Updated : 03 Jul 2022 02:28 IST

సాయం

- సింగరాజు రమాదేవి

మాట విన్నప్పటి నుండీ మానసకి మనసంతా చేదుగా అయిపోయింది. ఇండియా నుండి ప్రసాద్‌ బాబాయి ఫోన్‌ చేసి చెప్పిన విషయాలే బుర్ర నిండా తిరుగుతున్నాయి.

అసలు అదంతా నిజమేనా? ఎందుకిలా చేసింది అమ్మ! అసలంత అవసరం ఏమొచ్చింది? ఎన్నాళ్ళనుంచి చేస్తోంది..? డబ్బు ఇబ్బందా? నాన్నగారు పోయినా ఫ్యామిలీ పెన్షన్‌ వస్తూనే ఉందే? సరిపోవట్లేదా... ఏమో!

తమమధ్య డబ్బు ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. తనకీ తమ్ముడికీ నాన్నగారు ఉద్యోగం చేస్తుండగానే పెళ్ళిళ్ళు అయినాయి. వాడు సింగపూర్లో సెటిల్‌ అయ్యాడు. తను అమెరికాలో!

రెండేళ్ళకోసారి సెలవుల్లో అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తూనే ఉంటారు. ఎప్పుడూ అమ్మావాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నట్టు అనిపించలేదు. పైగా వెళ్ళినప్పుడల్లా తనకీ పిల్లలకీ ఏదో ఒకటి కొనివ్వటం, బట్టలు పెట్టటం... అంతా మామూలే. చిన్నప్పటి నుండీ తమకు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు... కనీసం తనకి తెలిసినంత వరకైతే లేవు. మరి ఏమిటిది... ఆలోచిస్తున్న కొద్దీ మనసంతా గజిబిజిగా ఉంది.

మనోజ్‌కి తెలుసా? తెలిసీ వాడు, ఏమీ చెయ్యకుండా ఊరుకున్నాడా? అసలు వాడు అమ్మకి డబ్బు ఏమైనా పంపుతున్నాడా? డబ్బు ఇబ్బంది వల్లేనా? ఛ! ఇది తెలిస్తే అందరూ ఏమనుకుంటారు? తమని తిట్టిపోసుకోరూ!

అమ్మతో వారానికి మూడుసార్లు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది తను. అమ్మ ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. బాధపడినట్టు కూడా అనిపించలేదు మరి... లేక తనే తెలుసుకోలేదా... తన గోలలో తను ఉండి పట్టించుకోలేదా? మానసకి బాధ,
అవమానం మనసంతా నిండి మెలిపెడుతున్నాయి. వెంటనే ఫోన్‌ చేసి అడుగుదామంటే ఏమి వినాలో అని భయంగా ఉంది. తమ్ముడికి చేసి మాట్లాదామంటే వాడికి అసలు విషయం ఎంతవరకూ తెలుసో తెలియదు.

మర్నాడు అమ్మే ఫోన్‌ చేసింది మానసకి. చాలా ఉత్సాహంగా మాట్లాడింది. పిల్లల గురించి అడిగింది. అమ్మ అడిగిన వాటికి అన్యమనస్కంగానే జవాబులు చెప్తూ ఉంది మానస. అడగాలి అనుకున్న విషయం, ఆమె గొంతు దాటి బయటకు రావటంలేదు.

ఆఖరికి అమ్మ ‘‘ఇక ఉండనా మరి’’ అంటుంటే... మెల్లగా ‘‘అమ్మా’’ అంది. ఒక్క క్షణం అవతలి వైపు నిశ్శబ్దం. తర్వాత ‘‘చెప్పమ్మా’’ అంది అమ్మ. ‘‘మొన్న బాబాయి ఫోన్‌ చేశాడు...’’ మెల్లగా మొదలుపెట్టింది. అమ్మ ఊహించినదే అనుకుంటా... నిట్టూర్పు వదుల్తూ ‘‘ఆ... ఏమన్నాడు?’’ అడిగింది.

‘‘మేమంతా చచ్చామనుకున్నావా అమ్మా? ఏం మాతో ఒక్క మాట కూడా అనలేదు. మనోజ్‌ ఏమీ పంపకపోతే నాకైనా చెప్పకపోయావా...’’ ఎంతో సౌమ్యంగా, మెల్లిగా అడుగుదామని ప్లాన్‌ చేసుకున్నది కాస్తా, కోపం, ఏడుపు కలగలిపిన గొంతుతో ఒక్కసారిగా అడిగేసింది మానస.

‘‘ఏంటమ్మా నువ్వు అంటున్నది? పంపటం ఏమిటి?’’ తల్లి భవానీ గొంతులో అయోమయం.

