‘ఒంటి చేత్తో’ సివిల్స్‌ సాధించాడు!

లక్షలమందిని వెనక్కినెట్టి సివిల్స్‌లో ర్యాంకు సాధించడమంటే కఠోర తపస్సు చేసి వరం పొందడమే. అన్ని వసతులూ, సౌకర్యాలూ ఉన్నవాళ్లకీ ఇక్కడ గెలుపు కచ్చితం కాదు.

Updated : 27 Feb 2024 14:57 IST

లక్షలమందిని వెనక్కినెట్టి సివిల్స్‌లో ర్యాంకు సాధించడమంటే కఠోర తపస్సు చేసి వరం పొందడమే. అన్ని వసతులూ, సౌకర్యాలూ ఉన్నవాళ్లకీ ఇక్కడ గెలుపు కచ్చితం కాదు. అలాంటిది తనకున్న పరిమితుల్లోనే సిద్ధమై ఈ పరీక్షలో విజయం సాధించి ఆదర్శంగా నిలిచాడు సూరజ్‌ తివారీ.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన రాజేశ్‌ తివారీ దర్జీ... మే 23న ఆయనకి కొడుకు సూరజ్‌ నుంచి ఫోన్‌ వచ్చింది... ‘నాన్నా, కలెక్టర్‌కి తండ్రి అయిపోయావ్‌...’ అన్నాడు సూరజ్‌. ఆ తండ్రి నోట మాటరాలేదు, కళ్లల్లో చెమ్మ మాత్రం వచ్చింది. అంతకు కొద్ది నిమిషాల ముందు రాజేశ్‌ భార్య ఆశాదేవికీ ఫోన్‌ వెళ్లింది... ‘అమ్మా వీధిలో అందరికీ మిఠాయిలు పంచిపెట్టేసెయ్‌’ అంది అవతలి గొంతు. ఆ కబురు గురించే ఆశగా ఎదురుచూస్తున్న ఆ తల్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. కొన్నేళ్లుగా చీకట్లు అలముకున్న ఆ ఇంటికి ఆరోజు దీపావళి పండగ వచ్చింది.

చేయి మాత్రమే మిగిలింది...

ప్రైవేటు కంపెనీలో పనిచేసే సూరజ్‌... నోయిడాలో రద్దీగా ఉన్న రైలు ఎక్కుతూ కాలుజారి పడిపోయాడు. కొద్దిరోజుల తర్వాత స్పృహ వచ్చి చూస్తే దిల్లీ ఎయిమ్స్‌లో ఉన్నాడు. రెండు కాళ్లూ, కుడి చేయీ, ఎడమ చేతి రెండు వేళ్లూ పూర్తిగా పోయాయి. అది జరిగింది జనవరి 2017లో. మూడు నెలలు హాస్పిటల్‌ బెడ్‌పైనే ఉన్నాడు. ‘ఆ ప్రమాదంలో చనిపోవాల్సిందే. కానీ బతికాను. కాబట్టి ఈ జీవితానికి ఏదో పరమార్థం ఉండాలనుకున్నా’ అంటాడు సూరజ్‌. అంతకుముందే- ఇంట్లో పరిస్థితుల కారణంగా ఇంటర్‌తోనే చదువు మానేసి ఉద్యోగంలో చేరాడు. సూరజ్‌కి ఓ అన్నయ్య, తమ్ముడు, చెల్లి. సూరజ్‌ చికిత్స కోసం చేసిన అప్పులతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. భవిష్యత్తు గురించి భయపడ్డాడేమో సూరజ్‌ అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అంతటి నిరాశావహ పరిస్థితుల్లోనూ సూరజ్‌ బెదిరిపోలేదు. దిల్లీ జేఎన్‌యూలో చదువుతున్న స్నేహితుడి సలహాతో అక్కడ చదువు కొనసాగించాలనుకున్నాడు. అతడు చెప్పినట్టు ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యాడు. అయినా సీటు రాలేదు. ఆ సమయంలో తొమ్మిది నెలలు ఇంటి దగ్గరే ఉన్నాడు సూరజ్‌. పరామర్శకు వచ్చినవాళ్లంతా ‘ఎలా బతుకుతాడో ఏంటో’ అనేవారు. ఆ మాటలు సూరజ్‌లో ‘గొప్పగా బతికి చూపించాల’న్న పట్టుదలని మరింత పెంచాయి. రెండో ప్రయత్నంలో జేఎన్‌యూ(బీఏ)లో సీటు సంపాదించి 2018లో క్యాంపస్‌లో అడుగుపెట్టాడు.   

రెండో ప్రయత్నంలోనే...

