Himalayan Pink Salt: గులాబీ ఉప్పు కథ తెలుసా?!

‘ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిది, ఆరోగ్యసమస్యలు తగ్గుతాయి...’ అని వైద్యులు, పోషక నిపుణులు పదే పదే చెబుతున్న విషయం అందరికీ బాగానే అర్థమైంది. అందుకే దాన్ని తగ్గించుకుని తినడంతోపాటు ఉప్పుల్లో తక్కువ హాని కలిగించేవాటిని వెతికి మరీ కొంటున్నారు.

Updated : 24 Dec 2023 08:39 IST

‘ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిది, ఆరోగ్యసమస్యలు తగ్గుతాయి...’ అని వైద్యులు, పోషక నిపుణులు పదే పదే చెబుతున్న విషయం అందరికీ బాగానే అర్థమైంది. అందుకే దాన్ని తగ్గించుకుని తినడంతోపాటు ఉప్పుల్లో తక్కువ హాని కలిగించేవాటిని వెతికి మరీ కొంటున్నారు. అందులో భాగంగా ఈమధ్య మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తున్నదే ‘హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌’ (Himalayan Pink Salt). అసలేమిటీ గులాబీ రంగు ఉప్పు... ఎక్కడిదీ... ఎందుకు మంచిదీ... తెలుసుకోవాలంటే..!

వినడానికి వింతగా అనిపించవచ్చుగాక, కానీ ఈ మధ్య సూపర్‌ మార్కెట్లలో తెల్లని ఉప్పు ప్యాకెట్ల కన్నా గులాబీరంగులోని సాల్ట్‌ ప్యాక్‌లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది పొడిఉప్పు(టేబుల్‌సాల్ట్‌) లేదా కల్లుఉప్పు... ఏదయినా కావొచ్చు, దానిమీద హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌ లేదా సైంధా నమక్‌(సైంధవ లవణం)అన్న లేబుల్‌ కనిపిస్తుంది. అంతేనా, ఒకప్పుడు ఊళ్లలోకి ఉప్పు బండ్లు వచ్చినట్లే ఈమధ్య పెద్ద పెద్ద గులాబీరంగు ఉప్పు రాళ్లనీ ట్రక్కుల్లో తెచ్చి నగరాల్లోనూ పట్టణాల్లోనూ అమ్ముతున్నారు. దాంతో ధర ఎక్కువైనా చాలామంది ఇష్టంగానో కష్టంగానో దీన్ని కొంటున్నారు. అదేమని అడిగితే... ఆరోగ్యానికి మంచిదనీ చెబుతున్నారు. పోషక నిపుణులు సైతం అందులో నిజం లేకపోలేదనీ అంటున్నారు.

ఉప్పు లేని పప్పే కాదు, ఏ వంటయినా చప్పగానే ఉంటుంది(ఒక్క మిఠాయిలు తప్ప). ఎన్ని దినుసులు ఉన్నా కూరలో ఉప్పు లేకపోతే సహించదు. అలాగని ఉప్పు రుచి కోసమేనా అంటే కాదనే చెప్పాలి. శరీరం నిర్వహించే రోజువారీ విధులకు ఉప్పూ అవసరమే. అందులోని సోడియం ఎలక్ట్రోలైట్‌లా పనిచేస్తుంది. నరాల ప్రేరణకీ, కండరాల సంకోచానికీ, కణాల్లో నీరు, ఖనిజాల సమతుల్యతకీ శరీరానికి ప్రతిరోజూ 500 మి.గ్రా. సోడియం కావాలి. అందుకే ఆరోగ్యవంతులు రోజుకు 2300 మి.గ్రా. సోడియం క్లోరైడ్‌(ఉప్పు)ను తీసుకోవచ్చని ‘అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌’ చెబుతోంది. ఇది ఒక టీస్పూను(5గ్రా.) ఉప్పుతో సమానం. ఇంతకు మించి తింటే ముప్పు తప్పదు అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. బీపీ ఉన్నవాళ్లయితే 1500మి.గ్రా.(3.75)గ్రా.కన్నా తక్కువ తింటేనే మంచిదట.

