పెన్సిల్‌ బాక్సుకీ లాక్‌

స్కూలుకెళ్లే పిల్లలు తమ పెన్సిల్‌ ఎక్కడో పడిపోయిందనీ, రబ్బరు ఎవరో కొట్టేశారనీ ఇంటికొచ్చి ఫిర్యాదు చేయడం తెలిసిందే. అలాంటి పిల్లలకు ఈసారి ‘నంబర్‌లాక్‌ పెన్సిల్‌ బాక్స్‌’లను కొనిస్తే సరి.

Updated : 19 Jun 2022 05:01 IST

పెన్సిల్‌ బాక్సుకీ లాక్‌

స్కూలుకెళ్లే పిల్లలు తమ పెన్సిల్‌ ఎక్కడో పడిపోయిందనీ, రబ్బరు ఎవరో కొట్టేశారనీ ఇంటికొచ్చి ఫిర్యాదు చేయడం తెలిసిందే. అలాంటి పిల్లలకు ఈసారి ‘నంబర్‌లాక్‌ పెన్సిల్‌ బాక్స్‌’లను కొనిస్తే సరి. సాధారణ పెన్సిల్‌ బాక్సుతో పోలిస్తే... వీటిపైన లేదా అడుగున అంకెలు ఉంటాయి. పిల్లలు తాము రోజూ ఉపయోగించే పెన్సిళ్లూ, పెన్నులూ, రబ్బర్లూ... ఆ బాక్సులో పెట్టుకున్నాక అంకెల్లో నంబర్లను ఎంచుకుని పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటే పెన్సిల్‌ బాక్స్‌కి తాళం పెట్టేసినట్లే. ఆ లాక్‌ని మళ్లీ మీ పిల్లలు తప్ప వేరేవాళ్లు తెరవలేరు. వాళ్లకు సంబంధించిన వస్తువులూ ఎక్కడికి పోవు. రకరకాల ఆకారాల్లో వచ్చేస్తున్న ఈ బాక్సుల్లో మీ చిన్నారులకు నచ్చినదాన్ని కొనిచ్చేయండి మరి.


రబ్బరు నల్లగా మారకుండా...

ఎలాంటి రబ్బరు అయినా సరే... వాడటం మొదలుపెట్టిన కొన్నిరోజులకు నల్లగా మారిపోతుంది. దాంతో పిల్లలు కొత్తది కొనిమ్మంటూ పేచీ పెడుతుంటారు. అలాంటివాళ్లకు కట్టర్‌ తరహాలో ఉన్న ఈ రబ్బరును కొనిచ్చి చూడండి. రబ్బరును ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు దీనిపైన ఉన్న ప్లాస్టిక్‌ బటన్‌లాంటిదాన్ని ముందుకి కొద్దిగా జరిపితే రబ్బరు బయటకు వస్తుంది. అవసరం అయిపోయాక ఆ బటన్‌నే వెనక్కి అంటే రబ్బరు లోపలికి వెళ్లిపోతుంది. చెరిపిన చోట పెన్సిల్‌ నుసిని తుడిచేయడానికి దీని మరో చివర బ్రష్‌ కూడా ఉంటుంది.


బొమ్మల షార్పనర్‌ భలే ఉందే

పెన్సిల్‌ని చెక్కితే కానీ రాయలేం. షార్పనర్‌లో పెన్సిల్‌ని పెట్టి చెక్కడం మొదలుపెడితే ఆ తుక్కు అంతా పుస్తకాలమీద, బల్లమీద పడిపోతుంది. దాన్ని ఏరి చెత్తడబ్బాలో పారేయడం మరో పని. ఇదంతా లేకుండా చేస్తాయి ఈ ‘బొమ్మల షార్పనర్లు . వీటిల్లో పెట్టి పెన్సిల్‌ని తిప్పితే... ఆ తుక్కంతా బొమ్మలోనే ఉండిపోతుంది. ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని పారేయొచ్చు. ఇక, ఎలక్ట్రిక్‌ షార్పనర్‌ అయితే... అందులో పెన్సిల్‌ని పెట్టి అడుగున ఉన్న బటన్‌ని నొక్కితే చాలు... పనైపోయినట్లే. పిల్లలకు నచ్చేలా డోరేమోన్‌, డైనోసార్‌, టెడ్డీ, ట్రక్‌, ట్రైన్‌.. వంటి బొమ్మల రూపాల్లో ఈ షార్పనర్‌లను తయారుచేస్తున్నారు.


క్రెయాన్ల పెన్నులు నచ్చాయా...

బొమ్మలకు రంగులేసే క్రెయాన్లంటే ఇష్టపడని పిల్లలుండరు. నాలుగు తెల్ల కాగితాలనూ, ఆ క్రెయాన్లనూ వాళ్లముందు పెడితే... అదేపనిగా రంగులేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. కానీ రంగులు నింపేకొద్దీ అవి అరిగిపోతుంటాయి లేదా విరిగిపోతుంటాయి. అలాగని వాటిని పక్కన పడేసి... ఏడాదంతా వాళ్లు అడిగినప్పుడల్లా క్రెయాన్ల సెట్‌ కొనివ్వడం అంటే అన్నిసార్లూ కుదరకపోవచ్చు. అందుకే ఈసారి వాళ్లకు పెన్‌పెన్సిల్‌ తరహాలో వస్తున్న ‘పాప్‌-అప్‌ క్రెయాన్లు’ కొనిస్తే సరి. దాదాపు అన్ని రంగుల్లో ఉండే క్రెయాన్లను చిన్నచిన్న ముక్కల్లా చేసి పెన్నులాంటిదాన్లో పెట్టి ఇస్తారు. బొమ్మ వేసుకున్నాక అవసరమైన రంగు ముక్కను మాత్రమే తీసుకుని ముందువైపు ఉన్న పాయింట్‌లో పెట్టుకుంటే పెన్నుతో రాసినట్లుగా రంగును నింపుకోవచ్చు. పనైపోయాక మళ్లీ ఆ ముక్కను వెనక్కి పెట్టి... మరోదాన్ని తీసుకోవచ్చు. దీనివల్ల క్రెయాన్లు పోకుండానూ ఉంటాయి. రంగుల్ని కూడా రుద్దినట్లుగా కాకుండా అందంగా నింపగలుగుతారు. అవసరం అనుకున్నప్పుడు ముక్కల్ని విడిగా తెచ్చుకుంటే సరిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..