జేఎన్‌యూలో సూరజ్‌కి ఉదయం పూట క్లాసులయ్యేవి. మధ్యాహ్నం లైబ్రరీకి వెళ్లడం అలవాటైంది. అక్కడ సివిల్స్‌కి సిద్ధమవుతున్నవాళ్లని చూశాడు. తానేం  సాధిస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయో అర్థమైంది సూరజ్‌కి. సివిల్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నాడు. సూరజ్‌ తపనని చూసి... స్నేహితులూ, ప్రొఫెసర్లూ చేయూతనందించేవారు. మొదట్లో సాధారణ వీల్‌ఛైర్‌లో తిరిగేవాడు. అలాంటప్పుడు రూమ్మేట్స్‌ సహకరించేవారు. తర్వాత ఓ ఎన్జీఓ ద్వారా ఆటోమేటిక్‌ వీల్‌ఛైర్‌ అందేలా చూశారో ప్రొఫెసర్‌. ‘దాంతో ఒక్కడినే ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ వచ్చింది. నా శక్తి 25 శాతం పెరిగినట్లయింది’ అని చెబుతాడు సూరజ్‌. ఆపైన లైబ్రరీ విభాగం ల్యాప్‌టాప్‌నీ అందించింది. శిక్షణకు డబ్బు లేకపోవడంతో పుస్తకాలు చదువుతూ, యూట్యూబ్‌లో వీడియో పాఠాలు వింటూ నోట్స్‌ రాసుకునేవాడు. కొత్తగా ఎడమచేత్తో రాయడాన్ని అలవాటు చేసుకున్నాడు. ఎక్కువసేపు రాయడానికి కష్టమయ్యేది. అందుకే విషయాన్ని లోతుగా ఆకళింపు చేసుకుని బుల్లెట్‌ పాయింట్స్‌ రాసుకునేవాడు. పరీక్ష రాయడానికి స్క్రైబ్‌ (సహాయకుడు)ని ఇస్తారు కనుక అతడికి చెప్పే విధంగా సిద్ధమయ్యేవాడు. 2021లో మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ దాటకపోయినా నిరుత్సాహపడలేదు. మాస్టర్స్‌ చేస్తూనే రెండోసారి ఇంకాస్త ఎక్కువ శ్రమించాడు. మధ్యాహ్నం రెండింటికి లైబ్రరీలో అడుగుపెడితే రాత్రి రెండు తర్వాతే బయటకు వచ్చేవాడు. ఈసారి క్లిష్టమైన ప్రిలిమ్స్‌ గట్టెక్కేశాడు. రాత్రీపగలూ కష్టపడి మెయిన్స్‌ రాశాడు. ఆ తర్వాత పీహెచ్‌డీకి అవసరమయ్యే జేఆర్‌ఎఫ్‌ సాధించాడు. ఆలోపు మెయిన్స్‌ ఫలితాలు వచ్చాయి. ఇంటర్వ్యూకి ఎంపికయ్యాడు. ‘నువ్వు స్పెషల్‌ కేటగిరీకి చెందుతావు కదా. వాళ్లకోసం ఏం చేస్తావ్‌’ అని అడిగారట ఇంటర్వ్యూ బోర్డులోని ఒక సభ్యుడు. ‘నేను స్పెషల్‌ కేటగిరీ కాదు. నేనూ మీలాంటివాణ్నే. నా ఆలోచనలు ఎప్పుడూ దేశ ప్రజలూ, విశ్వ మానవుల గురించి ఉంటాయి’ అని బదులివ్వగా బోర్డు సభ్యులంతా మెచ్చుకున్నారు.

మే 23న రిజల్ట్స్‌ వచ్చాయి. ఫ్రెండ్‌ చూసి ‘917వ ర్యాంకు’ అన్నాడు. నమ్మలేకపోయాడు సూరజ్‌. తన నంబరూ, పేరూ మార్చిమార్చి చూశాడు. తనదే... పక్కా. అప్పుడు తల్లిదండ్రులకు ఫోన్‌ చేశాడు. 29 ఏళ్ల సూరజ్‌ది దివ్యాంగుల కేటగిరీలో రెండో ర్యాంకు. అతడి పేరు పక్కన ఐఏఎస్‌ చేరబోతోంది. ఇంతకు మించిన స్ఫూర్తి పాఠం యువతకి మరేముంటుంది!


అదే ప్రమాదం...

శారీరక వైకల్యంకంటే సాధించలేమేమోనన్న మానసిక సంఘర్షణే ప్రమాదమంటాడు సూరజ్‌. అలాంటి ఆలోచనలనుంచి బయటపడటానికి యోగా, ధ్యానం చేసేవాడు. సాయంత్రం కాసేపు క్యాంపస్‌లో తిరిగి వచ్చేవాడు. వీల్‌ఛైర్‌ బాస్కెట్‌బాల్‌ ఆడేవాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..