శాకాహారుల కోసం.. ల్యాబ్‌లో.. గుడ్లూ చికెనూ చేపలూ!

భారతీయులకు శాకాహార ప్రియులన్న పేరుంది. అవడానికి డెబ్భైశాతం మాంసాహారులే అయినా వారిలో చాలామంది వారానికోసారే మాంసాహారం తీసుకుంటారు. దాంతో గణాంకాల ప్రకారం చూస్తే శాకాహారానిదే పైచేయి. ఈ అలవాటు ఇప్పుడు విదేశాలకూ పాకింది. గత మూడేళ్లలోనే అమెరికా, బ్రిటన్‌లలో మాంసాహారం తీసుకునేవారి సంఖ్య 17శాతం దాకా తగ్గిందట.

Updated : 10 Apr 2022 03:00 IST

శాకాహారుల కోసం.. ల్యాబ్‌లో.. గుడ్లూ చికెనూ చేపలూ!

భారతీయులకు శాకాహార ప్రియులన్న పేరుంది. అవడానికి డెబ్భైశాతం మాంసాహారులే అయినా వారిలో చాలామంది వారానికోసారే మాంసాహారం తీసుకుంటారు. దాంతో గణాంకాల ప్రకారం చూస్తే శాకాహారానిదే పైచేయి. ఈ అలవాటు ఇప్పుడు విదేశాలకూ పాకింది. గత మూడేళ్లలోనే అమెరికా, బ్రిటన్‌లలో మాంసాహారం తీసుకునేవారి సంఖ్య 17శాతం దాకా తగ్గిందట. మెక్సికో, కెనడా, బ్రెజిల్‌, డెన్మార్క్‌, జర్మనీ, జపాన్‌ తదితర దేశాలన్నిట్లోనూ శాకాహారులు-  అందులోనూ వీగన్ల జనాభా క్రమంగా పెరుగుతోంది. 2019లో కేవలం పదివేల కోట్లు ఉన్న ‘శాకాహార ప్రొటీన్‌ తయారీ’ పరిశ్రమ 2027కల్లా ఆరు లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఇది నిలకడగా పెరగడం- భవిష్యత్తులో అన్ని రంగాల్లో ‘వీగన్‌’ విధానం ప్రధాన పాత్ర పోషించబోతోందనడానికి నిదర్శనం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. సరికొత్త వీగన్‌ ఆవిష్కరణలతో అలరిస్తున్నాయి.

పదేళ్ల క్రితం ఎవరైనా ‘నేను వీగన్‌ని... పాలూ గుడ్డూ కూడా తాకని సంపూర్ణ శాకాహారిని’ అంటే వారిని ఆశ్చర్యంగా చూసేవారు. ఇప్పుడో... పార్టీలూ, రెస్టరెంట్లూ, ఫుడ్‌ డెలివరీ ఆప్‌లూ... అన్నిట్లోనూ వారికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటున్నాయి. గతేడాది గూగుల్‌ సెర్చ్‌లో ‘వీగన్‌ ఆహారం దొరికే చోటు’ కోసం వెతికేవారి సంఖ్య ఐదువేల రెట్లు పెరిగిందట. వీగన్‌ ఉద్యమకారులు ఏటా జనవరిని శాకాహార మాసంగా పరిగణిస్తుంటారు. కొత్తగా శాకాహారులుగా మారాలనుకునేవారిని జనవరి నెలంతా దాన్ని ఆచరణలో పెట్టిచూడమని కోరతారు. ఒక నెల రోజులు దానికి అలవాటు పడ్డాక దాదాపు అందరూ కొనసాగించడానికే ఇష్టపడుతున్నారు. అలా ఈ ఏడాది జనవరిలో ఎప్పుడూ లేనంత ఎక్కువ మంది వీగన్లుగా మారారు. ఒక్క బ్రిటన్‌లోనే కొత్తగా ఆరులక్షల మంది చేరారట. ఈ మార్పుకి పరోక్షంగా కరోనా కూడా కారణమైంది. లాక్‌డౌన్‌ సమయంలో మాంసం సరఫరా తగ్గిపోవడాన్ని శాకాహార మాంసం తయారీ సంస్థలు బాగా ఉపయోగించుకున్నాయి. తొలి మూడు నెలల్లోనే వీటి అమ్మకాలు 30శాతం పెరిగాయట. కేవలం వీగన్స్‌కి పరిమితమైన ఈ ఉత్పత్తులు కరోనా తర్వాత మామూలు ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టరెంట్లలోనూ అందుబాటులో ఉంటున్నాయి.

