వీళ్లు ఈతరం శ్రవణ కుమారులు

ఎన్నో కష్టాలుపడి పెంచే తల్లిని పెద్ద వయసులో సంతోషంగా ఉంచేందుకు కొందరు పిల్లలు రకరకాల బహుమతుల్ని ఇచ్చి ఆశ్చర్యపరచడం చూస్తూనే ఉంటాం. కేరళకు చెందిన రోజన్‌, సత్యన్‌ కూడా ఆ కోవలోకే వస్తారు. వాళ్ల అమ్మ ఎలీకుట్టిపౌల్‌ చిన్ననాటి కలను నిజం చేయాలనుకున్న వాళ్లిద్దరూ ఆమెకోసం పెద్ద సాహసమే చేశారు. అసలేం జరిగిందంటే.

Updated : 06 Nov 2022 12:38 IST

వీళ్లు ఈతరం శ్రవణ కుమారులు

ఎన్నో కష్టాలుపడి పెంచే తల్లిని పెద్ద వయసులో సంతోషంగా ఉంచేందుకు కొందరు పిల్లలు రకరకాల బహుమతుల్ని ఇచ్చి ఆశ్చర్యపరచడం చూస్తూనే ఉంటాం. కేరళకు చెందిన రోజన్‌, సత్యన్‌ కూడా ఆ కోవలోకే వస్తారు. వాళ్ల అమ్మ ఎలీకుట్టిపౌల్‌ చిన్ననాటి కలను నిజం చేయాలనుకున్న వాళ్లిద్దరూ ఆమెకోసం పెద్ద సాహసమే చేశారు. అసలేం జరిగిందంటే... కేరళలోని ఇడుక్కి జిల్లా, కలిప్పరలోని పశ్చిమ కనుమల్లో పన్నెండేళ్లకోసారి నీలకురింజీ అనే పూలు పూస్తాయట. నీలంరంగులో ఉండే ఆ పూల అందాలను చూసేందుకు ఎక్కడెక్కడినుంచో వస్తారు. ఎలీకుట్టిపౌల్‌ కూడా ఆ పూలను చూడాలని చిన్నప్పటినుంచీ అనుకునేది. అదే విషయాన్ని తన పిల్లలకూ చెప్పడంతో ఆమెను ఇప్పుడు తీసుకెళ్లాలనుకున్నారు రోజన్‌, సత్యన్‌. చివరకు తల్లిని తీసుకుని దాదాపు వందకిలోమీటర్లు జీపులో ప్రయాణించాక... కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. ఎనభైఏడేళ్ల వయసులో ఎలీకుట్టి అంతదూరం నడవలేదు కాబట్టి చివరకు రోజన్‌, సత్యన్‌ కలిసి తల్లిని ఎత్తుకుని తీసుకెళ్లి మరీ.. ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించి ఆ పూల అందాలను చూపించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలను చూసినవాళ్లంతా ఎలీకుట్టి పిల్లల్ని అభినవ శ్రవణకుమారులంటూ ప్రశంసిస్తున్నారు.


వామ్మో ఎలా పేర్చాడో!

వీధిలో సైకిల్‌పైన అమ్మేవాళ్లైనా... పార్లర్‌ వాళ్లైనా ఒక్క కోన్‌పైన ఎన్ని ఐస్‌ స్కూప్‌లు పెట్టగలరు? మహా అయితే మూడో నాలుగో పెట్టగలరు. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఒక్క కోన్‌పైన 125 ఐస్‌ స్కూప్‌లు ఉంచి రికార్డు సృష్టించాడు. అలాగని అదేదో పేద్ద కోన్‌ అనుకునేరు. సాధారణంగా మనం ఎప్పుడూ తినే సైజు కోన్‌పైనే స్కూపు మీద స్కూపును పేర్చేస్తున్నాడు ఇటలీకి చెందిన దిమిత్రీ పాన్‌సియేరా. ఐస్‌క్రీమ్‌ విక్రయించే దిమిత్రీ మొదట్నుంచీ ఇలా స్కూపుల్ని పేర్చుతూ ప్రయోగం చేసేవాడు. చేస్తూ చేస్తూ ఆ బ్యాలెన్సింగ్‌ టెక్నిక్‌నీ కనిపెట్టేశాడు. అలా గతంలో 121 స్కూపులు పెట్టేసి గిన్నీస్‌కెక్కాడు. ఇప్పుడు మరో నాలుగు స్కూపుల ఐస్‌క్రీమ్‌ను అదనంగా పెట్టి తన రికార్డును తానే బ్రేక్‌ చేసుకున్నాడు దిమిత్రీ.


గాడిదలకో సంత

ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది అంటారు కదా... కానీ, ఇక్కడ ప్రతి గాడిదకీ ఒక పేరు వస్తుంది. అది కూడా బాలీవుడ్‌ సూపర్‌స్టార్ల పేరు! వాటి పేర్ల వెనక కథ ఏమిటంటే... మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌ ప్రాంతంలో మందాకినీ నదీ తీరంలో ఏటా దీపావళి తరవాత పెద్ద ఎత్తున గాడిదల సంత జరుగుతుంది. మన పల్లెల్లో గేదెల సంతలు జరుగుతుంటాయి కదా... అలా అన్నమాట. ఔరంగజేబు కాలం నుంచి జరుగుతున్న ఈ సంతకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది గాడిదలు తరలివస్తుంటాయి. వచ్చిన ప్రతి గాడిదనూ శుభ్రంగా కడిగి రంగులు అద్దుతారు. వాటిలో కాస్త ఒడ్డూపొడవూ ఉన్న అందమైన గాడిదలు లక్ష నుంచి రెండు లక్షల వరకూ పలుకుతాయి. పైగా అలాంటి వాటికి యజమానులు సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ఖాన్‌, కత్రినా అని
బాలీవుడ్‌ సినిమా తారల పేర్లు కూడా పెట్టడం విశేషం. దాదాపు వారం రోజుల పాటు జరిగే ఈ సంతలో సుమారు 20- 30 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. అంటే గాడిదలకీ మాంచి మార్కెట్‌ ఉందన్నమాట మన దగ్గర.


శ్రీమతికో సీతాకోకల పార్కు

భార్య పుట్టినరోజు నాడు సర్‌ప్రైజింగ్‌గా వేడుకలు చేయడం- చీరలో, నగలో, లేదంటే వారికి ఇష్టమైనవి ఏవో ఇవ్వడం చేస్తుంటారు భర్తలు. అయితే గుజరాత్‌లోని వడోదరకు చెందిన స్వప్నాలీ భర్త సునీత్‌ మాత్రం తన భార్యకు ఊహించని కానుక ఇచ్చి కన్నీళ్లు పెట్టించాడు. గతేడాది స్వప్నాలీ తల్లి క్యాన్సర్‌తో కన్నుమూసింది. వాళ్ల సొంతూరైన మంజుసర్‌ గ్రామంలోనే ఆమె అంత్యక్రియలు జరిగాయి. భార్యకి తల్లిదండ్రులతోపాటు పుట్టి పెరిగిన గ్రామంతోనూ ఎనలేని అనుబంధం ఉండటంతో సునీత్‌కి ఓ ఆలోచన వచ్చింది. అత్తగారికి చివరి కార్యక్రమాలన్నీ జరిగిన శ్మశానం పక్కన ఉన్న బంజరుభూమిని కొని- చుట్టూ ప్రహరీ నిర్మించి, సీతాకోక చిలుకల్ని ఆకర్షించే పూల మొక్కల్ని నాటాడు. అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దిన ఆ బటర్‌ఫ్లై గార్డెన్‌ను భార్య పుట్టినరోజునాడు బహుమతిగా అందించాడు. అంతేకాదు, తమ కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులు ఎవరైనా అంతిమ కార్యక్రమాలకు సంబంధించిన తంతుల్ని అక్కడ జరుపుకోవచ్చని చెబుతున్న సునీత్‌... బాధలో ఉన్నవారికి ఆ పరిసరాలు మానసిక సాంత్వన అందించాలని కోరుకుంటున్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..