అనుబంధాల ఆసుపత్రి

ప్రయివేటు ఆసుపత్రుల్ని తలదన్నే ప్రభుత్వ దవాఖానాల గురించి మనం విని ఉంటాం. ఇది కూడా అలాంటిదేకానీ... వాటన్నింటికీ మించిన ఓ మంచి విషయం ఇందులో ఉంది.

Updated : 04 Jun 2023 03:57 IST

ప్రయివేటు ఆసుపత్రుల్ని తలదన్నే ప్రభుత్వ దవాఖానాల గురించి మనం విని ఉంటాం. ఇది కూడా అలాంటిదేకానీ... వాటన్నింటికీ మించిన ఓ మంచి విషయం ఇందులో ఉంది. అది... ఇంట్లోవాళ్ళూ వదిలేసిన రోగుల్నీ, ఆ రోగులు చనిపోగా అనాథలుగా మిగిలిన పిల్లల్నీ చేరదీయడం. వాళ్ళకి చదువుతోపాటూ ఉద్యోగమూ  కల్పించడం! మదురై తోప్పూరులోని ఈ ఆసుపత్రిలో అడుగడుగునా ఇలాంటి మానవీయ విజయగాథలెన్నో వినిపిస్తుంటాయి...

ఆమె పేరు రోజ్‌. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అయినా బాగా చదువుకుని ఐటీ రంగంలో ఉద్యోగం సాధించింది. అక్కడ ఫెర్నాండోని ప్రేమించి పెళ్ళిచేసుకుంది. ఈ పెళ్ళి కారణంగా రోజ్‌ బంధువులు ఆమెని వెలేయడంతో దిల్లీలో కాపురం పెట్టారు. వాళ్ళకి రీటా, అలెక్స్‌ అని ఇద్దరు పిల్లలు పుట్టారు. కొంతకాలం బాగానే గడిచింది కానీ... ఫెర్నాండో ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రోజ్‌కి టీబీ సోకింది. ఆదుకునేవాళ్ళు లేక రోజ్‌ తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ముంబయి, చెన్నైలలో ఉన్న తన అక్కావాళ్ళ దగ్గరకెళితే... ‘నీ మొహం చూపొద్దు’ అనేశారు. అప్పుడు రోజ్‌కి మదురైలో ఉంటున్న మావయ్య ఒకాయన గుర్తొచ్చాడు. టీబీతో బాధపడుతూనే అతికష్టంపైన మదురైకి వచ్చింది. మావయ్య అడ్రస్‌కి వెళితే... వాళ్ళు అక్కడ లేరని తెలిసింది. చేసేదేమీలేక మళ్ళీ దిల్లీ వెళ్లిపోదామని పిల్లల్ని తీసుకుని రైల్వే స్టేషన్‌కి వచ్చింది. దిల్లీ రైలు కోసం ఎదురుచూస్తుండగానే- రోజ్‌ స్పృహతప్పి పడిపోయింది. హిందీ తప్ప మరే భాషా తెలియని పిల్లలిద్దరూ ఆమె పక్కన చేరి ఏడుస్తుంటే - చుట్టూ ఉన్నవాళ్లు ఆదుకున్నారు.

