చేద్దాం రండి... పసందైన పకోడి..!

ఉల్లిపాయతో చేసే పకోడీ అందరికీ తెలిసిందే. కానీ దాన్నే ఇంకాస్త వెరైటీగా తినాలనుకుంటే మాత్రం... ఇలాంటి రుచుల్లో ప్రయత్నిస్తే సరి.

Published : 26 Jun 2022 01:02 IST

చేద్దాం రండి... పసందైన పకోడి..!

ఉల్లిపాయతో చేసే పకోడీ అందరికీ తెలిసిందే. కానీ దాన్నే ఇంకాస్త వెరైటీగా తినాలనుకుంటే మాత్రం... ఇలాంటి రుచుల్లో ప్రయత్నిస్తే సరి.


కూరగాయలతో...

కావలసినవి: క్యారెట్‌: ఒకటి, క్యాప్సికం: ఒకటి, క్యాబేజీ తరుగు: కప్పు, ఉల్లిపాయ: ఒకటి, బీన్స్‌: ఆరు, పాలకూర తరుగు: కప్పు, సెనగపిండి: అరకప్పు, బియ్యప్పిండి: పావుకప్పు, మొక్కజొన్నపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి: మూడు, పుదీనా ఆకులు: పది, అల్లం ముద్ద: చెంచా, గరంమసాలా: అరచెంచా, వాము: అరచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: క్యారెట్‌, క్యాప్సికం, బీన్స్‌ను వీలైనంత సన్నగా, పొడుగ్గా కోసి ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో క్యాబేజీ తరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, పాలకూర తరుగు, తగినంత ఉప్పు, అల్లంముద్ద, గరంమసాలా, వాము వేసుకుని బాగా కలుపుకోవాలి. తరవాత నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసుకుని అన్నింటినీ కలిపి కాగుతున్న నూనెలో పకోడీల్లా వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.  


రవ్వతో...

కావలసినవి: బొంబాయిరవ్వ: అరకప్పు, జీలకర్ర: అరచెంచా, అల్లం తరుగు: చెంచా, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తరుగు: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, ఉల్లిపాయ: ఒకటి, వెల్లుల్లి ముద్ద: అరచెంచా, పెరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, మైదా: రెండు టేబుల్‌స్పూన్లు, వంటసోడా: పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ఓ గిన్నెలో బొంబాయిరవ్వ, జీలకర్ర, అల్లంతరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, సరిపడా ఉప్పు, ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లిముద్ద, పెరుగు, అరకప్పు నీళ్లు పోసి అన్నింటినీ కలిపి మూత పెట్టాలి. పావుగంటయ్యాక వంటసోడా, మైదా కలిపి... కాగుతున్న నూనెలో పకోడీల్లా వేసి, బాగా వేయించుకుని తీసుకోవాలి.  


మటన్‌తో...

కావలసినవి: ఎముకల్లేని మటన్‌: అరకేజీ, కారం: రెండు చెంచాలు, జీలకర్రపొడి: చెంచా, పసుపు: అరచెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద: ఒకటిన్నర చెంచా, ఉప్పు: తగినంత, సెనగపిండి: కప్పు, బియ్యప్పిండి: రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాలపొడి: చెంచా, వంటసోడా: అరచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: మటన్‌ముక్కల్ని కడిగి కుక్కర్‌లో వేసుకోవాలి. ఇందులో చెంచా అల్లంవెల్లుల్లి ముద్ద, చెంచా కారం, జీలకర్రపొడి, పసుపు, సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి... నాలుగు కూతలు వచ్చాక స్టౌని కట్టేయాలి. ఇప్పుడు ఓ గిన్నెలో మిగిలిన కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు, సెనగపిండి, బియ్యప్పిండి, మిరియాలపొడి, వంటసోడా వేసి ఓసారి కలిపి, మటన్‌ముక్కలు వేయాలి. కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ అన్నింటినీ కలుపుకుని వేడి నూనెలో పకోడీల్లా వేసి బాగా వేయించుకుని తీసుకోవాలి.


చెఫ్‌చిట్కా

సాస్‌లు అయిపోయాయా...

మంచూరియా, పకోడీ, ఫ్రెంచ్‌ఫ్రైస్‌ లాంటివాటిని సాస్‌లో ముంచుకుని తింటే ఆ మజానే వేరు. కానీ ఒక్కోసారి ఇంట్లో సాస్‌లు అయిపోయి, వాటిని తెచ్చుకునే సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ ఇన్‌స్టంట్‌ సాస్‌లు చేసుకోవచ్చు.

* టొమాటోసాస్‌: ఆరు బాగా పండిన టొమాటోలు, అరచెంచా కారం, మూడు టేబుల్‌స్పూన్లు చక్కెర, కొద్దిగా ఉప్పు, మూడు టేబుల్‌స్పూన్లు వినెగర్‌ తీసుకోవాలి. ముందుగా టొమాటోలను నీళ్లల్లో వేసి స్టౌమీద పెట్టి అయిదు నిమిషాలయ్యాక కట్టేయాలి. వేడి చల్లారాక టొమాటోల చెక్కు తీసి, మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కడాయిలో వేసి స్టౌమీద పెట్టి వినెగర్‌ తప్ప మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. ఇది బాగా దగ్గరకు అయ్యాక వినెగర్‌ వేసి కలిపి స్టౌని కట్టేయాలి.

* చిల్లీసాస్‌: దీనికోసం ఇరవై పచ్చిమిర్చి, రెండు టేబుల్‌స్పూన్ల నూనె, నాలుగు వెల్లుల్లిరెబ్బలు, చిన్న అల్లంముక్క, చెంచా ఉప్పు, పావుకప్పు నీళ్లు, అరచెంచా వినెగర్‌, పావుచెంచా జీలకర్రపొడి, చెంచా చక్కెర తీసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి టేబుల్‌స్పూను నూనె వేసి వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేయించి పావుకప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. పచ్చిమిర్చి మెత్తగా అయ్యాక స్టౌని కట్టేయాలి. వేడి పూర్తిగా చల్లారాక ఈ మూడింటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌చేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి పచ్చిమిర్చి పేస్టు, వినెగర్‌, జీలకర్రపొడి, చక్కెర వేసి కలిపి దగ్గరకు అయ్యాక దింపేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..