ఈ పరిణామాలన్నీ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న శాకాహార ప్రియత్వానికి నిదర్శనం అంటున్నారు నిపుణులు. అందుకే- మారుతున్న ప్రజల అభిరుచికి తగినట్లుగా పరిశ్రమలూ మారుతున్నాయి. మనదేశంలోనే శాకాహార ప్రొటీన్‌ ఫుడ్‌(వీగన్‌ ఫుడ్‌) తయారుచేసే స్టార్టప్‌లు పాతిక పైగా ఉన్నాయి. గత ఐదారేళ్లలో ప్రారంభమైన ఈ సంస్థలన్నీ భారీ ఎత్తున పెట్టుబడులనూ సాధిస్తున్నాయి. శాకాహారమాంసం ప్రధానంగా రెండు రకాలు. వృక్ష సంబంధ పదార్థాలతో తయారుచేసిన వెజ్‌ మీట్‌ ఒకరకమైతే, జంతు కణాల ఆధారంగా (సెల్‌బేస్డ్‌) పూర్తిగా ప్రయోగశాలలో తయారుచేసే ల్యాబ్‌ మీట్‌ మరో రకం. వృక్ష సంబంధ పదార్థాలను ప్రత్యామ్నాయ ప్రొటీన్‌గా తీసుకోవడం మనకి చాలాకాలంగా తెలుసు. దాంతో దాని అవసరం పెరగగానే పలు సంస్థలు తయారీ రంగంలోకి వచ్చాయి. అలాగే ల్యాబ్‌మీట్‌ తయారీ కూడా పెరుగుతోంది. ఎనిమిదేళ్ల క్రితం మొదటిసారి వార్తల్లోకొచ్చిన ల్యాబ్‌ మీట్‌ని 2016లో కేవలం నాలుగు కంపెనీలు తయారుచేయగా ప్రస్తుతం నలభైకి పైగా సంస్థలు రంగంలో ఉన్నాయి. అలా ఇప్పుడు ఈ రంగం మరెన్నో కొత్త ఆవిష్కరణలకు తెరతీస్తోంది.


మందులూ వస్తున్నాయి..!

ఇన్నాళ్లూ వీగన్‌ అంటే కేవలం ఆహారపదార్థాల వరకే అనుకున్నారు. ఇప్పుడు ఆ పదానికి అర్థం మరింతగా విస్తరిస్తోంది. జర్మనీకి చెందిన మందుల తయారీ కంపెనీ అక్సూనియో పూర్తిగా మొక్కల నుంచి సేకరించిన పదార్థాలతో తయారుచేసిన పారాసెటమాల్‌ ట్యాబ్లెట్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. తయారీనే కాదు, ఇతర మందులలాగా వీటిని పరీక్షించి చూడటానికి కూడా జంతువులను వాడలేదట.

ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న దాదాపు 75శాతం మందుల్లో వాడే మిశ్రమాల్లో ఏదో ఒక పదార్థమైనా జంతువుల నుంచి తీసుకున్నది ఉంటుంది. జంతువుల కొవ్వు నుంచి మెగ్నీషియం స్టీరేట్‌, ఎముకల నుంచి జెలాటిన్‌, పాల నుంచి లాక్టోస్‌ లాంటివి తీసుకుని మందుల్లో వాడతారు. కొన్నేమో మందుల్లోని వివిధ రసాయనాలను కలిపి ఉంచడానికి అవసరమైతే, కొన్ని మందు ప్యాకింగ్‌కి అవసరపడతాయి. మరికొన్ని సందర్భాల్లో అవే మందుగా కూడా ఉండవచ్చు. 2017లో వీగన్‌ సొసైటీ సాధ్యమైనంత ఎక్కువ మందుల్ని మొక్కల ఉత్పత్తులతోనే తయారుచేయాల్సిందిగా చూడమని కోరుతూ ప్రచారం మొదలుపెట్టింది. అప్పటి నుంచి కంపెనీలు దీనిమీద దృష్టిసారించాయి. అలా మార్చిలో అక్సూనియో విడుదల చేసిన ‘పారావెగానియో’ వీగన్‌ సొసైటీ నుంచి ‘వీగన్‌ ట్రేడ్‌మార్క్‌’ పొందిన తొలి ఔషధంగా గుర్తింపు పొందింది. ఇది కూడా నూటికి నూరుశాతం సాధారణ పారాసెటమాల్‌ ట్యాబ్లెట్లలాగే జ్వరమూ, నొప్పులకూ పనిచేస్తుందనీ, మెగ్నీషియం స్టీరేట్‌ బదులుగా ఇందులో మొక్కలనుంచి సేకరించిన పదార్థాన్ని వాడామనీ సంస్థ తెలిపింది. ఫ్రెంచ్‌ స్టార్టప్‌ వెజ్జీఫార్మ్‌ కూడా ‘ఈవ్‌ వీగన్‌’ లేబుల్‌తో ఇలాంటి మందుల్నే తయారుచేస్తోంది.


ఈ తేనెకు తేనెటీగలతో పనిలేదు!

తేనెటీగలు లేకుండా తేనె తయారుచేసుకోవడం అసాధ్యం అన్న అభిప్రాయమే ఉండేది మొన్నటివరకూ. అందుకే వీగన్లు ఆపిల్‌ పండ్ల రసానికి పంచదార చేర్చి దాన్నే తేనెగా సరిపెట్టుకునేవారు. కాలిఫోర్నియాకి చెందిన ఫుడ్‌ టెక్నాలజీ సంస్థ మెలిబయో ఆ కొరత తీర్చింది. ఈ సంస్థ ప్రయోగశాలలో తయారుచేసిన తేనెనీ, సాధారణ తేనెనీ రుచి చూసినవారు రెంటికీ తేడా కనిపెట్టలేకపోయారట.

ఏ పదార్థమైనా సాధారణంగా దాన్ని తయారుచేయడానికి వాడే పదార్థాలకు ప్రత్యామ్నాయాలను వాడినప్పుడు రుచిలోనూ రూపంలోనూ ఇసుమంతైనా తేడా ఉంటుంది. ఆ తేడా కూడా లేకుండా చేయడానికి- తయారుచేయాలనుకున్న పదార్థాన్ని అణువుల స్థాయిలో విశ్లేషించి, ప్రత్యామ్నాయ పదార్థాలు కూడా అవే లక్షణాలు కలిగి ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు. అందుకుగాను సైన్సులో- సింథటిక్‌ బయాలజీ, ప్రిసిషన్‌ ఫర్మెంటేషన్‌, ప్లాంట్‌ సైన్స్‌ అనే విభాగాల సాయం తీసుకున్నారు. సేంద్రియ విధానాల్లో పెంచిన మొక్కలూ పండ్లూ ముడి చక్కెరా వినియోగించడం వల్ల రంగూ రూపం రుచుల్లోనే కాదు, ఆరోగ్యపరమైన ప్రయోజనాల విషయంలోనూ ఏమాత్రం మార్పులేని అచ్చమైన తేనె తయారైంది. చివరగా సహజ పరిమళం కోసం పూల మకరందాన్నీ చేర్చారు. అసలింతకీ తేనెని ప్రయోగశాలలో తయారుచేయాలన్న ఆలోచన ఎందుకొచ్చిందీ అంటే- తేనె వాడకం పెరుగుతోంది. ఆహారంలోనే కాకుండా మందులూ, సౌందర్య ఉత్పత్తులూ... ఇలా అన్నింటిలోనూ దాని అవసరం ఉండడంతో డిమాండుని ఉత్పత్తి అందుకోలేకపోతోంది. ఒకప్పటిలా తేనెటీగలు ఆడుతూ పాడుతూ సహజంగా తయారుచేసిన తేనె ఇప్పుడేమాత్రం సరిపోదు. దానికితోడు వాతావరణ మార్పులూ రసాయనాల ప్రభావం వల్ల తేనెటీగల సంఖ్య తగ్గిపోతుండడంతో తేనెటీగల్ని బంధించి తేనె తయారుచేయించడం పెరుగుతోంది. అందుకే ఈ సమస్యలకి పరిష్కారంగా తేనెను లేబొరేటరీలో తయారుచేయడమే ఆశయంగా 2020లో మా సంస్థని ప్రారంభించాం. నిర్విరామంగా శ్రమించి ఏడాది తిరిగేసరికల్లా తేనెను బయటకు తీసుకొచ్చాం. ఈ తేనెతో తేనెటీగలకు సంబంధం లేదు, పర్యావరణానికి ఎలాంటి హానీ కలగదు. వినియోగదారులకు రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం...’ అని చెబుతున్నారు స్వయంగా వీగన్‌ అయిన సంస్థ సీఈవో డార్కొ మాండిచ్‌.