మదురై నగరం శివారున ఉన్న తోప్పూరు ప్రభుత్వ టీబీ ఆసుపత్రికి పంపించారు. అక్కడ పరీక్షిస్తే రోజ్‌లో క్షయ బాగా ముదిరిపోయిందని తేలింది. పిల్లలకీ అది సోకిందని గుర్తించారు. చికిత్స ప్రారంభించినా ఫలితం లేకుండా... వారానికే రోజ్‌ కన్నుమూసింది. మామూలు ఆసుపత్రుల్లోనైతే అనాథ శవం అని చెప్పి ఏ మున్సిపాలిటీవాళ్ళకో అప్పగించి ఉంటారు. కానీ ఇక్కడలా చేయలేదు. ఆసుపత్రి ప్రాంగణంలోనే సకల మర్యాదలతో ఆమెని సమాధి చేశారు. పిల్లలకీ ఏడాదిపాటు చికిత్సని అందించి బాగు చేశారు.కలెక్టర్‌ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుని ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉన్న నర్సుల హాస్టళ్లలోనే పెంచి పోషించారు. ఎనిమిదేళ్ళలో రీటా గ్రాడ్యుయేట్‌ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ఆసుపత్రిలోని పేషెంట్లకి మనోధైర్యాన్నిచ్చే కౌన్సెలర్‌గా పనిచేస్తోంది. ఆమె తమ్ముడు అలెక్స్‌ని ఆసుపత్రి నిర్వాహకులే ఐటీఐలో చదివిస్తున్నారు! ఒక్క పిల్లలనే కాదు- క్షయ చికిత్స తర్వాత బంధువులు వదిలేసిన పేషెంట్లనీ ఈ ఆసుపత్రి అక్కున చేర్చుకుంటోంది. వాళ్ళ అర్హతల్ని బట్టి ఉద్యోగాలూ కల్పిస్తోంది. ఇప్పటిదాకా యాభై మందిదాకా ఈ ఆసుపత్రి పంచన చేరారు.

ఒకప్పుడు ఎలా ఉండేదో...

1960ల నాటి ఆసుపత్రి ఇది. మదురై నగరం శివారున వందెకరాల్లో 250 పడకలతో విస్తరించి ఉంటుంది. అంత పెద్ద ఆసుపత్రి సర్కారు నిర్లక్ష్యం కారణంగా శిథిలమైంది. ఆ నేపథ్యంలోనే 2013లో జి.కాంతిమతినాథన్‌ అన్న వైద్యాధికారి ఆర్‌ఎంఓగా వచ్చారు. ఐదేళ్ళలోనే దీన్ని ప్రయివేటు ఆసుపత్రుల్ని తలదన్నేలా తీర్చిదిద్దారు.

ఎన్నెన్ని వసతులో...

ఒకప్పుడు పిచ్చిమొక్కలతో అడవిలా ఉన్న ఆసుపత్రి నేడు 25 వేల చెట్లతో కళకళలాడుతోంది. వీటిల్లో అరవైశాతం వరకు పండ్ల చెట్లే. పేషెంట్లూ, హాస్టళ్ళలో ఉన్నవాళ్ళకీ అవసరమైన కాయగూరలన్నీ ఇక్కడే పండిస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక వంటగదినీ, మంచి నీటి కోసం ఆర్‌ఓ ప్లాంట్‌నీ ఏర్పాటుచేశారు. రోగుల కోసం హైటెక్‌ హెయిర్‌సెలూన్‌నీ పెట్టారు. చక్కటి సంగీతం వినేలా 24 గంటల ఎఫ్‌ఎంనీ, ప్రతివార్డులోనూ టీవీలనీ ఏర్పాటుచేశారు. ఈ ప్రాంగణంలో సినిమా థియేటర్‌ కూడా ఉంది. వారానికి రెండుసార్లు రోగులూ, వాళ్ళ వెంట ఉండే అటెండర్లూ తమకిష్టమైన సినిమా ఇక్కడ చూడొచ్చు. మిగతారోజుల్లో ఇక్కడే ధ్యానం యోగా నేర్పిస్తారు. రోగులతో వచ్చే అటెండర్లు రోజంతా ఖాళీగా ఉండకుండా కుట్లూ అల్లికలూ, తేనెటీగల పెంపకంపైన శిక్షణ ఇస్తున్నారు.

మదురైకి దేశం నలుమూలల నుంచి యాత్రికులొస్తుంటారు. ఒక్కోసారి మతిభ్రమించినవాళ్లూ ఇక్కడకొచ్చి ఉండిపోతారు. అలాంటి వాళ్ళని గుర్తించి ఆసుపత్రికి తెచ్చి ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. వాళ్ళకి బాగయ్యాక కూడా బంధువులు ఆదరించకపోతే ఇక్కడే ఉపాధి కల్పిస్తున్నారు! వసతుల మాట పక్కనపెడితే, ఈ మానవీయ స్పృహకారణంగానే తమిళనాడులోని అత్యుత్తమ ఆసుపత్రిగా అవార్డునీ సాధించింది!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు