వడ్డికాసులవాడి వైభోగం!

‘ఓం నమో వేంకటేశాయ’... నామ స్మరణతో ప్రతిధ్వనించే తిరుమల క్షేత్రంలో... శ్రీనివాసుడి వైభోగాన్ని ఎంత వర్ణించినా తనివి తీరదు.  ఓ వైపు భక్తజన ప్రవాహం, మరోవైపు నిత్యాన్నదాన సత్రాలు, ఇంకోవైపు ప్రసాదాల తయారీ ప్రాంతం... హడావుడిగా తిరిగే స్వామివారి సేవకులు... ఇలా ఎప్పుడు చూసినా నిత్య కల్యాణం పచ్చతోరణంగా కనిపిస్తుంది.

Updated : 08 Jan 2023 11:23 IST

వడ్డికాసులవాడి వైభోగం!

‘ఓం నమో వేంకటేశాయ’... నామ స్మరణతో ప్రతిధ్వనించే తిరుమల క్షేత్రంలో... శ్రీనివాసుడి వైభోగాన్ని ఎంత వర్ణించినా తనివి తీరదు.  ఓ వైపు భక్తజన ప్రవాహం, మరోవైపు నిత్యాన్నదాన సత్రాలు, ఇంకోవైపు ప్రసాదాల తయారీ ప్రాంతం... హడావుడిగా తిరిగే స్వామివారి సేవకులు... ఇలా ఎప్పుడు చూసినా నిత్య కల్యాణం పచ్చతోరణంగా కనిపిస్తుంది. ప్రపంచమే తరలివచ్చే ఈ ఇల వైకుంఠానికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు కొన్ని...

ఏడుకొండలపైకి చేరుకునేందుకు బస్సులూ ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉన్నా... మొక్కు కోసం కావచ్చు, మరో కారణం కావచ్చు... చాలామంది భక్తులు మెట్ల మార్గాన్ని ఎంచుకుంటారు. అలా వచ్చే భక్తులు రోజుకి సుమారు 35-40 వేలమంది వరకూ ఉంటారు. వీళ్లు- అలిపిరి నుంచి వెళ్లాలనుకుంటే 3,550 మెట్లూ, శ్రీవారి మెట్ల మార్గం నుంచి అయితే... 2,388 మెట్లూ ఎక్కాల్సి ఉంటుంది.  

* అసలు ఒక రోజులో తిరుమల కొండమీదకు చేరుకునే భక్తుల సంఖ్య ఎంతో తెలుసా... దాదాపు 75 వేల నుంచి లక్ష. దేవస్థానం లెక్కల ప్రకారం... 2022లో దాదాపు రెండుకోట్ల మంది భక్తులు శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్నారని అంచనా.

* తిరుమలకు చేరుకునే ముందే కొండపైన వసతి, శ్రీవారి దర్శన టిక్కెట్లను బుక్‌ చేసుకోవాలనేది భక్తులకు తెలిసిందే. వసతి విషయానికొస్తే... ఒక రోజుకు ఆన్‌లైన్‌ ద్వారా మూడు వేల గదుల్నీ, స్వయంగా వెళ్లే భక్తులకు నేరుగా మూడువేల గదుల్నీ కేటాయిస్తారు. అదే దర్శన టికెట్లను తీసుకుంటే రోజుకు 300 రూపాయల టికెట్లను 20 - 25 వేల వరకూ... బ్రేక్‌, శ్రీవాణి తదితర సేవలన్నీ కలిపి ఐదు వేల వరకూ టికెట్లను కేటాయిస్తారు.  

* శ్రీవారిని దర్శించుకోవడానికి ముందే భక్తులు తలనీలాలు సమర్పించుకోవడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. ఆ తలనీలాల బరువు ఏడాదికి సుమారు 500-600 టన్నుల వరకూ ఉంటుందట. కేవలం తలనీలాల నుంచే స్వామి ఖాతాలో చేరే ఆదాయం సాలీనా 120 కోట్ల రూపాయల పైమాటే.

ఏ టికెట్టు తీసుకున్నా స్వామిని కళ్లారా చూడాలనుకుంటే కొన్నిగంటలపాటు లైన్లో నిలబడాల్సిందే. అంత శ్రమా తీసుకుని బంగారు వాకిలి వద్దకు వెళ్లే భక్తులకు అన్నిరకాల ఆభరణాలూ దాల్చిన స్వామి దర్శనమిస్తాడు. వజ్ర వైఢ్యూరాలూ, పచ్చలూ.. ఇలా ఒకటేమిటి, స్వర్ణాలంకార శోభితుడై కనిపించే ఆ వడ్డికాసులవాడి దగ్గర ప్రస్తుతం 1083 రకాల ఆభరణాలు ఉన్నాయి. వాటిని ఏడాది మొత్తం వివిధ సందర్భాల్లో అలంకరిస్తారు. అన్నింట్లోకీ గరుడమేరు పచ్చ అరుదైన ఆభరణమనీ దీని బరువే 500 గ్రాముల వరకూ ఉంటుందనీ అంటారు. అదేవిధంగా  మూలవిరాట్టుకు అలంకరించే నిలువెత్తు లక్ష్మీ కాసుల హారం కూడా ఎంతో ప్రత్యేకమైనదని చెబుతారు. ఇక, స్వామికి ఏడు కిరీటాలూ, 20 ముత్యాల హారాలూ 50 కాసుల హారాలూ... ఉత్సవ విగ్రహాలకు అదనంగా మరో ఏడు కిరీటాలూ ఉన్నాయి. మూలవిరాట్టుకి ఆపాదమస్తకం తొడిగే ఆభరణాల సెట్లు మూడు ఉన్నాయి. ఆభరణాలు కావచ్చు, స్వామికి వచ్చే బంగారు కానుకలు కావచ్చు, అన్నీ కలిపి ప్రస్తుతం శ్రీవారి దగ్గర 10.25 టన్నుల బంగారం ఉంది.

గర్భగుడిలో మూలవిరాట్టు కాకుండా శ్రీదేవి- భూదేవి సమేత మలయప్ప స్వామి... కృష్ణుడు, భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర నారసింహుడి విగ్రహాలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ కలిపి పంచబేరాలుగా పిలుస్తారు.  

స్వామికి అలంకరించే ఆభరణాలు కాకుండా ప్రత్యేకంగా వేసే పూల మాలలూ, ఇతర పుష్పాలంకరణా కనులకు పండుగే. స్వామికి అలంకరించే పూలలో కొన్నింటిని తిరుమలలోని తోటలోనే పండిస్తుంటే మిగిలిన వాటిని బెంగళూరు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి తెప్పిస్తారు. ఒక రోజులో సుమారు 750 కేజీల పుష్పాలను స్వామివారి సేవలో ఉపయోగిస్తుంటే బ్రహ్మోత్సవాల సమయంలో నలభైటన్నుల వరకూ వాడతారు.  

ఆ వడ్డికాసులవాడిని దర్శించుకునేది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే అయినా... ఆ భాగ్యానికే మురిసిపోయే భక్తులు స్వామికి తమ శక్తికొలదీ కానుకల్ని సమర్పించుకుంటారు. అలా ముడుపులూ, హుండీలో వేసే డబ్బులూ, బంగారం రూపంలో సమర్పించే కానుకలూ, స్వామికి ఉండే స్థిరాస్తులూ... ఇలా అన్నీ కలిపితే ప్రస్తుతం శ్రీనివాసుడి సంపద 2.5 లక్షల కోట్ల రూపాయలు. కేవలం నగదునే తీసుకుంటే దాదాపు 15,938 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. ఈ మొత్తాన్ని పలు బ్యాంకుల్లో ఎఫ్‌డీల రూపంలో భద్రపరిచారు.

స్వామిని దర్శించుకుని బయటకు వచ్చే భక్తుల దృష్టి ముందుగా ప్రసాదం వైపు వెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, జీఐ ట్యాగ్‌నీ సొంతం చేసుకున్న శ్రీవారి లడ్డూను రోజుకు 4 లక్షల వరకూ వివిధ పరిమాణాల్లో చేస్తుంటారు. కేవలం లడ్డూల తయారీలోనే రోజూ దాదాపు  15 వేల కిలోల నెయ్యి, 6.5 - 7 టన్నుల సెనగపిండి, 10 టన్నుల చక్కెర, 700 కిలోల జీడిపప్పు, 150 కిలోల యాలకులు, 540 కేజీల ఎండుద్రాక్ష వాడతారు.