పాలూ గుడ్లూ... ల్యాబ్‌లోనే!

పులియబెట్టడం అనే ప్రక్రియ మనకి తెలుసు. చాలా రకాల ఆహార పదార్థాల తయారీకి దాన్ని వాడతాం. ఫర్మెంటేషన్‌ అనే ఈ ప్రక్రియే ఇప్పుడు ప్రయోగశాలలో సరికొత్త ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. పాలని పెరుగుగా మార్చినట్లు సూక్ష్మజీవులు ఒక్కో ఆహారపదార్థాన్నీ ఒక్కోలా మార్చేస్తాయి. బ్రెడ్‌, బీర్‌ లాంటివన్నీ వాటివల్ల తయారవుతున్నవే. ఆ సూత్రం ఆధారంగా సాగిన అధ్యయనమే ప్రయోగశాలలో పాలూ ఇతర ఉత్పత్తుల తయారీకి కారణమైంది.

లండన్‌కి చెందిన బెటర్‌ డైరీ అనే సంస్థ పాలూ చీజ్‌లను ఇలా ఫర్మెంటేషన్‌ ప్రక్రియ ఆధారంగా తయారుచేస్తోంటే, శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన క్లారా ఫుడ్స్‌ గుడ్లను తయారుచేస్తోంది. ఈ ఉత్పత్తులు అసలు వాటికన్నా ఒక్క పిసరు మెరుగ్గానే ఉంటాయి- అని బల్లగుద్ది చెబుతున్నాయి కంపెనీలు. బెటర్‌ డైరీ ప్రస్తుతం ఆవు పాలకు ప్రత్యామ్నాయాన్ని తయారుచేస్తోంది. ఈ పాలు రూపంలోనూ పోషకాల్లోనూ కూడా అచ్చం ఆవుపాలలాగే ఉంటాయట. అంతేకాక పాల ఉత్పత్తులైన చీజ్‌, పెరుగు, ఐస్‌క్రీములను కూడా ఈ సంస్థ తయారుచేస్తోంది. ఇక, క్లారాఫుడ్స్‌ సంస్థేమో ‘గుడ్డు తయారీ కోసం మేము ఫర్మెంటేషన్‌ సాంకేతికతను ప్రత్యేకంగా రూపొందించుకున్నాం. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే మేం ఉత్పత్తి చేసిన గుడ్డుతో మీరు ఏ ఆహార పదార్థం తయారుచేసుకున్నా అచ్చం గుడ్డుతో చేసుకున్నట్లే ఉంటుంది. ఒక్క ఉడకబెట్టిన గుడ్డు రూపం తేవడం తప్ప ఆమ్లెట్టూ పొరటూ ఏవైనా చేసుకోవచ్చు..’ అంటోంది. ల్యాబ్‌లో తయారవుతున్న ఈ పాలనూ గుడ్లనూ వీగన్లు నిరభ్యంతరంగా తీసుకోవచ్చని హామీ ఇస్తున్నాయి కంపెనీలు.