‘‘అదేనమ్మా...నీకు డబ్బు ఇబ్బంది ఉంటే మాకు చెప్పొచ్చు కదా. అయినా నీ కొడుకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఏం, ఆ మాత్రం పంపలేడా? లేక అక్కడ వాడు కొన్న ఆస్తులకి ఈఎంఐ కట్టటానికి సరిపోతోందా వాడి జీతం!’’ గుక్క తిప్పుకోకుండా అక్కసు అంతా వెళ్ళగక్కింది మానస.

‘‘మనూ, నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నాకు డబ్బు ఇబ్బంది అని ఎవరు చెప్పారు. నెలనెలా వచ్చే మీ నాన్నగారి పెన్షన్‌ నాకు బాగానే సరిపోతోంది. నా ఒక్కదాని ఖర్చు ఎంతని... నాకు నువ్వు పంపక్కరలేదు, నీ తమ్ముడు అంతకన్నా పంపక్కరలేదు’’ భవానీ స్వరం కాస్త తీవ్రంగానే వినపడింది.

ఆ స్వరానికి మానస కాస్త తగ్గి ‘‘మరి బాబాయి అలా చెప్పాడేమిటి!?’’ కొంచెం సంశయంగా అడిగింది.

‘‘ఏమని చెప్పాడూ?’’

‘‘అదే నువ్వు నలుగురి ఇళ్ళల్లో వంటలు చేస్తున్నావనీ...’’ ఆ మాటలు అంటుంటేనే ఎలాగో అనిపిస్తుండగా ఎలాగోలా అనేసింది.

భవానీ ఏ భావమూ లేకుండా ‘‘అలా అన్నాడా?’’ అంది.

‘‘అబ్బ ప్లీజ్‌, చంపకమ్మా... అసలు విషయమేమిటో చెప్పు... నాకు విన్నప్పటి నుండీ మనసు మనసులో లేదు. ఎంత బాధగా ఉందో తెలుసా, నిజమేనా అది?’’ ఆత్రుతగా అడిగింది మానస.

‘‘నిజమే’’ స్థిరంగా అంది భవానీ. ‘‘వంట వరకూ నిజమే, కాకపోతే నలుగురి ఇళ్ళకి నేను వెళ్ళి చెయ్యట్లేదు. నా ఇంట్లో నేను చేసింది నలుగురూ వచ్చి తీసుకు వెళుతున్నారు.’’

‘‘అంటే? ఇంట్లో మెస్‌ లాంటిదేమైనా పెట్టావా?’’ మానసకి అయోమయం అంతకంతకీ పెరిగిపోతోంది.

‘‘మనూ... నన్నసలు చెప్పనిస్తావా... కాసేపు నువ్వు ఆందోళన పడకుండా, అడ్డు ప్రశ్నలు వేయకుండా వింటాను అంటే వివరంగా చెప్తాను’’ అని చెప్పటం మొదలుపెట్టింది భవానీ.

కొన్నాళ్ళ క్రితం... పక్క ఫ్లాట్‌ ప్రీతి, లిఫ్ట్‌ తెరుచుకుని వాళ్ళ ఇంటివైపు వెళుతూ ‘‘హల్లో ఆంటీ’’ అని పలకరింపుగా నవ్వింది. అప్పుడే సాయంత్రం వంట ముగించి టీవీ ముందు కూర్చున్న నేను ‘‘హలో... బాగున్నావా ప్రీతీ’’ అంటూ పలకరించాను.

నీరసంగా నవ్వుతూ ‘‘లేదాంటీ, రెండు రోజుల నుండి మోషన్స్‌, వామిటింగ్స్‌. ఇప్పుడే డాక్టర్‌ దగ్గరకి వెళ్ళి మందులు తెచ్చుకున్నాను’’ అంది.

‘‘అరే అవునా, ఏమైంది? బయట ఫుడ్‌ ఏమైనా తిన్నారా... పడలేదా?’’ అడిగాను.

‘‘మేము వారంలో, అయిదు రోజులు బయట ఫుడ్డే కదా ఆంటీ. లంచ్‌ రోజూ మా ఆఫీస్‌ క్యాంటీన్‌లోనే. రాత్రి కూడా లేట్‌ అయితే బయటనుంచి ఆర్డర్‌ చేస్తాం. అసలు నాలుగు రోజులు నుండి ఏం చూసినా కడుపులో తిప్పుతోంది...’’ చెప్పుకొచ్చింది.

ప్రీతీ, వాళ్ళ ఆయనా ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలే. రోజుకి కనీసం పధ్నాలుగు గంటలు పని. హడావుడి జీవితాలు!

