డబ్బు... ఇక కనిపించదా!

డబ్బుకి లోకం దాసోహం అన్నారు పెద్దలు. కాదా మరి... కూడూ గుడ్డా నీడా అన్నిటికీ అదే కదా కావాలి. అందుకే ఇరవైనాలుగ్గంటలూ మనిషి ధ్యాస దాని చుట్టూనే తిరుగుతుంటుంది.

Updated : 06 Nov 2022 03:25 IST

డబ్బు... ఇక కనిపించదా!

డబ్బుకి లోకం దాసోహం అన్నారు పెద్దలు. కాదా మరి... కూడూ గుడ్డా నీడా అన్నిటికీ అదే కదా కావాలి. అందుకే ఇరవైనాలుగ్గంటలూ మనిషి ధ్యాస దాని చుట్టూనే తిరుగుతుంటుంది. మరి అలాంటి డబ్బుని మీరు చేత్తో తాకి ఎన్నాళ్లయింది? గుర్తు రావట్లేదు కదూ! నిజమే... జీతం బ్యాంకులో పడుతుంది. బిల్లులన్నీ ఆన్‌లైన్‌లో కట్టేస్తాం. కిరాణా షాపులో, కూరగాయలకి, పాలవాడికి, టైలరుకి, ఆటోకి, ఆఖరికి పనిమనిషికి కూడా ఫోన్‌పేతోనో పేటీఎంతోనో చెల్లించేస్తే... ఇక చేతిలో డబ్బెందుకూ! అందుకే మరి, గత రెండున్నరేళ్లలో ఈ ఆప్‌ల వాడకం ఏకంగా 427 శాతం పెరిగిందట. పాత నాణేల్ని పెట్టినట్లు నేటి మన కరెన్సీని కూడా మ్యూజియంలో పెట్టే రోజు ఎంతో దూరం లేదంటున్నారు నిపుణులు.

బంధువులెవరో ఆస్పత్రిలో ఉన్నారు. బిల్లు కట్టేటప్పుడు పాతిక వేలు తక్కువయ్యాయి. ఖాతాలో డబ్బుంది, సాయం చేయాలన్న మనసూ ఉంది. కానీ డ్రా చేసి తేవడానికి దగ్గర్లో ఉన్న ఒకే ఒక్క ఏటీఎంలో డబ్బులు లేవు. ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేసినా అవతల వాళ్ల అకౌంట్‌లో పడడానికి కనీసం అరగంట పడుతుంది. పైగా పలు వివరాలు నమోదు చేయాలి. చాలామందికి సొంతంగా ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయడమూ చేతనయ్యేదికాదు. పొరపాటు జరిగితే ఎలా అన్న భయం వేధించేది.  
... ఇది కొంత కాలం క్రితం వరకూ పరిస్థితి.
ఫోన్‌పే, జీపే లాంటి ఆప్‌ ఒకటి ఫోన్‌లో ఉంటే ఇప్పుడది సెకన్లలో అయిపోయే పని. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఖాతా నుంచి నేరుగా ఎవరికి కావాలంటే వాళ్ల ఖాతాకి డబ్బు బదిలీ చేయవచ్చు.
బంధుమిత్రులకే కాదు దుకాణాల్లో కొనుగోళ్లు, ఫోను రీఛార్జి, బిల్లుల చెల్లింపులు, ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకుకీ... ఎలాంటి చెల్లింపులైనా సరే క్షణాల్లో చేసేయొచ్చు. అంత తేలిగ్గా ఉంది కాబట్టే ఇప్పుడు పేటీఎం, ఫోన్‌పే, క్యూఆర్‌ కోడ్‌ లాంటి మాటల్ని ఏమీ చదువుకోని వారి నోట కూడా వింటున్నాం... వాళ్లు వాటిని సులభంగా వాడటమూ చూస్తున్నాం. దాంతో కరెన్సీ నోట్లను చేత్తో పట్టుకుని జాగ్రత్తగా లెక్కపెట్టి చెల్లించే దృశ్యం అరుదైపోయింది. ఒక అకౌంట్‌లో నుంచి మరో అకౌంట్‌లోకి వేలికొసల ద్వారా డబ్బు అలవోకగా జారిపోతోంది.
ఒకప్పటి అణాలూ కాణీలూ కాలగర్భంలో కలిసిపోయినట్లే నేటి మన నోట్లు కూడా కనుమరుగవడానికి ఇక ఎంతోకాలం పట్టకపోవచ్చని నిపుణులు అంటున్న నేపథ్యంలో- ఎప్పుడో వేల ఏళ్ల క్రితం సముద్రపు గవ్వల రూపంలో మొదలై కాగితం కరెన్సీ దాకా వచ్చి ఇప్పుడు డిజిటల్‌గానే తప్ప చేతికి అందకుండా పోతున్న కరెన్సీ ప్రస్థానం గురించి తెలుసుకోవడం ఆసక్తికరం.

