ఓ వైపు దేవతలు.. మరో వైపు రత్నాలు..!

సింగారానికి తగ్గట్టు దేవీదేవుళ్లతో హుందాతనాన్ని తీసుకొచ్చే టెంపుల్‌ జ్యువెలరీనీ కొనేసుకుంటాం... రాళ్లచమక్కుల ట్రెండీ డిజైన్ల నగల్నీ ట్రై చేసేస్తుంటాం... కానీ హారాల దగ్గర్నుంచీ వడ్డాణాల వరకూ అన్నింట్లోనూ ఆ రెండు

Published : 09 Jan 2022 00:14 IST

ఓ వైపు దేవతలు.. మరో వైపు రత్నాలు..!

సింగారానికి తగ్గట్టు దేవీదేవుళ్లతో హుందాతనాన్ని తీసుకొచ్చే టెంపుల్‌ జ్యువెలరీనీ కొనేసుకుంటాం... రాళ్లచమక్కుల ట్రెండీ డిజైన్ల నగల్నీ ట్రై చేసేస్తుంటాం... కానీ హారాల దగ్గర్నుంచీ వడ్డాణాల వరకూ అన్నింట్లోనూ ఆ రెండు రకాల బంగారు నగలూ కొనుక్కోవడమంటే మాటలు కాదుగా... అందుకే మరి ఈ రెండు డిజైన్లూ ఒకే నగలో చేరిపోతూ వచ్చేసిందో నయా జ్యువెలరీ!

అమ్మాయిలకు బంగారు నగలంటే ఎంత ఇష్టముంటే మాత్రం ఫ్యాన్సీ చీర కట్టుకుని సంప్రదాయ ఆభరణాలు వేసుకుంటే ఏం బాగుంటుంది. అందుకే అతివలందరూ అన్నివస్తువులతో పాటూ మ్యాచింగ్‌ ఆభరణాల్నీ అమర్చుకుంటారు. ఆ సంగతి గమనించిన జ్యవెలరీ డిజైనర్లు ఎప్పటికప్పుడు నగల్లో ట్రెండ్స్‌ తీసుకొచ్చేయడం తెలిసిందే. అయితే ఈమధ్య కొత్తదనంతో పాటూ సౌకర్యాన్నీ వెంటబెట్టుకు వచ్చేశారు... ఒకే నగలో రెండు రకాల డిజైన్లతో ఉండే ‘ఫ్లిప్‌, రొటేటబుల్‌ జ్యువెలరీ’తో! 

నిజానికి ‘ఐటమ్‌ ఒకటే, ఉపయోగాలు రెండు’ అన్న అంశం మీద ఎన్నో రకాల వస్తువులూ, దుస్తులూ వస్తుంటాయి కదా. అదే సూత్రం నగల్లోనూ వచ్చేసింది. ఇదివరకే ఇలా రెండు విధాలుగా వేసుకునే రివర్సిబుల్‌ నగలు ఉన్నాయి కానీ వాటిల్లో తేడా ఎక్కువగా రాళ్ల రంగుల్లో మాత్రమే కనిపించేది. ఒకవైపు కెంపులూ, మరో పక్క పచ్చలతో రెండు రకాలుగా తిరగేసి పెట్టుకునేలా నెక్లెసులూ, లాకెట్లూ, దుద్దులూ అందుబాటులో ఉండేవి. ఇప్పుడేమో అందులోనే మరో అడుగు ముందుకేసి రూపొందిస్తున్నారు ఈ రొటేటబుల్‌ నగల్ని. వాటిలాగా తిరగేసి వేసుకునేలా ఉండవివి. చుట్టూ ముత్యాలూ, చూడముచ్చటైన పసిడి నగిషీలూ, చక్కని చెక్కుళ్లతో మొత్తమంతా బిళ్లల అమరికతో ఉంటాయీ హారాలూ, వడ్డాణాలూ. అటూ ఇటూ తిప్పడానికి వీలుగా ఉండే బిళ్లల్లోనే ఉంటుంది వైవిధ్యం అంతా. బిళ్లకు ఒకవైపు లక్ష్మీదేవీ, రామపరివారమూ, దశావతారాల రూపాలూ... ఉంటే ఇంకోవైపు సొంపైన డిజైన్లలో కెంపులూ, పచ్చలూ, వజ్రాలూ, ఎనామిల్‌ చమక్కులూ ఎంతో అందంగా పొదిగి ఉంటాయి. మనకు కావాల్సినట్టు ఆ బిళ్లల్ని తిప్పితే చాలు, నెక్లెస్‌ అంతా ఓ పక్క దేవతామూర్తుల చిత్రాలతో టెంపుల్‌ జ్యువెలరీలా కనిపించేస్తుంది. మరో పక్క మెరుపుల రాళ్లతో ట్రెండీ నగలా మారిపోతుంది. అందుకే ఈ డబుల్‌సైడ్‌ ఆభరణాన్ని డ్రస్సును బట్టి వేసుకోవచ్చు. పైగా పెళ్లీ, రిసెప్షన్‌లాగా వెంటవెంటనే ఏవైనా వేడుకలు ఉంటే చీరలు మార్చినట్టే ఈ ఒక్క హారం, వడ్డాణాన్నీ రెండు విధాలుగా అప్పటికప్పుడు మార్చుకుని తయారైపోవచ్చు. అది చూసిన సన్నిహితులు ఆశ్చర్యపోవడమే కాదు, కితాబులూ ఇస్తారు!


బుజ్జాయిల వంటగది భలే ఉందే!

గతంలో ఆటలంటే... కొందరు పిల్లలు టీచర్లలా మారి బెత్తంతో పాఠాలు చెప్పేవారు. ఇంకొందరు అమ్మలా అభినయిస్తూ ఉత్తుత్తి వంటలు చేసేవారు. క్రమంగా చిన్నారుల ఆటతీరు మారింది. ఎలక్ట్రానిక్‌ బొమ్మలూ, వీడియోగేమ్‌లూ మార్కెట్‌ను ముంచెత్తాయి. కానీ ఇవి పిల్లలకు మంచి చేయవన్న నిపుణుల మాటల వల్లో... ఆ ఆటలు విసుగు పుట్టో తిరిగి సంప్రదాయ క్రీడల వైపు మళ్లుతున్నారందరూ. దాంతో ఆ తరహా ఆట వస్తువులకు డిమాండ్‌ పెరుగుతోంది... అందులో భాగమే ఈ ఇత్తడి మినియేచర్‌ వంట సామగ్రి...!

చిన్నారులకు బొమ్మలంటే ఎంతిష్టమో మాటల్లో చెప్పలేం. అయితే అవి వారి జ్ఞాపకశక్తినీ, కుటుంబ, సామాజిక సంబంధాల్నీ మెరుగుపరచాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఉండటం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఎలక్ట్రానిక్‌ బొమ్మలూ, గ్యాడ్జెట్లే ఆటవిడుపు అవుతున్నాయి. చిన్నా, పెద్దా అందరూ ఈ ఆటల్నే ఆడేస్తున్నారు. ఎక్కడైనా ఒకరిద్దరు తల్లిదండ్రులు ఈ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లూ గేములూ తమ పిల్లలకు వద్దనుకున్నా వెనకటి ఆటలూ ఆటవస్తువులూ అందుబాటులో లేని పరిస్థితి. ఇదంతా చూసిన పిల్లల ప్రేమికులు కొందరు సంప్రదాయ ఆటవస్తువులకు పూర్వవైభవం తేవాలని అనుకున్నారు. పులి-మేక, వామన గుంటలు, అష్టాచెమ్మా వంటి ఆనాటి ఆటలెన్నింటినో పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఇత్తడి వంట సామగ్రి కూడా వాటిలో భాగమే.

ఇంటి వస్తువులనూ, ఫర్నిచర్‌నూ తలపించే విధంగా ఇత్తడితో వంటింటి సామగ్రిని తయారీదారులు రూపొందిస్తుంటే... పిల్లల నుంచీ పెద్దలవరకూ అందరూ వాటిని ఎంచుకోవడంలో ముందుంటున్నారు. చిట్టి చిట్టి గిన్నెలూ, చెంబులూ, కంచాలూ, ఈ సామగ్రినంతా పెట్టుకునేందుకు స్టాండులూ వంటివే కాదు... ట్రంకు పెట్టెలూ, టేబుల్‌ ఫ్యాన్‌లూ, చేతి పంపులూ, భోజనాల బల్లా, మిక్సీ... ఇలా ఒకటేమిటి ఒక ఇంటికి అవసరమైన సామగ్రి అంతా కిట్‌ రూపంలో దొరుకుతోంది. ఒకవేళ అన్నీ వద్దు అనుకుంటే.. కావాల్సినవి మాత్రమే విడిగా కొనుక్కోవచ్చు కూడా. పిల్లలు ఈ బుల్లి కిచెన్‌ సెట్‌తో తమ ఊహలకు రెక్కలు తొడుగుతుంటే, పెద్దలు వీటిని అలంకరణ కోసమూ వాడుతున్నారు. బొమ్మల కొలువుల్లో అందంగా అమర్చడంతో పాటు  కానుకలుగా ఇచ్చేందుకూ మొగ్గు చూపుతున్నారు. ఏమైనా, ఈ బుజ్జి బుజ్జి సామాన్లు భలే ముచ్చటగా ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..