అయితే సముద్ర నీటిని సూర్యరశ్మికి ఎండబెట్టి తయారుచేసే సముద్రపు ఉప్పులోనూ సోడియంతోపాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం... వంటి ఖనిజాలు కొద్దిపాళ్లలో ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం వాడుకలో ఉన్న తెల్లఉప్పూ ఆరోగ్యానికి మంచిదే. అయితే అందులోని మలినాలను శుద్ధి చేసే ప్రక్రియలో సోడియం మినహా మిగిలిన ఖనిజాల శాతం తగ్గిపోతుంది.

అదే ప్రకృతే స్వయంగా ఏర్పరచిన హిమాలయన్‌ పింక్‌ రాక్‌ సాల్ట్‌లో సోడియం క్లోరైడ్‌తోపాటు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌, సిలికాన్‌, బేరియం... వంటి మూలకాలూ కొద్దిపాళ్లలో ఉంటాయి. అందుకే దీన్ని సహజ ఉప్పు అనీ, సముద్ర ఉప్పుకన్నా మంచిదనీ చెబుతున్నారు. పైగా ఇందులో అయొడిన్‌ కూడా స్వల్పంగా ఉంటుంది. అయితే థైరాయిడ్‌ సమస్యల నివారణకు అది చాలదన్న కారణంతో కొన్ని కంపెనీలు టేబుల్‌ సాల్ట్‌లో మాదిరిగానే పింక్‌సాల్ట్‌కీ అయొడిన్‌ను చేరుస్తున్నాయి.

నిజానికి సముద్ర ఉప్పు కూడా అందులోని ఖనిజాలూ మలినాలను బట్టి తెలుపు, బూడిద, లేత గులాబీరంగుల్లోనే ఉంటుంది. శుద్ధి చేయడంతో తెల్లగా మారిపోతుంది. కానీ హిమాలయన్‌ సాల్ట్‌ లేత గులాబీ రంగులో ఉంటుంది. అయితే ఈ ఉప్పురాళ్లు కూడా తెలుపు, నారింజ, బూడిద, ఎరుపు... ఇలా భిన్న రంగుల్ని కలిగి ఉంటాయి. అవన్నీ కలిపి కొట్టినప్పుడు అది లేత గులాబీ నుంచి లేత నారింజ వర్ణాలను సంతరించుకుంటుంది. సముద్ర ఉప్పుతో పోలిస్తే ఇది కాస్త తియ్యని రుచితో ఉంటుంది. పైగా ఈ ఉప్పురాళ్లతో గ్లాసులూ గిన్నెలూ కూడా చేస్తున్నారు. చికెన్‌, చేపలు...వంటివాటిని వీటిమీద కాలిస్తే రుచిగా ఉంటాయన్న కారణంతో కొన్నిచోట్ల ఈ ఉప్పు రాళ్లను వంటపాత్రలు లేదా గ్రిల్‌గానూ కూడా వాడుతున్నారు.

ఎక్కడిదీ ఉప్పు?

సుమారు యాభై కోట్ల సంవత్సరాల క్రితం... అంటే మానవజాతి ఆవిర్భవించక ముందు... లోతట్టు సముద్రంలోని నీరంతా ఆవిరైపోయింది. అందులోని ఖనిజాలు మాత్రం ఉండిపోయాయి. కాలక్రమంలో భూమిలోని పొరలన్నీ అటూ ఇటూ కదలడంతో ఆ సాగర గర్భం కాస్తా భూభాగంలోకి చొచ్చుకు వచ్చి, నేలమాళిగల్లోకి చేరి మూసుకుపోయింది. దానిమీద పేరుకున్న రాళ్లూ మంచుతో నిండిన పర్వతాలతో కాలుష్యంబారిన పడకుండా లోపల మరిన్ని ఖనిజాలను కలుపుకుని సురక్షితమైన గనిలా రూపుదిద్దుకుంది. పురాతనమైన ఆ ఉప్పు గని పేరే ఖేవ్రా... ప్రస్తుత పాకిస్తాన్‌లోని హిమాలయాలకు దక్షిణంగా ఉన్న పోటోహార్‌ పీఠభూమికి దిగువన ఉన్న ఉప్పు పర్వత శ్రేణిలో ఉంది. దీన్నే ‘మాయో సాల్ట్‌ మైన్‌’ అనీ అంటారు. అక్కడే కాలాబాగ్‌, వార్చా అని మరికొన్ని గనులూ ఉన్నాయి. సముద్రఉప్పు తెలియకముందే ఏర్పడిన సహజఉప్పు అన్నమాట. క్రీ.పూ.ఆరువేల ఏళ్ల కాలంలోనే మనిషి నీటినుంచి ఉప్పు తయారీ నేర్చుకుని ఆహారపదార్థాలను నిల్వచేసుకునేవాడు.  

ఎలా గుర్తించారు?

క్రీ.పూ.320ల్లో కావచ్చు... భారతావని మీద దండెత్తిన అలెగ్జాండర్‌- ఖేవ్రా ప్రాంతంలో తన సైనికులతో విశ్రాంతి తీసుకుంటున్నాడట. ఆ సమయంలో దాహంతో అలసిన గుర్రాలు అక్కడి కొండల్ని నాకడాన్ని ఓ సైనికుడు గుర్తించాడట. వెంటనే దాన్ని తవ్వి చూడగా- ఉప్పు నిక్షేపాలు ఉన్నాయన్న విషయం బయటపడిందట. ఆ తరవాత స్థానిక జుంజువా వంశీయులు ఈ ఉప్పును తవ్వేవారు. కానీ మొఘల్స్‌ కాలంలోనే అక్కడ ఉప్పు తవ్వకం అనేది ఓ వ్యాపారంగా మారింది. అప్పటినుంచీ దాన్ని తవ్వుతూనే ఉన్నారు. 1870లలో బ్రిటిషర్లు ఇక్కడ ఓ సొరంగాన్ని నిర్మించడంతో ఇది మరింత వెలుగులోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం- 1974లో పాకిస్తాన్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ గనిని స్వాధీనం చేసుకుని, ఏడాదికి మూడున్నర లక్షల టన్నుల ఉప్పును ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆ దిగుబడిని మరింత పెంచడంతోపాటు అక్కడే శుద్ధి చేసి, భారీయెత్తున దిగుమతి చేసుకునేందుకు తాజాగా ఓ అమెరికన్‌ కంపెనీ పాకిస్తాన్‌లో 20 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టాలనుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఈ పింక్‌సాల్ట్‌ వైపు చూస్తున్నాయి.

అందం-ఆరోగ్యం!

సముద్ర ఉప్పులో 97-99శాతం సోడియం క్లోరైడ్‌ ఉంటే పింక్‌ సాల్ట్‌లో 98 శాతం ఉండటంతోపాటు అదనంగా 84 రకాల ఖనిజాలూ; స్ట్రాన్షియం, మాలిబ్డినమ్‌... వంటి అరుదైన మూలకాలూ ఉంటాయట. ఇందులోని ఐరన్‌ వల్లే దీనికా రంగు వస్తుంది. అందుకే ఇది బీపీ నియంత్రణకీ రక్తప్రసరణకీ జీర్ణశక్తి మెరుగయ్యేందుకూ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించేందుకూ తోడ్పడుతుందని కొందరు నిపుణులు అంటున్నారు.

  • గులాబీ ఉప్పులోని ఖనిజాలు కణాల్లో అధికంగా ఉన్న నీటిని తొలగిస్తాయి. దాంతో శరీరంలోకి నీరు చేరడం, పొట్ట ఉబ్బరం... తగ్గుతాయి. ఫలితంగా బరువూ తగ్గుతారు.
  • డీహైడ్రేషన్‌, ఎలక్ట్రోలైట్ల లోపం, కండరాల బలహీనత... వంటి కారణాల వల్ల కొందరికి తరచూ కండరాలు పట్టేస్తుంటాయి. అలాంటివాళ్లకి ఈ ఉప్పులోని ఎలక్ట్రోలైట్ల వల్ల ఆ సమస్య తగ్గుతుందనీ, ముఖ్యంగా ఇందులోని మెగ్నీషియం కండరాల సంకోచాన్ని తగ్గిస్తుందనీ నిపుణులు చెబుతున్నారు. అలాగే తరచూ డీహైడ్రేషన్‌తో బాధపడేవాళ్లు షర్బత్‌లాంటి పానీయాల్లో చిటికెడు పింక్‌సాల్ట్‌ వేసుకుని తాగితే ఫలితం ఉంటుందట.
  • గులాబీ ఉప్పు శరీరంలో సెరటోనిన్‌ను శాతాన్ని పెంచడం ద్వారా డిప్రెషన్‌, ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గిస్తుందనీ అంటున్నారు.
  • ఇందులోని ఖనిజాల కారణంగా రక్తప్రసరణ మెరుగవుతుందనీ తద్వారా అన్ని అవయవాలూ చక్కగా పనిచేస్తాయనీ, హృద్రోగాలను తగ్గిస్తుందనీ, ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందనీ కూడా చెబుతున్నారు.
  • ఈ ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే అందులోని మెగ్నీషియంను శరీరం గ్రహించడంతో ఎముకలు, బంధన కణజాలాలు ఆరోగ్యవంతమై కండర నొప్పులు తగ్గుతాయట.
  • చర్మంమీద ఉన్న మట్టినీ టాక్సిన్లనీ గ్రహించి మృదువుగా ఉంచుతుందన్న కారణంతో చర్మసంరక్షణలో స్క్రబ్‌, ఫేస్‌మాస్క్‌లుగానూ ఈ ఉప్పును వాడుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో కొబ్బరినూనెలో పింక్‌ సాల్ట్‌ కలిపి రుద్దితే చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఎగ్జిమా వంటి చర్మవ్యాధుల్నీ తగ్గించడంతోపాటు సహజ డియోడరెంట్‌గానూ పనిచేస్తుంది.

అయితే ఒక్క విషయం... మంచిదన్నారు కదాని ఎక్కువగా వాడితే టేబుల్‌ సాల్ట్‌లానే ఇదీ ప్రమాదమే. ఇందులోనూ ప్రధానంగా ఉండేది సోడియంక్లోరైడే అన్నది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఉప్పు ఏదయినా మితిమీరితే ముప్పు తప్పదు.


ఉప్పు దీపం!

పింక్‌ సాల్ట్‌ను ఆహారపదార్థాల్లో కాకుండా అలంకరణ దీపాలుగానూ, స్పా చికిత్సల్లోనూ వాడుతున్నారు. ఈ దీపాలను వెలిగించడం వల్ల వెలువడే అయాన్లు గాల్లోని దుమ్మూధూళినీ పుప్పొడినీ పొగనీ ఇతర మలినాలనీ పీల్చుకోవడంతో శ్వాస సమస్యలు తగ్గుతాయట. అందుకే పూర్వకాలంలోనే గ్రీకులు శ్వాస సరిగ్గా ఉండేందుకు ఈ దీపాలను వాడినట్లు తెలుస్తోంది. దాంతో ఆస్తమా, అలర్జీలు, సైనస్‌ ఇన్ఫెక్షన్లూ ఉన్నవాళ్లకి ఈ దీపాలను వాడటం వల్ల ఫలితం ఉంటుందనీ నిద్ర పట్టేలా చేస్తుందని అంటున్నారు. ఎలక్ట్రానిక్‌ వస్తువుల నుంచి వెలువడే నీలి కాంతిలా కాకుండా ఈ దీపాలు వెదజల్లే ఎర్రని కాంతి నిద్రపట్టేలా చేస్తుంది. కాబట్టి ఈ ఉప్పు రాళ్లని బెడ్‌లైట్లుగానూ వాడుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..