‘‘అయ్యో! నేనిందాకే కాస్త కరివేపాకు కారప్పొడి చేశాను. నోటికి రుచిగా ఉంటుంది. కాస్త ఇవ్వనా?’’ అన్నాను.

‘‘ఇవ్వండి ఆంటీ’’ ఆశగా అంటూ నాతోపాటే లోపలికి వచ్చింది ప్రీతి.

ఒక చిన్న స్టీల్‌ బాక్స్‌లో వేసి ఇచ్చాను. ‘‘థ్యాంక్స్‌ ఆంటీ’’ అంటూ... ‘‘అబ్బ, ఎంత నీట్‌గా ఉంది ఆంటీ ఇల్లు. వంటిల్లు అయితే మరీ’’ అంది.

‘‘పాడుచెయ్యటానికి ఎవరు ఉన్నారని... నేనొక్కదాన్నే కదా’’ అన్నాను.

‘‘అయినా కూడా... మా ఇల్లు చూడాలి... వార్‌ జోన్‌ లాగా ఉంటుంది’’ అంది.

‘‘మీరిద్దరూ బయటకు వెళ్తారు... పైగా మీ ఇంట్లో చిన్న పాప కూడా కదా... మీకు టైమ్‌ ఎక్కడ దొరుకుతుంది’’ సర్ది చెప్తునట్టు అన్నాను.

‘‘నిజమే ఆంటీ’’ అని నిట్టూరుస్తూ, ‘‘వస్తా ఆంటీ’’ అని మళ్ళీ థ్యాంక్స్‌ చెప్పి వెళ్ళిపోయింది ప్రీతి.

తను వెళ్ళిపోయాక, సీరియల్‌ చూస్తున్నా, ప్రీతి మాటలపైనే ఉంది నా ధ్యాసంతా. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కానీ, ఇప్పటి విద్యలూ ఉద్యోగాలూ డబ్బులు తెచ్చిపెట్టినా కూటికి టైమ్‌ లేకుండా చేస్తున్నాయి. వచ్చిన జీతాలతో కార్లూ ప్లాట్లూ ఖరీదైన వస్తువులూ కొంటున్నారు కానీ, ఆ కొన్న వాటిని అనుభవించే తీరికా లేదు... కడుపుకింత కమ్మగా తినే సమయమూ లేదు... ఏమిటో... అనుకున్నాను.

మర్నాడు పగలంతా ప్రీతి కనపడలేదు. వాళ్ళ ఫ్లాట్‌ తలుపు తీసినట్టు అనిపించలేదు. సాయంత్రం అనుకుంటా మళ్ళీ వచ్చింది, ముందు రోజు నేనిచ్చిన స్టీల్‌ డబ్బా పట్టుకుని ‘‘ఎలా ఉంది ప్రీతి, తగ్గిందా?’’ పలకరించాను.

‘‘ఫర్వాలేదు ఆంటీ, ఇవాళ కొంచెం బెటర్‌’’ ఒక్క రోజుకే పీక్కుపోయిన ముఖంతో అంది. టీపాయ్‌ మీద స్టీల్‌ బాక్స్‌ పెట్టి సోఫాలో కూర్చుంటూ ‘‘ఆంటీ కారప్పొడి ఎంత బాగుందో! రెండు పూటలూ దాంతోనే తిన్నాను. మా వాళ్ళిద్దరూ నాతో పోటీకొచ్చి మొత్తం లాగించేశారు. మా చిన్నది కూడా అదే తింది. రాజు అయితే ఆంటీని అడిగి రెసిపీ రాసుకో అని చెప్పాడు’’ గలగలా చెప్పుకొచ్చింది.

‘‘అయ్యో, నేను కొంచెమే చేశాను. మళ్ళీ చేసిస్తాలే’’ నవ్వుతూ అన్నాను. కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది. ఆమె మాటల్లో నాకు అర్థమైనది... ఇంటర్‌ నుండి ప్రీతి చదువు అంతా హాస్టళ్ళలో సాగింది. క్యాంపస్‌ సెలెక్షన్‌లోనే ఉద్యోగం... హాస్టల్‌ నుండి పీజీ అకామడేషన్‌లోకి. అక్కడా మెస్‌ భోజనమే! ఇప్పుడు ఈ సంసారం... ఇంటి పని... వంట పని... పాప పనితో సతమతమౌతోంది. పైగా వంట అసలు అలవాటు లేదుట. ‘మీరు ఎలా చేస్తారు ఆంటీ ఇంత బాగా... నాకు కూడా నేర్పించండి’ అంటూ ప్రీతి ఒకటే అనటం.