శ్రీవారిని దర్శించుకోవడానికి ముందూ లేదా ఆ తరువాత అక్కడున్న నిత్యాన్నదాన సత్రంలో భోంచేస్తే భక్తులకు అదో తృప్తి. నిజమే మరి... ఆ సత్రంలో రెండుపూటలా భోజనం, టిఫినూ ఉచితమే. ఎలా చూసుకున్నా రోజుకి సుమారు లక్షమంది వరకూ భక్తులు భోంచేస్తారు. అన్ని రకాల ప్రసాదాల తయారీ నిమిత్తం మొత్తంగా రోజుకు 6 టన్నుల గ్యాస్‌ను వినియోగిస్తారు. 

 వెంకన్నకు నివేదించే ప్రసాదాలన్నీ ఆగమశాస్త్రంలో నిర్దేశించిన దిట్టం (కొలతలు) ఆధారంగానే తయారుచేస్తారు. సుప్రభాత సేవలో వెన్న, ఆవుపాలను అర్పిస్తే... తోమాల సేవ పూర్తయ్యాక నల్లనువ్వులు, శొంఠి, బెల్లంతో చేసిన పదార్థాన్ని నివేదిస్తారు. సహస్రనామార్చన తరువాత మీగడ, వెన్న, పెరుగుతో చేసిన అన్నప్రసాదాన్ని సమర్పిస్తారు. మధ్యాహ్న ఆరాధనలో లడ్డూ, దోశ, వడ, అప్పం వంటివి... సాయంకాలం శుద్ధన్నం, సిరాను నివేదిస్తారు. రాత్రి మిరియాలతో చేసిన మరీచ్చాన్నం, గూఢాన్నం ఉంటాయి. అదేవిధంగా పులిహోరను ఎక్కువ మోతాదులో వండి రాశిగా పోసి నివేదించడం, జిలేబీలూ, మురుకులూ, పోళీలూ.... వంటివీ ఉంటాయి. ధనుర్మాసంలో మాత్రం బెల్లందోశల్ని ప్రత్యేకంగా చేస్తారు. ఇవి కాకుండా చక్రపొంగలి, చిత్రాన్నం, దద్ధ్యోదనం, క్షీరాన్నం, రవ్వకేసరి, కట్టుపొంగలి, శాకాన్నం, పంచామృతం, పంచకజ్జాయం... వంటివి మార్చిమార్చి నివేదిస్తారు. వీటి తయారీలో వాడే పదార్థాలన్నింటినీ సేంద్రియ పద్ధతిలో పండిస్తారు.

 తిరుమలలో ఉత్సవాలు అనగానే   దసరా సమయంలో అంగరంగవైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలే గుర్తొస్తాయి. కానీ వాటితోపాటు స్వామివారికి ఏడాది మొత్తం నిత్య, వార, పక్ష, మాస, వార్షికోత్సవాల పేరుతో దాదాపు 500 పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ధనుర్మాసంలో మాత్రం స్వామికి సుప్రభాతం కాకుండా... తిరుప్పావై పాశురాలను వినిపిస్తారు.    

ఇవన్నీ సరే... తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రతి కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా సాగేందుకు ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నారో తెలుసా... సుమారు 16 వేల మంది. ఇక, స్వామివారి సేవలో తరించే అర్చకుల్లో వంశపారంపర్యంగా నాలుగు కుటుంబాలు ఇప్పటికీ కొనసాగుతుంటే... అదనంగా సహాయ అర్చకులుగా 35 మంది ఉన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకారం... 2022లో దాదాపు మే నుంచి ప్రతి నెలా వందకోట్ల రూపాయలకు పైగా హుండీ కానుకలు వచ్చాయి. ఒక రోజున రికార్డు స్థాయిలో ఆరుకోట్ల ముప్ఫైఒక్క లక్షల రూపాయలు వచ్చాయనీ, శ్రీవారి ఆలయ చరిత్రలో ఇలా రావడం ఇది రెండోసారనీ తితిదే చెబుతోంది.

కొల్లా వెంకటేష్‌, న్యూస్‌టుడే, తిరుమల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..