ప్రేమంటే ఏమిటంటే...

ప్రేమలో మునిగితేలి... దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు ఈ సెలెబ్రిటీలు. పెళ్లయ్యాక తొలి ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్న వీళ్లు ప్రేమ గురించి ఏం చెబుతున్నారంటే...

Updated : 12 Feb 2023 11:14 IST

ప్రేమంటే ఏమిటంటే...

ప్రేమలో మునిగితేలి... దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు ఈ సెలెబ్రిటీలు. పెళ్లయ్యాక తొలి ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్న వీళ్లు ప్రేమ గురించి ఏం చెబుతున్నారంటే...


ఈ ఫీల్‌ బాగుంటుంది
- ఆలియా భట్‌

కొందరి మీద ఎందుకు ప్రేమ పుడుతుందో తెలియదు. రణ్‌బీర్‌ విషయంలో అదే జరిగింది. ‘బర్ఫీ’ సినిమా చూశాక నేను తొలిచూపులోనే తనతో పీకల్లోతు ప్రేమలో పడిపోయా. అలాగని ప్రపోజ్‌ చేయలేదు. రణ్‌బీర్‌కి అభిమానిగా నేనెంతగానో తనని ఆరాధిస్తానని తెలుసు. మనసులో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నా ఎప్పడూ మనసు విప్పి మాట్లాడుకోలేదు. ఈ ఫీల్‌ని ఇద్దరం చాలా చాలా ఎంజాయ్‌ చేశాం. చివరికి రణ్‌బీర్‌ పెళ్లి చేసుకుందామని అడిగి మా మధ్య మూగ ప్రేమను భగ్నం చేశాడు. ఈ ప్రపోజల్‌ను చాలా సర్‌ప్రైజింగ్‌గా ప్లాన్‌ చేసి, దాన్ని నాకో మధురమైన జ్ఞాపకంగా మార్చాడు.


అదే మ్యాజిక్

- నయన తార

ప్రేమ గురించి మాటల్లో ఎంత చెప్పినా తక్కువే. విఘ్నేశ్‌ శివన్‌ని మొదటిసారి ‘నేను రౌడీనే’ షూటింగ్‌లో కలిశా. అప్పుడే తను నాకు సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనిపించాడు. అదేనేమో లవ్‌లో ఉన్న మ్యాజిక్‌. మా ఇద్దరి ఆలోచనలూ, అభిరుచులూ ఒకటే. మా దగ్గర ఏం ఉన్నా లేకపోయినా ఒకరి మీద ఒకరికున్న ప్రేమతోనే బతికేయొచ్చు అనిపిస్తుంది. ప్రేమలోని గొప్పతనం అదే కదా.


అప్పుడే బంధానికి బలం
- ఆది పినిశెట్టి

స్వార్థం లేనిదే స్వచ్ఛమైన ప్రేమ అని నా నమ్మకం. పెళ్లికి ముందు నా భార్య నిక్కీ గల్రానీతో కలిసి చాలా సినిమాల్లో నటించా. తనే మొదట ప్రపోజ్‌ చేసినా నేను చాలా ఆలోచించా. ప్రేమ అంటే కేవలం ఇద్దరు ప్రేమించుకుంటే సరిపోతుంది. అది కలకాలం నిలవాలంటే మాత్రం వాళ్లిద్దరూ తమ రెండు కుటుంబాల్నీ ప్రేమించగలగాలి. అప్పుడే ఆ బంధం మరింత దృఢపడుతుందని నా నమ్మకం. నేను ఎలా ఉన్నా నిక్కీ మాత్రం ఇంటినీ, ఇంట్లో వాళ్లనీ చాలా బాగా చూసుకుంటుంది.


అర్థం చేసుకోవాలి
- హన్సిక

చాలామందికి తన జీవిత భాగస్వామే బెస్ట్‌ ఫ్రెండ్‌ అవుతాడు. నాకు మాత్రం నా బెస్ట్‌ ఫ్రెండే లైఫ్‌ పార్టనర్‌ అయ్యాడు. పైగా తను నా వ్యాపారంలోనూ భాగస్వామే. నా దృష్టిలో ప్రేమంటే కేవలం మనసులూ అభిరుచులూ కలవడం మాత్రమే కాదు. అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. సోహెల్‌ కూడా అంతే... నన్ను నాకంటే ఎక్కువ అర్థం చేసుకున్నాడు. అందుకే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా మేం ఒక్కటయ్యాం. బంధాన్ని పదిలం చేసుకున్నాం.


మర్యాదా ముఖ్యమే
- నాగశౌర్య

ప్రేమించిన అమ్మాయికి స్వేచ్ఛనివ్వాలి. తనకీ పర్సనల్‌ స్పేస్‌ ఉండాలి. ఇష్టపడ్డాను కదా అని ఎప్పుడూ మనతోనే ఉండాలి అనుకోకూడదు. ఏ విషయంలోనూ అతి పనికి రాదు. మర్యాద ఇవ్వాలి. దేవుడిపై మనకు ఎప్పుడూ ఒకేలాంటి భక్తి ఉంటుంది. అలానే మనతో ఏడు అడుగులు వేసే మనిషిపై ప్రేమ కూడా ఎప్పుడూ అలానే ఉండాలి. అనూషకి నేనిచ్చే ప్రాధాన్యం అలాంటిదే.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..