పసందైన పచ్చళ్లు

కూర, పప్పు, సాంబారు లాంటివి లేకపోయినా కాస్త పచ్చడి ఉంటే చాలనేస్తుంటారు కొందరు. అలాంటివారికోసమే ఈ పచ్చళ్ల రుచులు. ఆలస్యమెందుకు మరి... నచ్చిదాన్ని చకచకా చేసేసుకుని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని లాగించేయండి మరి.

Published : 03 Dec 2022 23:31 IST

పసందైన పచ్చళ్లు

కూర, పప్పు, సాంబారు లాంటివి లేకపోయినా కాస్త పచ్చడి ఉంటే చాలనేస్తుంటారు కొందరు. అలాంటివారికోసమే ఈ పచ్చళ్ల రుచులు. ఆలస్యమెందుకు మరి... నచ్చిదాన్ని చకచకా చేసేసుకుని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని లాగించేయండి మరి.


టొమాటోతో...  

కావలసినవి: టొమాటోలు: ఆరేడు, చింతపండు: ఉసిరికాయంత, కారం: అరకప్పు, ఆవపిండి: పావుకప్పు, పసుపు: అరచెంచా, వేయించిన మెంతిపొడి: పావుచెంచా, ఉప్పు: తగినంత, ఆవాలు: చెంచా, సెనగపప్పు: చెంచా, మినప్పప్పు: చెంచా, ఎండుమిర్చి: రెండు, ఇంగువ: పావుచెంచా, నూనె: అరకప్పు.

తయారీ విధానం: టొమాటోలను కడిగి... ముక్కల్లా కోసుకోవాలి. ఈ ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి... పావుకప్పు నూనె వేయాలి. అది వేడెక్కాక టొమాటో గుజ్జు, చింతపండు వేసి బాగా కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి. అయిదు నిమిషాలయ్యాక పసుపు, తగినంత ఉప్పు వేసి మరోసారి కలపాలి. టొమాటో గుజ్జు ఉడికిందనుకున్నాక కారం, ఆవపిండి, మెంతిపొడి వేసి కలిపి నూనె తేలుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు స్టౌమీద మరో కడాయి పెట్టి... మిగిలిన నూనె వేయాలి. ఇందులో ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించి ఈ తాలింపును పచ్చడిలో కలపాలి.


పెసరపప్పుతో...

కావలసినవి: పెసరపప్పు: అరకప్పు, ఎండుమిర్చి: ఐదారు, జీలకర్ర: చెంచా, నూనె: చెంచా, ఆవాలు: అరచెంచా, సెనగపప్పు: అరచెంచా, మినప్పప్పు: అరచెంచా, నిమ్మకాయ: ఒకటి, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: పెసరపప్పు, ఎండుమిర్చిని ఓ గిన్నెలో తీసుకుని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. గంటయ్యాక పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, సరిపడా ఉప్పును మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకుని నిమ్మరసం కలపాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకుని పచ్చడిలో వేసి కలిపితే సరి.  


మినప్పప్పుతో...

కావలసినవి: మినప్పప్పు: అరకప్పు, ఎండుమిర్చి: పదిహేను, జీలకర్ర: చెంచా, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, దనియాలు: చెంచా, ఆవాలు: చెంచా, మెంతులు: పావుచెంచా, చిక్కని చింతపండురసం: మూడుటేబుల్‌స్పూన్లు, బెల్లం తరుగు: రెండు చెంచాలు.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఎండుమిర్చి, జీలకర్ర, దనియాలు, ఆవాలు, మెంతులు వేయాలి. రెండు నిమిషాలయ్యాక మినప్పప్పును కూడా వేసి వేయించుకుని తీసుకోవాలి. వేడి చల్లారాక వీటిని మిక్సీలో తీసుకుని తగినంత ఉప్పు, చింతపండురసం, బెల్లం తరుగు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.


నువ్వులతో...

కావలసినవి: నువ్వులు: అరకప్పు, మినప్పప్పు: రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి: ఎనిమిది, తాజా కొబ్బరితురుము: పావుకప్పు, కరివేపాకు రెబ్బలు: రెండు, చింతపండు: ఉసిరికాయంత (నీళ్లల్లో నానబెట్టుకోవాలి), ఉప్పు: తగినంత, నూనె: రెండు చెంచాలు, ఆవాలు: అరచెంచా, మెంతులు: నాలుగైదు గింజలు.  

తయారీ విధానం: స్టౌమీద బాణలిని పెట్టి నువ్వుల్ని వేసి వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో చెంచా నూనె వేసి మినప్పప్పు, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు వేయించిపెట్టుకున్న నువ్వులు, ఎండుమిర్చి తాలింపు, చిక్కని చింతపండు రసం, తగినంత ఉప్పు, కొబ్బరితురుము మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. స్టౌమీద మళ్లీ కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి కరివేపాకు, ఆవాలు వేయించుకుని పచ్చడిలో వేసి కలిపి చాలు.


బచ్చలికూరతో...

కావలసినవి: బచ్చలికూర కట్టలు: మూడు, ఎండుమిర్చి: పదిహేను, పచ్చిమిర్చి: అయిదు, చింతపండు: ఉసిరికాయంత, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, సెనగపప్పు: చెంచా, దనియాలు: చెంచా, మెంతులు: పావుచెంచా, ఉప్పు: తగినంత, నూనె: మూడు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి టేబుల్‌స్పూను నూనె వేసి... ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, దనియాలు, మెంతులు వేసి వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి బచ్చలికూర తరుగు, చింతపండు, పచ్చిమిర్చి వేసి వేయించి స్టౌని సిమ్‌లో పెట్టాలి. బచ్చలికూర బాగా వేగాక దింపేయాలి. ఇప్పుడు ఎండుమిర్చి తాలింపు, బచ్చలికూర వేపుడు, తగినంత ఉప్పు మిక్సీలో వేసుకుని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్‌ చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..