు.
తన స్వార్థానికి విశ్వనాథ్‌ పెట్టుకున్న పేరు లౌక్యం. తనలాగా లౌక్యం లేకే తండ్రి పేదరికంలో మిగిలిపోయాడని భార్యతో చెబుతూ ఉంటాడు. తనకంటే అర్హులున్నా తనకు ప్రమోషన్లు తొందరగా రావడానికి తన లౌక్యమే కారణమని వాదిస్తాడు.

ఒక్కగానొక్క కొడుకు ఆర్యన్‌ అంటే విశ్వనాథానికి ప్రాణం. వాడు అడిగినవన్నీ కాదూ లేదూ అనకుండా కొనిచ్చాడు. బీటెక్‌లో జాయినయ్యాక ఆర్యన్‌ నెలకోసారి టూరిజం అంటూ ఊళ్ళు తిరగడానికి వెళ్ళేవాడు. విశ్వనాథ్‌ కూడా కొడుకు అడిగినంత డబ్బు ఇచ్చి మరీ పంపించేవాడు. తను చిన్నతనంలో గడిపిన పేద జీవితం తన కొడుకు దరిదాపుల్లోకి కూడా రాకూడదనుకునేవాడు. అలాంటిది ఈ రోజు వాడు చావు బతుకుల్లో ఆస్పత్రిలో పడి ఉన్నాడు.

కొడుకు యాక్సిడెంట్‌ వార్త తెలియగానే తనే పరుగున రావాల్సి వచ్చింది. తనకు సాయం చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రారని తెలుసు. తనకు కరోనా వచ్చి, ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా తన స్టాఫ్‌ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా తన భార్యా, కొడుకూ ఒంటరిగానే ఉండి ఉంటారు. భార్యను తలుచుకుంటే అతనికి బాధేసింది.

ఫ్లైట్‌ దిగి, క్యాబ్‌లో సరాసరి ఆస్పత్రికి బయల్దేరాడు. భార్య నుంచి ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. టెన్షన్‌గా మెసేజ్‌ బాక్స్‌ ఓపెన్‌ చేసి చూశాడు. ‘ఆర్యన్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది. కంగారుపడకండి’ అని ఉంది. ‘థ్యాంక్‌ గాడ్‌’ అని ఊపిరి పీల్చుకున్నాడు. క్యాబ్‌ దిగి పరుగు పరుగున ఎమర్జెన్సీ వార్డుకు చేరుకున్నాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు.

తన తండ్రీ, తల్లీ, తమ్ముడూ, మరదలూ, చెల్లీ, బావా, వాళ్ళ పిల్లలూ... అందరూ ఉన్నారు. ఆర్యన్‌ స్నేహితులు కూడా ఓ పది మంది ఉన్నారు. భర్తను చూడగానే అపర్ణ పరుగున వచ్చి భర్తను పట్టుకుని బావురుమంది.

‘‘ఓ పెద్దావిడ రోడ్డు దాటుతూ ఎదురుగా వస్తున్న లారీని చూసుకోలేదు. ఆర్యన్‌ కాపాడటానికి ప్రయత్నించడంతో లారీ వీడిని ఢీకొట్టింది. అదిగో ఆ బామ్మగారినే మనవాడు కాపాడాడు. పక్కనున్నది వాళ్ళబ్బాయీ, కోడలు. నిన్నట్నుంచీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు’’ కాసేపయ్యాక చెప్పింది.

ముప్పయ్యేళ్ళ కిందట తాను తప్పించుకుని పారిపోయిన కుటుంబం తన కొడుకు కోసం వచ్చింది. ఆ గిల్టీ ఫీలింగ్‌తో వాళ్ళ ముఖాల్లోకి కూడా చూడలేకపోతున్నాడు. ఈలోగా నర్స్‌ విశ్వనాథ్‌ దగ్గరకు వచ్చింది. ‘‘సార్‌, మీ అబ్బాయికి బాగానే ఉంది కదా... అతని ఫ్రెండ్స్‌కి ఈ విషయం చెప్పండి. నిన్నట్నుంచీ వాళ్ళంతా ఆస్పత్రిలోనే ఉన్నారు. మిగిలిన రోగులకు ఇబ్బంది అవుతోంది’’ అందామె.

‘‘ఆంటీ, మేం వెళ్తాం. ఏదైనా అవసరం ఉంటే కాల్‌ చేయండి’’ అంటూ ఆ పది మందీ కదిలారు.

‘‘నువ్వు ఒంటరిగా ఉన్నావని భయపడ్డాను. కానీ ఇక్కడ నీకు తోడుగా ఇంతమంది ఉన్నారంటే నమ్మలేకపోతున్నా’’ మర్నాడు ఆస్పత్రిలో భార్యతో చెప్పాడు విశ్వనాథ్‌.

‘‘వాళ్ళంతా వాడి ప్రపంచం. మీ దృష్టిలో ‘మన’ అంటే... మనం ముగ్గురమే. కానీ ఆర్యన్‌ దృష్టిలో ‘మన’ అంటే... బంధువులూ స్నేహితులూ అందరూ. చివరకు ప్రాణాపాయంలో ఉన్న ఓ బామ్మగారు కూడా వాడి జీవితంలో భాగమే’’ కన్నీళ్ళు తుడుచుకుంటూ చెబుతోంది అపర్ణ.

‘‘వాడికి మనిషంటే ఇష్టం. పదిమందితో కలిసి ఉండటమంటే ఇష్టం. ఉన్నదాన్ని నలుగురికీ పంచడమంటే ఇష్టం. వాడు టూర్‌ అంటూ ప్రతీ నెలా ఎక్కడకు వెళ్తాడో తెలుసా... మీ నాన్నగారింటికి. ఆయన ఒళ్ళో పడుకుని నాన్నమ్మ చేతి గోరు ముద్దలు తినడానికి వాడు అక్కడకు వెళ్తాడు. మీ తమ్ముడి ఇద్దరు పిల్లల చదువుల గురించి ఆలోచిస్తాడు. ఫీజులు కడతాడు. పండక్కి బట్టలు తీసుకువెళ్తాడు. మీ చెల్లి ఇంటికి వెళ్తుంటాడు. మేనత్తకు కొండంత ప్రేమను పంచుతాడు. ప్రతీ నెలా వాడి అకౌంట్లో వేసే పాకెట్‌ మనీ, వాడి పేరు మీదున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ... ఇవన్నీ వాళ్ళ కోసం ఖర్చు చేస్తాడు. తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ ఊళ్ళో రెండెకరాల పొలం కొనిస్తానని మీ నాన్నకు మాటిచ్చాడట. పెద్ద కొడుకుగా మీరు చేయాల్సినవన్నీ ఆ ఇంటికి పెద్ద మనవడిగా వీడు చేస్తున్నాడు. మీ వాళ్ళ ప్రసక్తి తీసుకురావడం మీకు ఇష్టం ఉండదు, అందుకే మీ ఊరికి వెళ్తున్న విషయం వాడు మీకెప్పుడూ చెప్పలేదు.’’

‘‘కాలేజీలో కూడా ఆర్యన్‌ అందరి వాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తను ముందుకొస్తాడు. చేతనైన సాయం చేస్తాడు. వాడికి యాక్సిడెంట్‌ అయిందని తెలిసిన తర్వాత, ఆస్పత్రి అంతా వాడి ఫ్రెండ్స్‌తో నిండిపోయింది. వాళ్ళను కంట్రోల్‌ చేయడానికి స్టాఫ్‌ చాలా ఇబ్బంది పడ్డారు.’’

‘‘మొన్న సంక్రాంతికి ఓ నలుగురు ఫ్రెండ్స్‌ని తీసుకుని మీ ఊరెళ్ళాడు. వాడి రాక మీ వాళ్ళందరికీ పెద్ద పండగయింది. వాడి ఫోన్‌లో ఫొటోలు చూశాను. ఆ ఫొటోల్లో ఉన్న వాళ్ళకి మనంత డబ్బు లేకపోవచ్చు. కానీ ఆర్యన్‌ అంటే ఎంతో అభిమానం. ప్రాణమిచ్చేంత ప్రేమ. మన పెళ్ళయిన తర్వాత మీ వాళ్ళెవరూ మన ఇంటికి రాలేదు. వీడికి యాక్సిడెంట్‌ అయిన విషయం తెలిసిన వెంటనే పరుగు పరుగున వచ్చారు. వాళ్ళంతా ఇక్కడ లేకపోతే, ఆ టైమ్‌లో నేనేమైపోయేదానినో నాకే తెలీదు.’’

‘‘ ‘నాలా సక్సెస్‌ఫుల్‌ కావాలి, నా అంత స్థాయికి చేరాలి’ అని... మీరెప్పుడూ వాడితో అంటూ ఉంటారు. కానీ మీ గెలుపుని మీరు తప్ప వేరెవ్వరూ ఆనందించలేదు. విజయశిఖరంపైన మీరొక్కరే ఉండాలనుకుంటారు మీరు. అందరూ గెలవాలనీ, అందరితోనూ గెలుపును పంచుకోవాలనీ అనుకుంటాడు వాడు. ఇద్దరికీ ఉన్న తేడా అదే’’ చాలా రోజులుగా తన కడుపులో దాచుకున్న బాధను వెళ్ళగక్కిందామె.

‘‘వాడికి క్యాంపస్‌లో ఉద్యోగం వస్తే, మీ వాళ్ళంతా వాళ్ళకే ఉద్యోగం వచ్చినంత సంబరపడ్డారు. వాడికి ఉద్యోగం రావాలని మీ నాన్న వేంకటేశ్వరస్వామికి మొక్కుకున్నారట. ఆర్యన్‌ అందర్నీ తిరుపతికి తీసుకువెళ్తానన్నాడట. రిజర్వేషన్‌ కూడా చేయించాడట.’’

‘‘మీరెప్పుడూ అంటూ ఉంటారు... బతకడానికి లౌక్యం కావాలి అని. కానీ ‘నా’ అనుకునే నలుగురు మనుషులు ఉంటే చాలు, హాయిగా బతికేయవచ్చు- అని వాడు అనుకుంటాడు. వాడు బొత్తిగా లౌక్యం తెలియని మనిషి’’ కన్నీళ్ళు తుడుచుకుంటూ అందామె. ఆ చివరి వాక్యంలో వ్యంగ్యం విశ్వనాథ్‌కి అర్థం అయింది.

భార్య మాటలన్నీ వింటూ తల దించుకుని మౌనంగా కూర్చున్నాడు. తాను ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాననుకున్నాడు కానీ, ఎవరికీ అక్కర్లేనంత ఎత్తుకు ఎదిగాడనే విషయం ఇప్పుడే బోధపడుతోంది. అతనిలో జరుగుతున్న అంతర్మథనం అపర్ణకు అర్థమైంది.

ఎమర్జెన్సీ వార్డు ముందు కూర్చున్న తండ్రి దగ్గరకు వెళ్ళాడు విశ్వనాథ్‌. పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని ముడతలు పడ్డ తండ్రి చేతుల్ని పట్టుకున్నాడు. ‘‘ఆర్యన్‌కి బాగైన తర్వాత అందరం కలిసి తిరుపతి వెళ్దాం నాన్నా’’ అన్నాడు. ఆ మాట అంటున్నప్పుడు విశ్వనాథ్‌కు కన్నీరు ఆగలేదు. తండ్రి భుజం మీద తల ఉంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు- తను చేసిన తప్పులన్నీ ఆ కన్నీటిలో కరిగిపోయేలా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..