గవ్వలూ పూసలూ

పెద్దవాళ్ల మాటల్ని ఎప్పుడైనా కాసేపు ఆలకిస్తే ‘గుడ్డి గవ్వకి కొరగాడు, చిల్లు కాణీకి గతిలేని రోజులు, చేతిలో నయాపైసా లేదు...’ లాంటి మాటలు వినిపిస్తాయి. గవ్వ, కాణీ, నయాపైసా... అన్నీ ఒకప్పటి డబ్బులే. గత ఐదువేల సంవత్సరాలుగా డబ్బు ఏదో ఒక రూపంలో మనిషి చరిత్రలో భాగంగా ఉంది. అంతకు ముందు వస్తుమార్పిడి విధానం ఉండేది. ఉత్పత్తి ప్రధానంగా సాగిన నాటి సమాజాల్లో ఎవరికి వారు తాము తయారుచేసింది ఇతరులకు ఇచ్చి తమకు కావలసింది వారి దగ్గర నుంచి పుచ్చుకునేవారు. క్రమంగా సమాజాలతో పాటు అవసరాలూ పెరగడంతో వ్యాపారమూ డబ్బూ ప్రవేశించాయి. మొదట్లో అలా డబ్బులా వాడినవన్నీ ప్రకృతిసిద్ధంగా లభించిన వస్తువులే.
క్రీ.పూ.1200 ప్రాంతంలో హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాల తీరంలో దొరికే గవ్వల్ని డబ్బుగా వాడేవారట. అవి అరుదైనవీ విలువైనవీ అని కాదు. ఒకే సైజులో దొరికేవి. వాడడానికి అనుకూలంగా ఉండేవి. అందుకని వాటిని ఒక ప్రమాణంగా భావించి వ్యాపారం చేసేవారు. ఆ గవ్వ పగలడమో రంధ్రం పడడమో లాంటిది జరిగితే దాని విలువ తగ్గేది. అలాంటి వాటిని ‘గుడ్డి గవ్వలు’ అనేవారు. వ్యాపారం కోసం యూరప్‌ దేశాలు కూడా వాటిని అంగీకరించేవి. క్రమంగా ఒక్కో ప్రాంతమూ తమకు అనువైన వస్తువుని కరెన్సీగా మలచుకోవడం మొదలెట్టింది. పూసలూ తిమింగలం దంతాలూ ఎముకలూ సున్నపు రాయితో తయారుచేసిన ప్లేట్లూ... డబ్బుగా ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి.

బంగారం వెండీ...

కరెన్సీ ప్రస్థానంలో మొదటి మైలురాయి నాణేల తయారీ. వాటిని ఒక క్రమ పద్ధతిలో తయారుచేసి ఉపయోగించిన తొలి సందర్భం క్రీ.పూ. ఏడో శతాబ్దంలో లిదియా(ప్రస్తుత టర్కీ)లో చోటుచేసుకుంది. బంగారం వెండీ కలిపి చిక్కుడు గింజల్లా తయారుచేసి వాటి మీద తమ రాజముద్ర అయిన సింహం బొమ్మను ముద్రించాడు నాటి రాజు. ఆ తర్వాత వెండీ బంగారు నాణేలను వాటి విలువలో తేడా ఉండేలా విడి విడిగా చేయడం మొదలెట్టారు. ఇది చూసి మిగతా దేశాలూ లోహాలతో నాణేల తయారీ ప్రారంభించాయి. చైనా మొదట రాగి, ఇత్తడి నాణేలను తయారుచేసింది. మరో శతాబ్దం తిరిగేసరికి రోమ్‌లో లెదర్‌ కూడా డబ్బు రూపం సంతరించుకుంది. ఫ్రాన్స్‌, రష్యా లాంటి దేశాలూ లెదర్‌ని డబ్బుగా ఉపయోగించగా చైనాని పాలించిన ఉడి అనే రాజు ప్రత్యేకంగా జింకల్ని పెంచి వాటి చర్మంతో నాణేలను చక్కని నగిషీలతో చెక్కించేవాడట.
దేంతో తయారైనా నాణేలు బరువుగా ఉండేవి, పెద్ద మొత్తంలో కావాలంటే సంచులతో మోసుకెళ్లాల్సి వచ్చేది. ఆ అసౌకర్యాన్ని అధిగమించడానికి కాగితాన్ని కరెన్సీగా ప్రవేశపెట్టింది చైనా. ఎనిమిదో శతాబ్దంలోనే అక్కడ మల్బరీ చెట్టు బెరడుతో కరెన్సీ నోట్లను తయారుచేసినా ఇతర దేశాలన్నీ ఈ విధానాన్ని అందిపుచ్చుకోడానికి చాలా సమయమే పట్టింది. క్రమంగా పలుచని పేపరుతో తయారైన కరెన్సీ వాడడానికి సులభంగా ఉండడంతో అంతర్జాతీయ వాణిజ్యానికి వెసులుబాటు కలిగింది. అయితే, ఈ పేపరు కరెన్సీ నోటుకి ఇప్పటిలా కచ్చితమైన విలువ ఉండేది కాదు. దానికి బదులుగా ‘ఇంత మొత్తంలో బంగారం లేదా వెండి చెల్లించగలన’న్న హామీ పత్రం ఉండేది. ఈ విధానమే నిదానంగా అభివృద్ధి చెందుతూ బ్యాంకుల ఏర్పాటుకు దారితీసిందంటారు పరిశోధకులు.
కాగితపు కరెన్సీ పూర్తిగా వాడుకలోకి వచ్చాక కొన్ని దేశాలు లెక్కా పద్ధతీ లేకుండా ఇష్టం వచ్చినట్లు ముద్రించి వదిలేయడంతో ధరలు విపరీతంగా పెరిగిపోయి ఆయా కరెన్సీలకు విలువ లేకుండా పోయేది. దేశ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలేవి. అది గమనించిన ఇంగ్లండ్‌ 1821లో కరెన్సీ ముద్రణకి బంగారాన్ని ప్రామాణికంగా వాడడం మొదలెట్టింది. అన్ని దేశాలూ దాన్ని అనుసరించినా వందేళ్లు తిరిగేసరికి బంగారం విలువ పడిపోవడంతో ఆ విధానం ముగిసింది. అయితే అప్పటికే చాలా దేశాలు స్వతంత్రం కావడం, బ్యాంకులను నెలకొల్పి తమదైన ఆర్థిక విధానాలను రూపొందించుకోవడం, అంతర్జాతీయ వ్యాపారం ఊపందుకోవడం, సాంకేతిక ప్రగతి... అన్నీ కలిసి కరెన్సీ ప్రస్థానాన్ని మరో కొత్త మలుపు తిప్పాయి.
వందేళ్ల క్రితమే ప్లాస్టిక్‌ మనీ పేరుతో క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వాడకం మొదలైనా అవి ఆదరణ పొందడానికి కాస్త టైమ్‌ పట్టింది. విదేశాల్లో ఎక్కువగా వినియోగంలో ఉన్న క్రెడిట్‌ కార్డులు మన దేశంలో అంతగా ప్రజల్లోకి వెళ్లలేదు. జారీలో బ్యాంకులు తీసుకుంటున్న అధిక జాగ్రత్తలూ, కార్డుల నియమాలూ అన్నీ కలిసి వాటిని కొంత శాతానికే పరిమితం చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన యూపీఐ- చెల్లింపుల రంగంలో పెద్ద సంచలనాన్నే సృష్టించింది.

సులువూ సురక్షితం

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి భారతీయ బ్యాంకులన్నీ కలిసి ఏర్పాటుచేసుకున్న విధానం ఇది. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ)ని 2016లో ప్రారంభించింది భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌. దీని కోసం ప్రత్యేకంగా నేషనల్‌ పేమెంట్స్‌
కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటుచేసింది. యూపీఐ అమల్లోకి వచ్చిన మొదటి ఏడాది దానికి లభించిన ఆదరణ అంతంత మాత్రమే. కార్డు పేమెంట్లు 36 శాతం ఉంటే యూపీఐ 6 శాతం ఉండేది. అయిదేళ్లు తిరిగేసరికల్లా- అంటే 2021 నాటికి, యూపీఐ వాటా 63 శాతానికి పెరగ్గా, కార్డు చెల్లింపులు 9 శాతానికి పడిపోయాయి. వినియోగదారుకీ బ్యాంకుకీ మధ్య మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా వినియోగదారుడే నేరుగా తన ఖాతాలో నుంచి దుకాణదారు ఖాతాలోకి డబ్బుల్ని పంపించే ఈ ఏర్పాటు ఎంతో వెసులుబాటుగా ఉండడంతో అతి తక్కువ సమయంలో బహుళ ప్రజాదరణ పొందింది.
యూపీఐని ఒక ప్లాట్‌ఫామ్‌గా చూస్తే ఇది నమోదు చేసినంత వృద్ధి ఇప్పటివరకూ మరో ఆర్థిక సంస్థ ఏదీ నమోదుచేయలేదు. ప్రారంభించిన మూడేళ్లకల్లా 10 కోట్ల వినియోగదారులు చేరారు. వందకోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. ఆ పెరుగుదల ఏటికేడాదీ కొనసాగుతూ గత రెండున్నర ఏళ్లలో ఏకంగా 427 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం డిజిటల్‌ చెల్లింపుల్లో 96 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయట. ఇంటర్నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు రూ.200లోపు పేమెంట్ల కోసం ఇటీవలే ‘యూపీఐ లైట్‌’ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల మరింత మారుమూల ప్రాంతాలకూ యూపీఐ చొచ్చుకుపోయే అవకాశం ఉంది.
దేశంలోనే కాదు, ఇప్పుడు ఈ విధానం ఇతర దేశాల్లోనూ అందుబాటులో ఉంది. విదేశాలకు వెళ్లినప్పుడు డబ్బు తీసుకెళ్లడమూ, దాన్ని ఆయా దేశాల కరెన్సీలోకి మార్చుకోవడమూ.. ఈ గొడవేదీ ఉండదిక. దేశీయంగా యూపీఐ లావాదేవీలను పర్యవేక్షిస్తున్న ఎన్‌పీసీఐ విదేశాల కోసం ‘ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌’ పేరుతో మరో సంస్థని ప్రారంభించింది. ఈ సంస్థ ఆయా దేశాలతో చర్చలు జరిపి, ఒప్పందాలు చేసుకుంటుంది. తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను వాళ్లకు అందిస్తుంది. పొరుగు దేశాలైన నేపాల్‌, భూటాన్‌లే కాకుండా యూరప్‌, అరబ్‌దేశాలు, సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌, ఫిలిప్పీన్స్‌, వియత్నాం, హాంకాంగ్‌, దక్షిణకొరియా తదితర దేశాలన్నీ యూపీఐని ఆమోదిస్తున్నాయి. నగదుతో పనిలేకుండా ఈ దేశాల్లో ఫోన్‌ చెల్లింపులు చేస్తూ హాయిగా తిరిగిరావచ్చు.
విదేశీ మార్కెట్లు ఎప్పటినుంచో డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అయితే అక్కడ కేవలం వినియోగదారులూ దుకాణదారుల మధ్య లావాదేవీలకే ఇది పరిమితమైంది. యూపీఐలో దాంతో పాటు వ్యక్తుల మధ్య లావాదేవీలకీ, వివిధ ఆప్స్‌తో అనుసంధానించి వాడడానికీ వెసులుబాటు ఉంది. దేశంలో యూపీఐ ఆప్‌లలో రెండో స్థానంలో ఉన్న గూగుల్‌పే యాజమాన్యానికి ఇది ఎంతగా నచ్చిందంటే ఇలాంటిదే అమెరికాలోనూ తయారుచేస్తే బాగుంటుందని సిఫార్సు చేసిందట.

లాభాలెన్నో..!

యూపీఐ విధానం ఇంతగా ప్రజాదరణ పొందడానికి చాలానే కారణాలు ఉన్నాయి. చదువుతో సంబంధం లేకుండా స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నవారు ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. బ్యాంకు ఖాతా, దానికి ఫోన్‌ నంబర్‌ అనుసంధానించి ఉంటే చాలు, యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. దీనివల్ల రియల్‌ టైమ్‌ నగదు బదిలీ... అంటే కేవలం కొద్ది సెకన్లలోనే ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకి రోజుకి లక్ష రూపాయల దాకా నేరుగా డబ్బు బదిలీ చేయవచ్చు. ఇంత వేగంగా, సులువుగా, సురక్షితంగా చేసే మార్గం మరొకటేదీ లేదు.
* చేతిలో నగదు లేదనో మరొకటో కారణం చెప్పి చెల్లింపులు వాయిదా వేసే అవకాశం లేదు. ఏటీఎంకి వెళ్లనక్కర లేదు. 24 గంటలూ, 365 రోజులూ పనిచేస్తుంది.
* ఎన్ని బ్యాంకు ఖాతాలతోనైనా పనిచేయవచ్చు. కార్డు నంబరూ అకౌంటు నంబరూ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ లాంటి అదనపు వివరాలేవీ అడగదు.
* అన్ని రకాల బిల్లుల్నీ కట్టేయవచ్చు.
* బిల్లుల్ని పంచుకోవచ్చు. నలుగురు ఫ్రెండ్స్‌ కలిసి హోటల్‌కి వెళ్లినప్పుడు ఆ బిల్లు ఒకరికే భారం కాకుండా నలుగురూ సమంగా పంచుకోవచ్చు. మిగిలిన ముగ్గురూ తమ వంతు డబ్బుని అప్పటికప్పుడు స్నేహితుడి అకౌంట్‌కి యూపీఐ ద్వారా బదిలీ చేస్తే అతడు హోటల్‌కి చెల్లించేస్తాడు. ఇది అంతా నిమిషంలోనే అయిపోతుంది. జేబులో తగినంత నగదు ఉందో లేదోనని లెక్కలు వేసుకుంటూ సమయం వృథా చేయనక్కర్లేదు.
* క్రెడిట్‌, డెబిట్‌ కార్డులకు ఉన్నట్లు ఇంత శాతమని వ్యాపారస్తులకు అదనపు ఛార్జీలు(మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌) ఉండవు.  
* వినియోగదారుల క్రెడిట్‌ హిస్టరీతో సంబంధం లేదు.
* లావాదేవీలన్నీ రికార్డవుతాయి కాబట్టి అవినీతిని తగ్గించడానికి దీన్నీ ఒక మార్గంగా భావిస్తున్నారు. ఇన్ని వెసులుబాట్లు ఉన్నాయి కాబట్టే డిజిటల్‌ చెల్లింపుల్లో 96 శాతం వాటాని యూపీఐ ఆక్రమించేసింది.
దాంతో దుకాణదారుల గల్లాపెట్టెల్లో చిల్లర శ్రీ మహాలక్ష్మి గలగలలూ వినియోగదారులు లెక్కపెట్టే నోట్ల రెపరెపలూ వినిపించడం మానేశాయి. ఒకటో తారీఖున జేబు బరువుగా ఉండడమన్నదీ నిన్నటి మాటే. చేతిలో ఫోను ఉంటే చాలు, పర్సుతో పనే లేకపోవడం నేటి ట్రెండ్‌ మరి.


తగ్గిన చాక్లెట్‌ వ్యాపారం

గత రెండేళ్లుగా నెస్లె, పార్లె లాంటి చాక్లెట్‌ బ్రాండ్స్‌కి చెందిన టాఫీల అమ్మకాలు బాగా పడిపోయాయి. పెరగడమే తప్ప తగ్గడం ఎరుగని చాక్లెట్ల పరిశ్రమకి ఈ ఎదురుదెబ్బ ఎలా తగిలిందీ అని విశ్లేషించిన నిపుణులకు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. కరోనా వల్ల కొంతా, యూపీఐ వాడకం పెరగడం వల్ల ఇంకాస్త... ఈ పరిశ్రమకు నష్టం కలిగించాయట. కరోనా సమయంలో తాకకుండా చెల్లింపులు జరపాలి కాబట్టి ఆన్‌లైన్‌కి మళ్లారు చాలామంది. ఆ తర్వాత యూపీఐ వాడకం విపరీతంగా పెరిగింది. బిల్లు ఎంత అయితే అంతే కచ్చితంగా ఫోను ద్వారా చెల్లించేయడం వల్ల చిల్లర సమస్య ఉండడం లేదు. చిల్లరకీ, చాక్లెట్లకీ సంబంధం ఏమిటీ అంటారా? కిరాణా, మెడికల్‌, పాన్‌... ఏ షాపులోనైనా కావలసిన వస్తువులు కొనుక్కుని డబ్బు చెల్లించాక ‘చిల్లర లేదు’ అంటూ నాలుగు చాక్లెట్లో టాఫీలో చేతిలో పెట్టేవాడు దుకాణదారు. ఒక్కో వినియోగదారుకీ నాలుగు రూపాయలు చొప్పున రోజుకు ఓ వంద మందికి చిల్లర బదులు చాక్లెట్లు ఇచ్చినా 400 రూపాయల చాక్లెట్లు అమ్మినట్లే కదా. ఈ లెక్కన దేశవ్యాప్తంగా చిల్లర పేరుతో ఎన్ని చాక్లెట్లు అమ్ముడుపోయినట్లు..! ఇప్పుడా అవకాశం లేదు మరి!


ఫోన్‌ పే...ఫస్ట్‌!

యూపీఐ విధానాన్ని మనదేశంలో ప్రవేశపెట్టి దాదాపు ఆరేళ్లవుతోంది. దేశీయ ఆప్స్‌తో పాటు గూగుల్‌, ఆమెజాన్‌లాంటి బహుళజాతి సంస్థలూ పేమెంట్‌ ఆప్స్‌ని తెచ్చాయి. అన్నీ వాడుకలో ఉన్నప్పటికీ 46 శాతంతో ఫోన్‌పే దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో జీపే(గూగుల్‌ పే-34శాతం) ఉంది. పేటీఎం వాటా 14 శాతం. బ్యాంకులూ ఇతర సంస్థల ఆప్స్‌ కలిసి ఆరు శాతం కాగా అమెజాన్‌ పే ఇప్పుడిప్పుడే ఉనికిని చాటుకుంటోంది.


మనీ... మనీ..!

డబ్బు ఎంత అవసరమో దాని విషయాలు అంత ఆసక్తికరం కూడా.
* నాణేలూ నోట్లను సేకరించడం(న్యూమిస్‌మాటిక్స్‌) ప్రపంచంలో అన్నిటికన్నా పురాతనమైన హాబీ. పాత నాణేలనూ, ప్రత్యేక సందర్భాల్లో ముద్రించినవాటినీ, ముద్రణ లోపాలతో బయటకు వచ్చిన కరెన్సీ నోట్లనూ సేకర్తలు ఎంత డబ్బయినా వెచ్చించి కొంటుంటారు. 1885లో బ్రిటిష్‌ పాలకులు క్వీన్‌ విక్టోరియా బొమ్మతో ముద్రించిన అరుదైన రూపాయి నాణేన్ని ఒకదాన్ని ఇటీవల ఆన్‌లైన్‌ వేలంలో ఒకరు ఏకంగా పదికోట్ల రూపాయలు చెల్లించి కొనుక్కున్నారు.
* అన్ని దేశాలకీ వాటి వాటి కరెన్సీ ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య వాణిజ్యానికి ఎక్కువగా ఉపయోగించేది అమెరికా డాలర్‌నే.
* మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1947-50 మధ్య ముద్రించిన నాణేలను ఫ్రోజెన్‌ సిరీస్‌ అంటారు.
1950 ఆగస్టు 15న రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా తరఫున మొదటిసారిగా అణా సిరీస్‌ నాణేలను అశోక స్తూపంతో ముద్రించి విడుదల చేశారు.
* కరెన్సీ చరిత్రను తెలియజేసే మానిటరీ మ్యూజియంని ఆర్‌బీఐ ముంబయిలో ఏర్పాటుచేసింది. సింధు నాగరికత కాలం నుంచీ నేటి వరకూ కరెన్సీ మారుతూ వచ్చిన విధానాన్ని ఇక్కడ చూడవచ్చు.
* రూపాయి నాణెం తయారీకి అయ్యే ఖర్చు రూపాయి కన్నా ఎక్కువే. రూపాయి మీద మరో పదకొండు పైసలు ఖర్చు అవుతుందట. మిగతా నాణేలకు అలా కాదు.
* యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌కి చెందిన ఓ రసాయనశాస్త్రవేత్త వేర్వేరు నగరాల నుంచి వాడుకలో ఉన్న కరెన్సీ నోట్లను సేకరించి పరీక్షించాడు. వాటిల్లో దాదాపు 90 శాతం నోట్ల మీద మాదక ద్రవ్యాల ఆనవాళ్లు ఉన్నాయట.
* మన దేశంలో గరిష్ఠ విలువ గల నోటు 1938లో ముద్రించిన రూ.10,000. దాన్ని 1946లో రద్దు చేసి తిరిగి 1954లో తెచ్చారు. మళ్లీ 1978లో రద్దు చేశారు.
* పలు దేశాల కరెన్సీ మీద ఎక్కువగా ముద్రించిన చిత్రం- క్వీన్‌ ఎలిజబెత్‌ది.
* వాడుకలో ఉన్న అత్యంత పురాతన నాణెం- ఇంగ్లండ్‌కి చెందిన పౌండ్‌ స్టెర్లింగ్‌. 18వ శతాబ్దంనుంచీ అది వాడుకలో ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు