జావ... ఎన్నెన్నో రుచుల్లో...

వేసవిలో చల్లదనానికి జావ తాగడం తెలుసు...  ఒకప్పుడది నిరుపేదల ఆహారమనీ తెలుసు... కానీ పోషకాలు పుష్కలంగా ఉండే పౌష్టికాహారమని మాత్రం నిన్న మొన్నటివరకూ కొందరికే తెలుసు.  అయితే, ఇప్పుడు బరువు తగ్గాలన్నా, పోషకాలేమిని అధిగమించాలన్నా, అనారోగ్య సమస్యలు దరిచేరకూడదనుకున్నా... అంబలినే ఆశ్రయిస్తున్నారంతా. దానికి తగ్గట్లే..

Updated : 06 Nov 2022 05:06 IST

జావ... ఎన్నెన్నో రుచుల్లో...

వేసవిలో చల్లదనానికి జావ తాగడం తెలుసు...  ఒకప్పుడది నిరుపేదల ఆహారమనీ తెలుసు... కానీ పోషకాలు పుష్కలంగా ఉండే పౌష్టికాహారమని మాత్రం నిన్న మొన్నటివరకూ కొందరికే తెలుసు.  అయితే, ఇప్పుడు బరువు తగ్గాలన్నా, పోషకాలేమిని అధిగమించాలన్నా, అనారోగ్య సమస్యలు దరిచేరకూడదనుకున్నా... అంబలినే ఆశ్రయిస్తున్నారంతా. దానికి తగ్గట్లే...  రాతియుగం కాలం నాటి ఈ సంప్రదాయ వంటకాన్ని పెద్దగా శ్రమ పడకుండానే రెడీమేడ్‌గా తినేలా సిద్ధం చేశారు తయారీ దారులు. ఎన్నో ఫ్లేవర్లూ, మరెన్నో రకాల పోరిడ్జ్‌ల తయారీతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. అదెలాగో తెలుసుకుందామా!

జావ, అంబలి, పోరిడ్జ్‌...ఏ పేరుతో పిలిచినా అది సూపర్‌ఫుడ్డే. అందుకే ఈ సంప్రదాయ ఆహారం వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా రెడీటూకుక్‌, రెడీటూఈట్‌ అంటూ... నయా రూపాల్లో దొరుకుతోంది ఇప్పుడు. ఇదివరకటిలా జావ తాగమంటే మొహం అదోలా పెట్టాల్సిన అవసరం ఇక లేదు.... ఎందుకంటే ఇప్పుడిది పండ్లూ, కూరగాయల నుంచి చాక్లెట్లూ మసాలాల దాకా ఎన్నో రకాల్లో దొరుకుతోంది.

పోషకాలెన్నో...
సగ్గు జావ, రాగి జావ, గోధుమ జావ, బార్లీ జావ, నూకల జావ... పేరు ఏదైతేనే  కార్బొహైడ్రేట్స్‌, ప్రొటీన్స్‌, మినరల్స్‌, విటమిన్స్‌, ఐరన్‌, ఫైబర్‌, అయోడిన్‌ వంటి పోషకాలన్నీ వీటిల్లో పుష్కలంగా దొరుకుతాయి. ఈ అంబలి తాగే అలవాటు మనదేశంలో మాత్రమే కాదు... చైనా, వియత్నాం, థాయిలాండ్‌ వంటి ఇతర ఆసియా దేశాల్లోనూ, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లోనూ కూడా ఎక్కువే. రాతి యుగం నుంచే ఈ పోరిడ్జ్‌ తాగినట్లు చారిత్రక ఆధారాలూ చెబుతున్నాయి. అయితే, జావ తయారీలో బియ్యం సువాసన, రుచీ దేశాన్ని బట్టి మారతాయి. చైనాలో దీన్ని కాంగీ అనీ, జపాన్‌లో ఒకే, కొరియాలో జుక్‌, థాయ్‌లాండ్‌లో జోక్‌ అనీ పిలుస్తారు. ఒక్కటే తేడా... మన దగ్గర బియ్యం, తృణధాన్యాలూ, పప్పుధాన్యాలతో జావలు తయారు చేస్తే... ఐరోపా, రష్యాల్లో బార్లీని ఉపయోగిస్తారు. స్కాట్లాండ్‌లో ఓట్స్‌తో చేసిన పోరిడ్జ్‌ పాపులర్‌.చాలా దేశాల్లో ఓట్స్‌, బార్లీ వంటివాటిని పాలల్లో ఉడకబెట్టి జావ తయారు చేస్తారు. ఈ మిశ్రమానికి చక్కెర, పండ్లు, సిరప్‌, ఉప్పు, తేనె, వెన్న, క్రీమ్‌ వంటివి కలిపి తింటారు.

ఎన్నో రకాలు...
మనదగ్గర ఒకప్పుడు బలవర్థకమైన ఆహారంగా భావించిన అంబలి కాలక్రమేణా నిరుపేదల ఆహారంగా మారింది. క్రమంగా అన్ని వర్గాల ఆహారపుటలవాట్లలోనూ మార్పులు వచ్చి దీన్ని తాగేవారి సంఖ్య తగ్గిపోయింది. ఈలోగా కాలచక్రం గిర్రున తిరిగి జావకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చిపెట్టింది. కారణం... ఆధునిక జీవనశైలి తెచ్చిన ఆహారపుటలవాట్లూ, వాటి వల్ల ముసురుకుంటున్న అనారోగ్యాలకు చెక్‌ చెప్పాలని... జావకి జై కొడుతున్నారు. కానీ ప్రతిసారీ తమకు కావాలసిన ధాన్యాలూ, పప్పులతో రవ్వ తయారు చేసుకోవడం, జావ కాచుకోవడం వంటివన్నీ సమయం, శ్రమా తీసుకుంటాయి. కాలంతో సమానంగా పరుగులుపెట్టే ఈతరానికి ఇదంతా కాస్త కష్టమైన విషయం. ఈ విషయాన్నే గుర్తించారేమో తయారీదారులు - వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా రెడీమేడ్‌ జావ ప్యాకెట్లను మార్కెట్లోకి దింపేశారు. కాళ్ల నొప్పులను తగ్గించే క్యాల్షియం రిచ్‌ పోరిడ్జ్‌, రక్తహీనతకు చెక్‌పెట్టే ఐరన్‌ రిచ్‌ పోరిడ్జ్‌, పిల్లలకో రకం, పెద్దలకు ఇంకోరకం... అంటూ ఎన్నెన్నో రకాల్ని తెచ్చేశారు. వివిధ రకాల బియ్యం, తృణధాన్యాలూ, చిరుధాన్యాలూ, పప్పులూ వంటివి తగు మోతాదుల్లో కలిపి తయారు చేసిన రెడీ టూ కుక్‌ రకాలూ, రెడీ టూ ఈట్‌ వెరైటీలెన్నో వచ్చేశాయి. సుగంధ ద్రవ్యాలూ, కొబ్బరిపాలూ, మసాలా, చాక్లెట్‌, వెన్న, ఖర్జూరం... ఇలా జనం మెచ్చే రుచులెన్నింటిలోనో జావ దొరుకుతుందిప్పుడు. పొద్దున్నే టిఫిన్‌ చేసే తీరిక లేనివాళ్లు...ఎంచక్కా దీన్ని తీసుకోవచ్చు. ఒకేరకమైన అల్పాహారాలతో ఇబ్బందిపడే చిన్నారులకు పోషకాల జావను తినిపించేయొచ్చు. పైగా గ్లూటెన్‌ రహిత ఆహారం కావడంతో ఆరోగ్యస్పృహ ఉన్నవారూ, బరువు అదుపులో ఉంచుకోవాలనుకున్నవారూ ఈ పోరిడ్జ్‌ తినేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. అంబలి ఆరునెలల పిల్లల నుంచి ఎనభైఏళ్ల ముదుసలి వరకూ అందరూ తినగలిగే ఆహారం కావడంతో ఈ నయా ప్యాక్‌లు అందరి మనసులూ దోచుకుంటున్నాయి. మంచి ఆలోచన కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..