ధాన్యానికి జన్యుమార్పిడి

ధాన్యాన్నీ ఇతర చెట్ల ఉత్పత్తుల్నీ వాడి శాకాహార మాంసం తయారుచేయడం వరకూ బాగానే ఉంది. అయితే మాంసంలో మాంసకృత్తులు ఎక్కువ ఉండాలన్నది నియమం. కానీ ధాన్యంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పోషకాలపరంగా కూడా శాకాహార మాంసం నిజమైన జంతుమాంసంతో పోటీ పడాలంటే రూపమూ రుచీ మాత్రమే కాదు పోషకాలు కూడా దీటుగా ఉండాలి. అందుకోసం శాస్త్రవేత్తలు ఇప్పుడు మరో కొత్త టెక్నిక్‌ని కనిపెట్టారు.

ఐస్‌లాండ్‌లో ఓఆర్‌ఎఫ్‌ జెనెటిక్స్‌ అనే సంస్థ గ్రీన్‌హౌస్‌లో బార్లీ పండిస్తోంది. దానికి వాడే కరెంటుని భూమిలోపల పుట్టే వేడి నుంచి తయారుచేశారు(జియోథర్మల్‌ ఎనర్జీ). హైడ్రోపోనిక్‌ పద్ధతిలో పెంచుతున్న ఆ మొక్కలకి మంచుదిబ్బలు కరగ్గా వచ్చిన నీటిని వాడుతున్నారు. మామూలు ధాన్యంలా పొలంలో పండించకుండా ఎందుకింత జాగ్రత్తగా అన్నీ స్వచ్ఛమైన వాటితో పండిస్తున్నారంటే- ఆ బార్లీ మొక్కలన్నీ జన్యుమార్పిడి చేసినవి. అవి విత్తనాలుగా ఉన్నప్పుడే ఒక్కో గింజనీ తీసుకుని వాటి జన్యువులను ఎడిట్‌ (జీన్‌ ఎడిటింగ్‌) చేశారు. తర్వాత వాటిని నాటితే మొక్కలు పెరిగాయి. అలా చేయడం వల్ల ఆ మొక్కలు పెరిగి పెద్దయ్యాక పండే ధాన్యంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయట. ఆ ప్రొటీన్లను సేకరించి, శుద్ధి చేసి, లేబొరేటరీలో వినియోగిస్తారు. ప్రత్యేకించి ఈ ప్రొటీన్లు లేబొరేటరీలో శాకాహార మాంస కణజాలం వేగంగా పెరగడానికి అద్భుతంగా ఉపయోగపడతాయట. ఇప్పటివరకూ జంతువుల కణజాలం నుంచి తీసుకున్న ప్రొటీన్‌నే శాకాహార మాంస కణజాలానికి గ్రోత్‌ ఫ్యాక్టర్‌గా వినియోగిస్తున్నారు. దానికి బదులుగా ఇలా మొక్కల నుంచి తీసుకుంటే చాలా ఖర్చు కలిసి వస్తుందట... అందుకే ఈ ప్రయోగం.


మొక్కల ప్రొటీన్‌తో చేపమాంసం!

మింగ్‌ కోర్ట్‌... హాంకాంగ్‌లో పేరున్న పెద్ద హోటల్‌. అక్కడ షెఫ్‌గా పనిచేసే సాంగ్‌ చియు కింగ్‌కి ఆహారపదార్థాల తయారీలో ప్రయోగాలు చేయడమంటే సరదా. ‘కొత్త కొత్త వంటకాలు చేసి ఆకట్టుకుంటేనే కదా ఇక్కడ భోజనాలు బాగుంటాయన్న పేరొస్తుందీ, ఎక్కువ మంది వస్తారూ...’ అనే ఆయన వంటల్లో చేసే జిమ్మిక్కుల్ని ఎవరూ కనిపెట్టలేరు కూడా. ఎంతలా అంటే- ఆయనేమో శాకాహారం వండాను బాబో అంటుంటే అభిమానులు విననే వినరట... మీరు వండిన చేప అద్భుతంగా ఉంది సుమా- అంటూ మెచ్చుకుని వెళ్తారట.
‘ఆ మహత్తు నా చేతి వంటది కాదు, ‘గ్రీన్‌ మండే’ కంపెనీ తయారుచేస్తున్న వీగన్‌ ఫిష్‌ది...’ అంటారు కింగ్‌. ఈ సంస్థ చేపల్నే కాదు, పందిమాంసాన్ని కూడా తయారుచేస్తోంది.

జంతుమాంసం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారని ప్రజలు చేపలూ రొయ్యలూ లాంటి సీఫుడ్‌ వైపు మళ్లుతున్నారు. కానీ ఆ రంగమేమో చాలా సమస్యల్ని ఎదుర్కొంటోంది. సముద్రాల్లోని కాలుష్యం సీఫుడ్‌ ద్వారా మన శరీరంలో ప్రవేశించి అనారోగ్యాలకు దారితీస్తోంది. అందుకే చేపల్లాంటి సీఫుడ్‌కీ ప్రత్యామ్నాయాలు వెతుక్కోక తప్పలేదంటోంది గుడ్‌ఫుడ్‌ ఇన్‌స్టిట్యూట్‌. గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ చేపమాంసం తయారుచేసే సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు సంపాదించాయి. ఐదేళ్లలోనే వాటి సంఖ్య 18 నుంచి 90కి పెరిగింది. అందులో సగం అమెరికాలో ఉంటే మిగిలిన సగం యూఎస్‌ వెలుపల ఉన్నాయి. బంబుల్‌బీ ఫుడ్స్‌, గుడ్‌ క్యాచ్‌, హోల్‌ ఫుడ్స్‌ లాంటి కంపెనీలన్నీ మొక్కల ప్రొటీన్‌తోనే చేపమాంసాన్ని తయారు చేస్తున్నాయి. ఫిష్‌ స్టిక్స్‌, క్రాబ్‌కేక్స్‌... ఏవైనా సరే. అన్నీ శాకాహారమే అక్కడ. ఫ్రెంచ్‌ స్టార్టప్‌ ఒకటి మైక్రోఆల్గేతో స్మోక్డ్‌ సాల్మన్‌నీ, కులీన అనే కంపెనీ అచ్చం పచ్చి ట్యూనా చేపలా కన్పించే ఫిష్‌ ప్రొటీన్‌నీ తయారుచేస్తున్నాయి. క్యాన్డ్‌ ట్యూనా అమ్మడంలో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా ఉన్న ‘థాయ్‌ యూనియన్‌’ కంపెనీ కూడా ఈ రంగంలోకి వచ్చిందంటే డిమాండ్‌ ఎంత ఉందో ఊహించవచ్చు.


తల్లిపాలూ... తయారు!

ఏ కారణంగానైనా బిడ్డకు తల్లిపాలు సరిపోకపోతే పాలపొడి కొని కలిపి పట్టడం మనకు తెలుసు. అది ప్రత్యామ్నాయమే కానీ తల్లిపాలకు సాటి రాదు. అందుకే అమెరికాకి చెందిన బయోమిల్క్‌ అనే సంస్థ అచ్చంగా తల్లిపాలను పోలిన పాలను లేబొరేటరీలో తయారుచేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. వివిధ కారణాల వల్ల తల్లిపాలకు దూరమైన పిల్లలకు ఇక ఆ లోటు లేకుండా చూడొచ్చంటోంది బయోమిల్క్‌. సహజంగానే తల్లిపాలు బిడ్డకు కావలసిన ఎన్నో పోషకాలతో తయారవుతాయి. అచ్చంగా ఆ పోషకాలన్నీ ఉండేలా తయారుచేయడం సాధారణ విషయం కాదు కానీ, మహిళ రొమ్ము సంబంధిత కణాలను(మామరీ ఎపిథీలియల్‌ సెల్స్‌) తీసుకుని వాటినుంచి సహజంగా పాలు తయారయ్యే విధానాన్ని ప్రయోగశాలలో అభివృద్ధి చేయడంతో ఈ పాలలో ఆ పోషకాలన్నీ దాదాపుగా అదే స్థాయుల్లో ఉన్నాయి. ఈ ఆవిష్కరణ చేయడమే కాక, బయోమిల్క్‌ స్టార్టప్‌ని ప్రారంభించి తల్లిపాలను తయారుచేయవచ్చని ప్రపంచానికి చాటిన ఇద్దరూ మహిళా శాస్త్రవేత్తలే. లైలా స్ట్రిక్‌లాండ్‌, మిషెల్‌ ఎగర్‌ మూడేళ్లక్రితం ఈ కంపెనీ మొదలెట్టారు. వారిలో ఒకరు కన్నబిడ్డకు పాలిచ్చే సమయంలో ఎదుర్కొన్న సమస్యే- స్నేహితురాళ్లిద్దరినీ ఈ దిశగా పరిశోధించేలా చేసిందట. తాము ప్రయోగశాలలో తయారుచేస్తున్న పాలల్లో అన్ని పోషకాలూ ఉన్నాయనీ, అచ్చం తల్లిపాలలాగే ఇవి బిడ్డలో ఎదుగుదలకీ, వ్యాధినిరోధకశక్తి పెంపొందడానికీ తోడ్పడతాయనీ, పాలపొడికన్నా ఎన్నో రెట్లు నయమనీ చెబుతున్నారు వీరు.


వీటినీ మార్చేశారు..!

కొత్తగా ఏవైనా తయారుచేసుకోవడం కొంతవరకూ పర్వాలేదు. కానీ ఇప్పటివరకూ ఉన్నవాటినీ, వాటిలో మనకు తెలియకుండానే మాంసాహారం కలుస్తున్నవాటినీ మార్చుకోవడం కష్టమే. దాన్నీ చేసి చూపిస్తున్నాయి ఆహార సంస్థలు.

పండ్లరసాలూ శీతల పానీయాలూ: వాటిల్లో అనుమానించాల్సింది ఏముంటుంది, శాకాహారమేగా అనుకుంటాం. కానీ చాలా పానీయాల్లోనే కాదు, జామ్‌లూ జెల్లీల్లోనూ చేపల్లోని జెలాటిన్‌ని కలుపుతారు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా వెజిటబుల్‌ ఫ్యాట్‌ని ఉపయోగిస్తున్నారు.

చాకొలెట్‌: చాకొలెట్‌ తయారీలో పాలు తప్పనిసరి. వీగన్లకేమో పాలంటే పడదు. అందుకే మామూలు పాల స్థానంలో కొబ్బరిపాలు వాడి చాకొలెట్లూ ఐస్‌క్రీములూ తయారుచేస్తున్నారు.

విటమిన్లు: ఏ ఆహార పదార్థాన్నైనా విటమిన్లతో ఫోర్టిఫై చేసినప్పుడు డీ3, ఒమేగా-3 లాంటివాటికి చేపలనూనెల్నే వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటి స్థానాన్నీ మొక్కలే ఆక్రమించాయి.

పేస్ట్రీలు: మామూలు పాలూ గుడ్లకు బదులు మొక్కలనుంచి తయారుచేసిన పాలను వాడి వెన్న లేకుండా పేస్ట్రీలు తయారవుతున్నాయి.

బ్రెడ్‌ స్ప్రెడ్స్‌: బ్రెడ్‌తో పాటు తినడానికి బటర్‌కి ప్రత్యామ్నాయంగా మయొనైజ్‌, చీజ్‌ లాంటి వాటినీ మొక్కల నుంచి సేకరించిన ప్రొటీన్‌తో తయారుచేస్తున్నారు.

కేకులూ స్నాక్సూ: గుడ్డుకు బదులుగా చియా గింజలు వాడిన కేక్‌మిక్స్‌లు దొరుకుతున్నాయి. వీగన్‌ బిస్కట్లూ స్నాక్స్‌కీ కొదవ లేదు.

పర్‌ఫ్యూమ్స్‌: చాలా పర్‌ఫ్యూమ్స్‌లో జింకలూ తిమింగలాల్లాంటి జంతువులనుంచి సేకరించిన నూనెల్ని కలుపుతారు. ఇప్పుడు వాటికి బదులుగా వెజిటబుల్‌ నూనెల్ని వాడుతున్నారు.


ఈ శాకాహార విప్లవం వల్ల ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రెండు రకాలుగా మానవాళి లబ్ధి పొందబోతోంది.

ఎలాగంటే- ఆహారం పెద్దఎత్తున ప్రయోగశాలలో తయారైతే అటు పర్యావరణమూ భూసారం మీద ఒత్తిడీ తగ్గుతుంది, ఇటు కాలుష్యాల సమస్యని అధిగమించడమూ సులువవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..