నవ్వొచ్చింది నాకు. పొద్దున లేస్తే వంట చేయటంతోనే గడిచిన జీవితం నాది. పన్నెండు, పదమూడేళ్ళ నుండే అమ్మకి వంటలో సాయపడేదాన్ని... పెద్దకూతుర్ని కదా. ఇక పెళ్ళయ్యాక అత్తగారింట్లోనూ పెద్ద సంసారమే... అత్తగారు, మామగారు, మరుదులు, ఆడపడుచు.

ఈయన పెద్ద అవటంతో అందరి పెళ్ళిళ్ళూ మా తర్వాతే అయినాయి. పెద్దకోడలిగా బాధ్యతలు బాగానే ఉండేవి. పైగా అందరూ భోజనప్రియులు. అంతమంది ఇష్టాయిష్టాలు గమనిస్తూ ఎక్కువ రకాలే వండాల్సి వచ్చేది. అలా అవసరం కొద్దీ వంట బాగా అలవాటయిపోయింది. తిన్నవాళ్ళందరూ కూడా నా వంట అద్భుతంగా ఉందని మెచ్చుకునేవారు. నేనూ వంట ఆసక్తిగా చేసేదాన్ని.

మరుదులూ, ఆడపడుచుల పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళేలోపు... మాకు పిల్లలు పుట్టటం... వెరసి కుటుంబసభ్యుల సంఖ్య దాదాపు మళ్ళీ అంతే! ఇక పిల్లలు పెద్దయి వాళ్ళ పెళ్ళిళ్ళూ పురుళ్ళూ పుణ్యాలూ... ఏనాడూ వంటింటికీ నాకూ రెస్ట్‌ ఉండేది కాదు. అలాంటిది, పిల్లలు ఫారెన్‌లో సెటిల్‌ అవటం... ఏడాదిన్నర క్రితం ఈయన పోవటంతో ఇన్నాళ్ళకి ఇలా ఒంటరిగా ఒక్కదానికి వండుకోవలసి వస్తోంది. నిట్టూర్పుతో ఆలోచనలు కట్టిపెట్టి లేచాను.

మర్నాడు కాస్త నిమ్మకాయ ఊరగాయ తీసి చక్కగా పోపు వేసి, మంచి మిరియాల చారు పెట్టి, రెండూ తీసుకువెళ్ళి ప్రీతికి ఇచ్చాను. తెగ ఆనందపడిపోయారు వాళ్ళు.

ఒక్కదానికి వండుకోవటానికి ఆసక్తిలేక, ఏదో ఇంత ఉడకేసుకు తింటున్న నాకు వాళ్ళకి అలా వండి ఇవ్వటం... వాళ్ళు దానిని పరమానందంగా తినటం ఎంతో తృప్తినిచ్చింది. నేనూ ఆవాళ తృప్తిగా తిన్నాను. అలా వారంలో ఒకటి రెండుసార్లు వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఇవ్వటం అలవాటు అయింది. వాళ్ళ చిన్నది ఈరా కూడా ‘‘అమ్మమ్మా, ఇవాళేం చేశావు... చారు పెట్టావా’’ అంటూ మన ఇంట్లోనే తిరగటం మొదలుపెట్టింది.

ఇంతలో ప్రీతి ఒకరోజు ఒక శుభవార్త తెచ్చింది. తను మళ్ళీ తల్లికాబోతోందట. నేను సంతోషపడి... ఏం తినాలన్న కోరిక కలిగినా మొహమాటపడకుండా నాకు చెప్పమన్నాను. ప్రీతి వాళ్ళ అమ్మ అప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది- ప్రీతి చెల్లెలు మొదటి కాన్పు కోసమని.

తను చెమర్చిన కళ్ళతో ‘‘అలాగే ఆంటీ, థాంక్యూ సోమచ్‌!’’ అంది.

కానీ అనుకోకుండా, తనకి తర్వాతి నెలలో వచ్చిన కొన్ని కాంప్లికేషన్స్‌తో ఒక రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలి అన్నారు. బెడ్‌ రెస్ట్‌ తీసుకోమన్నారు. వాళ్ళకి ఇంకా ఇబ్బంది అయింది. వంటరాని ఆ అబ్బాయి తిప్పలు పడుతూ వండటం, కుదరని రోజు బయట తేవటం... అది ఆ అమ్మాయికి సయించక తినకపోవటం... ఇలా వాళ్ళ తిప్పలు చూసి ‘‘నా వంటతోపాటు మీకు కూడా చేసి పెడతా కొన్ని రోజులు, మీరు అవస్థ పడకండి’’ అన్నాను.

‘‘ఓహో, బాగుందమ్మా... వాళ్ళకి ఫ్రీగా చాకిరీ చేసి పెడుతున్నావన్నమాట’’ మధ్యలో ఆపి మానస ఉక్రోషంగా అంది.

‘‘ఆగు, మొత్తం విను’’ అంటూ చెప్పబోయిన భవానీతో ‘‘బబ్లూని స్కూల్‌ నుంచి తీసుకు వచ్చే టైమ్‌ అయిందమ్మా, తర్వాత మాట్లాడదాం’’ అని ఫోన్‌ పెట్టేసింది మానస.

ఫోన్‌ పెట్టేసిన భవానీ మనసులో అవే ఆలోచనలు కొనసాగాయి.

నిజానికి ప్రీతి వాళ్ళు చాలా మొహమాటపడిపోయారు. ‘‘వద్దాంటీ, పెద్దవాళ్ళు... మిమ్మల్ని ఇబ్బందిపెట్టలేం’’ అన్నారు. తనే ‘‘పెద్దదాన్ని... నాకు ఒక్కదానికే పనిలేక బోర్‌ కొడుతోంది’’ అంటూ మొత్తానికి ఒప్పించింది. కానీ
‘‘సరుకులూ కూరగాయలూ అన్నీ మేమే తెచ్చిపెడతాం... ప్లీజ్‌ కాదనకూడదు’’ అన్నారు. తనూ కొంత తర్జన భర్జన తర్వాత సరేనంది.

అలా మొదలుపెట్టిన తన సాయం తమ మధ్య ఒక అనుబంధంగా అయిపోయింది. కాస్త కుదుటపడ్డ ప్రీతి రోజూ వచ్చి కూర్చుని కబుర్లు చెపుతూ మర్నాటికి కావాల్సిన కూరగాయలు తరిగిపెట్టేది. ఈరా అక్కడే కూర్చుని హోమ్‌వర్క్‌ చేసుకునేది. తన ఒంటరితనమూ నిర్లిప్తతా వదిలిపోయి ఉత్సాహంగా అనిపించసాగింది. రోజుకొక కొత్తరకం చేస్తూ ఈరాని ఆశ్చర్యపరుస్తూ ఉండేది.

‘‘ఆంటీ, మీరు మమ్మల్ని బాగా స్పాయిల్‌ చేసేశారు. ఇక మిమ్మల్ని వదలం’’ అనేవాడు రాజు.

ఇది చూసిన కింద ఫ్లోర్‌ శ్రేయ ‘‘ఆంటీ, నాకు వంట నేర్పించండి... ప్లీజ్‌ ఆంటీ, మీ దగ్గర అసిస్టెంట్‌గా ఉంటా’’ అంటూ తమతో కలిసింది. వాళ్ళ ఇంట్లో కూడా ముగ్గురే. శ్రేయా, ప్రీతీ ఇద్దరూ చేరి ఒక వారంపాటు రకరకాలుగా నచ్చచెప్పి నేను చేస్తున్న సాయానికి ప్రతిఫలం ఉండాల్సిందే అంటూ బలవంతాన తన అకౌంట్‌లో నెలకింత అని వాళ్ళే డబ్బులు వేయటం మొదలుపెట్టారు. తను ససేమిరా వద్దంది. ‘‘ఛ, నేను కేవలం ఒక మనిషిగా సాయం చేస్తున్నాను... దానికి వెల కట్టొద్దు’’ అంది.

‘‘ఆంటీ, మీ టాలెంట్‌ మీకు తెలీదు. దానికి మేము అసలు వెల కట్టలేం. ఇది మా గురుదక్షిణ అనుకోండి’’ అన్నారు వాళ్ళు.

‘‘మేము ఆఫీస్‌లో వర్క్‌ చేస్తే శాలరీ వస్తుంది. ఇంటిపనికి మాత్రం వాల్యూ ఎందుకు లేదు... ఉండాలి ఆంటీ. మీ శ్రమని ఎవరూ ఎక్స్‌ప్లాయిట్‌ చెయ్యకూడదు’’ అంది ప్రీతి. నాకు వాళ్ళ మాటలు కొత్తగా అనిపించినా, ఆలోచనలో పడేశాయి.

రోజూ సాయంత్రం, ఇద్దరూ వచ్చి... పాపం కబుర్లు చెపుతూ మర్నాడు వంటకి నాకు కావాల్సిన కూరలు తరిగి, టిఫినుకి పిండి ఏదైనా రుబ్బాల్సింది ఉంటే రుబ్బి, అన్నీ రెడీగా పెట్టి వెళ్ళేవాళ్ళు. ప్రీతిని వద్దని, శ్రేయానే ఎక్కువగా చేసేది. శ్రేయా కూతురు పింకీ, వాళ్ళ ఇంట్లో ఉన్న బ్లాక్‌ బోర్డ్‌ ఒకటి తెచ్చి గోడకి తగిలించింది. ఈరా, తనూ కలిసి దానిమీద ‘టుడేస్‌ మెనూ’ అని రాసి దానికింద ఆ రోజు వంటకాలన్నీ రాసి పెట్టేవాళ్ళు. పక్కనే ఆ కాయగూర బొమ్మలు గీసేవాళ్ళు. ఇద్దరూ చిన్నవాళ్ళే. ఒక్కొక్క వంటకి వాళ్ళు ఇంగ్లిషులో రాసే స్పెలింగ్స్‌ చూసి మేము తెగ నవ్వుకుంటూ ఉండేవాళ్ళం.

వాళ్ళు నాలుగు నెలలుగా డబ్బులు అకౌంట్‌లో వేస్తున్నా, ఎందుకో తియ్యబుద్ధి కాలేదు. అకౌంట్‌లో బ్యాలన్స్‌ చూసుకుంటే ఎంత చిత్రంగా, ఉద్వేగంగా అనిపించిందో! నా జీవితంలో మొట్టమొదటి సంపాదన... అరవై ఏళ్ళ వయసులో. అచ్చంగా నాదే అన్న డబ్బు. ఎందుకో తెలీదు... కొంత గిల్టీగా కూడా అనిపించింది. పిల్లలకి ఇప్పటివరకూ ఏం చెప్పలేదు. కానీ ఇవాళ మనూతో ఇవన్నీ పంచుకున్నాక మనసు తేలికగా ఉంది.

అలోచనల నుంచి తేరుకున్న భవానీ... ఫోన్లో చెప్పలేకపోయిన ఈ విషయాలన్నీ వివరంగా రాసి మెయిల్‌ పెట్టింది మానసకి.

మెయిల్‌ చదివిన మానస మర్నాడు తల్లికి ఫోన్‌ చేసింది.

‘‘ఇదంతా మాతో ఒక్కమాట కూడా ఎందుకు అనలేదమ్మా నువ్వు?’’ మానస మెల్లగా అడిగింది. ఈసారి ఆమె గొంతులో ఆక్షేపణ లేదు.

భవానీ దీర్ఘంగా నిట్టూర్చింది. ‘‘మీరు దీనికి ఎలా స్పందిస్తారో అర్థంకాలేదు. మాటల్లో చెపితే- మీ బాబాయి అన్నట్టు... చేసేది వంట పనే! అయితే, అసలు ఆ పనికైనా ఎందుకు అవమానపడాలి. సరైన రీతిలో అర్థం చేసుకుంటే అదీ ఒక ఉద్యోగమే. ఎక్కడో దూరాన ఉన్న మీకు ఈ నేపథ్యం అంతా చెపితే తప్ప అర్థం కాదు. అప్పుడు కూడా నచ్చకపోవచ్చు. మీ నాన్న ఉన్నప్పుడు కూడా నేను ఏది చెప్పాలన్నా, వందసార్లు రిహార్సల్‌ వేసుకుని చెప్పేదాన్ని. దేనికి కోపం వస్తుందో తెలిసేది కాదు. ఈ విషయం కూడా... అందుకే, మీకు చెప్పాలని ఎన్నోసార్లు నోటివరకూ వచ్చినా చెప్పలేదు’’ భవానీ మెల్లగా చెప్పింది.

వింటున్న మానసని కొత్త ఆలోచనలెన్నో ఒకేసారి ఉక్కిరిబిక్కిరి చేశాయి... అసలు అమ్మవైపు నుండి ఎప్పుడైనా ఆలోచించామా? అమ్మగా కాకుండా ఒక వ్యక్తిగా, తనని అర్థం చేసుకునే ప్రయత్నం చేశామా? పైగా బయట హోటళ్ళలో, టీవీ షోస్‌, యూట్యూబ్‌లో షెఫ్స్‌కి ఇచ్చే గౌరవం వీళ్ళకి ఎందుకు ఇవ్వం. వంటలక్క అని ఎందుకు చులకన... మానస అంతరంగంలో ఎన్నో భావాలు, సందేహాలు!

మానస ఏమీ అనకపోయేసరికి అవతలివైపు నుండి భవానీ ‘‘హలో... హలో...’’ అంటోంది. తేరుకున్న మానస, తడబడుతున్న గొంతుతో ‘‘సారీ అమ్మా, నేను కూడా నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు’’ అని మళ్ళీ... ‘‘కానీ అమ్మా, ఇంత ఎక్‌స్ట్రా పనితో నీ ఆరోగ్యం పాడైతే... వాళ్ళు వచ్చి నీకు చేస్తారా? అప్పుడు ఎంత కష్టం’’ మానస ఇంకా సమాధాన పడలేకపోతోంది.

‘‘నాకూ మొదట్లో ఆ భయం వేసింది. కానీ చిత్రంగా ఈ పని మొదలుపెట్టాక నాకు నీరసం, నిర్లిప్తతా వదిలిపోయి కొత్త ఓపిక వచ్చింది. ఇదివరకు ‘పొద్దున లేచి... ఏం చేసేదుందిలే’ అని బద్ధకంగా అనిపించిన నాకు ఇప్పుడు ఎప్పుడెప్పుడు లేద్దామా అనిపిస్తోంది.’’

‘‘పైగా ఆ మధ్య ఒక రెండు రోజులు నాకు కాస్త నలతగా ఉన్నప్పుడు శ్రేయ, ప్రీతి నా గురించి తీసుకున్న శ్రద్ధతో నాకు ఆ భయం కూడా పోయింది.’’ వాళ్ళే కారులో డాక్టర్‌ దగ్గరకి తీసుకువెళ్ళి, చూపించి ‘‘ఆంటీ, మీకూ మీ కిచెన్‌కీ కంప్లీట్‌ రెస్ట్‌’’ అంటూ, బాగయ్యేదాకా వాళ్ళే వండి తెచ్చిపెట్టి తోడుగా ఉన్నారు’’ చెప్పింది భవానీ.

‘‘అవునా, నువ్వు మా దగ్గర చాలానే దాచావమ్మా’’ నిష్టూరంగా అంది మానస.

భవానీ వెంటనే ‘‘అయ్యో మనూ, మీ నుంచి దాచాలని కాదు తల్లీ, అంత దూరంలో ఉన్న మిమ్మల్ని ఇబ్బంది కానీ కంగారు కానీ పెట్టకూడదని మాత్రమే’’ నొచ్చుకుంటూ అంది.

‘‘కానీ ఒకందుకు సంతోషంగా ఉందమ్మా... నేనూ తమ్ముడూ ఇద్దరం దగ్గరలోలేం. డాడీ పోయాక, నువ్వు ఒంటరిగా ఎలా ఉంటున్నావో అన్న దిగులు ఉండేది. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెపుతుంటే హ్యాపీగా ఉందమ్మా. అసలు
ఆ ప్రీతీ శ్రేయా ఎవరో నేను కూడా చూడాలి, మాట్లాడాలి అమ్మా. చెప్పాలంటే మా ప్లేస్‌ వాళ్ళు లాగేసుకున్నారు కదా’’ ఒకింత అసూయగా అంది మానస.

భవానీ నవ్వి ‘‘అదేమీ లేదు, మీ స్థానం మీదే మనూ. నువ్వూ మనోజ్‌ నా ప్రాణం’’ అంటూ, ‘‘నాకు కూడా ఇవాళ ఒక పెద్ద భారం దిగిపోయింది. ఇన్నాళ్ళూ దాచుకున్నది నీకు చెప్పేశాను. ప్రాణం తెరిపినపడ్డట్టు ఉంది’’ అంది.

మానసకి తల్లిని కొత్తగా చూస్తున్నట్టు అనిపించింది. ఇద్దరిమధ్యా కొత్త అవగాహనతో... దగ్గరితనం పెరిగినట్టు అనిపించింది.

ఇప్పుడు మానసకి ప్రీతీ, శ్రేయా ఇద్దరూ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌. వాట్సాప్‌లో ఫేస్‌బుక్‌లో వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది.

ఒక పదిహేను రోజుల తర్వాత అమ్మతో కాన్ఫరెన్స్‌ కాల్‌ మాట్లాడుతోంది. మానస తమ్ముడూ మరదలూ కూడా ఉన్నారు కాల్‌లో. ఇటు అమ్మ పక్కన శ్రేయా, ప్రీతి. అందరి ముఖాలలో ఒక సంతృప్తీ ఉత్సాహం. శ్రేయా, ప్రీతీ ఇద్దరూ పోటీపడి చెపుతున్నారు మానసకీ మనోజ్‌కీ ముందురోజు ఆదివారం వాళ్ళు చేసిన కార్యక్రమం గురించి.

‘‘ఆంటీ నిజంగా అన్నపూర్ణ. మా అందరికీ నిజంగా ఇన్‌స్పిరేషన్‌! అంకుల్‌ బర్త్‌ యానివర్సరీ సందర్భంగా, మా ఇళ్ళ దగ్గర, బస్తీవాళ్ళు మొత్తం అరవై మందికి వండిపెట్టారు తెలుసా’’ ప్రీతి ఉత్సాహంగా చెప్తోంది.

‘‘అది కూడా మొత్తం తన సొంత శాలరీ డబ్బుతో’’ శ్రేయా పక్కనుండి అందిస్తోంది.

అమ్మ చిరునవ్వుతో వాళ్ళ మాటలు వింటూ ‘‘పాపం కిందటి యేడాది ఈ లాక్‌డౌన్‌ వల్ల వాళ్ళకి చేతిలో పని లేదు, పైసలు లేవు.

తినటానికి తిండి లేదు. అందుకే నాన్న పేరు చెప్పి వాళ్ళకి ఒకపూటైనా తిండి పెడదామని అనిపించింది’’ చెపుతున్న అమ్మ ముఖంలో బోలెడంత సంతృప్తి.

‘‘గ్రేట్‌ అమ్మా, రియల్లీ గ్రేట్‌!’’ ఉద్వేగంగా అంటున్నాడు మనోజ్‌.

‘‘మేము ఇలా మొదలుపెట్టేసరికి అపార్ట్‌మెంట్‌లో చాలామంది మేము కూడా హెల్ప్‌ చేస్తాము అన్నారు. సో, ఈ కార్యక్రమం ఎవ్రీ మంత్‌ చేద్దామనుకుంటున్నాం’’ ప్రీతి చెప్పింది.

‘‘ఆంటీకి ఇక్కడ ఫ్యాన్స్‌, హెల్పర్స్‌ చాలామంది తయ్యారయ్యారు. ఆంటీ సూపర్‌వైజ్‌ చేస్తే చాలు, మేము వండేస్తాం అంటున్నారు’’ శ్రేయా నవ్వుతూ చెపుతోంది.

‘‘అత్తయ్యా, మీరొక ఫేస్‌బుక్‌ పేజీ స్టార్ట్‌ చెయ్యాలి’’ కోడలు కావ్య అంటోంది.

‘‘నాకెందుకు కావ్యా అవన్నీ?’’ చిన్నగా నవ్వుతూ అని, ‘‘అది కాదు కానీ పిల్లలూ... ఒక మంచిపని మొదలుపెడితే అందరూ ఎలా కలిసివస్తారో అర్థమైంది. వాళ్ళ ఆకలి తీర్చటానికి చేతైనంత చేద్దాం అనిపిస్తోంది’’ చెమర్చిన కళ్ళతో అంది భవానీ.

వింటున్న మానస తల్లినే అబ్బురంగా చూస్తోంది. తమ కుటుంబానికే పరిమితం చేసిన అమ్మ ప్రతిభ, నైపుణ్యం ఈ రోజు పదిమందికీ ఉపయోగపడుతున్నాయి. తనకంటూ సంపాదన మొదలైందని, అమ్మ సొంతానికి ఖర్చు పెట్టుకుందాం అనుకోలేదు, ఏ బంగారమో కొంటాను అనలేదు.

తనూ తన సంసారం అనే బంధాన్ని దాటేసి విశాల ఆకాశం దిశగా రెక్కలు సాచి పరుగులు తీస్తోంది. పరిధి విస్తరించుకుని కొత్త గుర్తింపు పొందుతోంది. మానసకి అంతా కలలాగా ఉంది. అమ్మ ఆమెను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. మనసులోనే అమ్మకి మరొక్కసారి వందనాలు తెలుపుకుంది.

ఆ తర్వాత వారానికి వచ్చిన ‘మదర్స్‌ డే’ సందర్భంగా అమ్మ ఫొటో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన మానస ‘ఎర్నింగ్‌ అట్‌ ద ఏజ్‌ ఆఫ్‌ సిక్స్‌టీ, అండ్‌ స్పెండింగ్‌ ఇట్‌ హౌ! ప్రౌడ్‌ ఆఫ్‌ యూ మామ్‌!’’ అని కామెంట్‌ పెట్టింది.
ప్రీతీ, శ్రేయా ఇద్దరూ లైకులు కొట్టారు. వాళ్ళతోపాటు అనేక వందల మంది!

అన్నట్టు బాబాయి లైక్‌ కొట్టలేదు కానీ పిన్ని లైక్‌ కొట్టింది. కొట్టటమే కాదు... ‘మీ బాటలో నడవాలని ఉంది అక్కయ్య గారూ’ అని కామెంట్‌ కూడా పెట్టింది.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని