Updated : 31 Jul 2022 09:49 IST

ఈ చేపలు శాకాహారం!

మీరు శాకాహారులా... అచ్చంగా మొక్కల ఉత్పత్తుల్నే తింటారా... అయితే ఇంకేం... ఎంచక్కా ఈ చేపముక్కల్నీ తినేయండి అంటున్నారు ఉత్పత్తిదారులు. అవునండీ... నిజమైన చేపల రుచినీ రూపాన్నీ తలపిస్తూ అందులోని పోషకాలన్నీ అందేలా తయారైనవే ఈ సరికొత్త వేగన్‌ ఫిష్‌ ప్రొడక్ట్స్‌. ఆహార పరిశ్రమలో తాజా ట్రెండ్‌గా మారిన ఈ సరికొత్త చేపల గురించి..!

ప్రపంచవ్యాప్తంగా వేగన్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. జీవహింసను వ్యతిరేకించే వీళ్లంతా వేగనిజం బాటపట్టాక మాంసాహారానికే కాదు, ఇతర జంతుఉత్పత్తులన్నింటికీ దూరంగా ఉంటున్నారు. అయితే మాంసాహార రుచిని మరిచిపోయి శాకాహార ఉత్పత్తుల్నే తినడం కష్టమే. అందుకోసమేనేమో ఆ రుచినీ అందులోని పోషకాల్నీ మిస్‌ కాకుండా ఉండేందుకన్నట్లు కొన్ని కంపెనీలు మొక్కలకు సంబంధించిన పదార్థాలతోనే గుడ్లూ మాంసంతోపాటు చేపల్నీ తయారుచేస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా చేపల రకాలతోపాటు ట్యూనా చేపను పోలిన వెజ్‌ ట్యూనానీ రూపొందిస్తున్నాయి కొన్ని సంస్థలు. దాంతో వేగన్‌ ప్రియుల్ని ఈ చేపముక్కలు తెగ నోరూరిస్తున్నాయి.

భారీయెత్తున చేసే ఈ శాకాహార చేపలకోసం గోధుమల్లోని ప్రొటీన్‌ లేదా సోయాతో చేసిన టోఫు పదార్థానికి సముద్ర నాచు, ఉప్పు, సోయాసాస్, రైస్‌ వైన్‌... వంటివి జోడిస్తుంటారు. సోయాబీన్స్‌తో చేసే టోఫూకీ కెల్ప్‌ రకం సముద్రనాచుని కలిపి చేసినవైతే అచ్చం సముద్ర చేప రుచిని తలపిస్తాయట. పైగా వీటిని ఉడికించినా బేక్‌ చేసినా కూడా అచ్చం చేపముక్కల టెక్స్చర్‌తో ఉండేలానే చేస్తున్నారు. అయితే ఆయా కంపెనీలతోపాటు స్టార్‌ షెఫ్‌లూ గృహిణులూ ఇంట్లోనే తమదైన పద్ధతుల్లో వేగన్‌ ఫిష్‌ తయారుచేసుకుంటున్నారు. అంతెందుకు... ఈమధ్య దిల్లీకి చెందిన ఓ ఫుడ్‌ వెండర్‌ సోయా, అల్లం-వెల్లుల్లి, కార్న్‌ఫ్లోర్, బ్రెడ్‌ల్ని మేళవించి చేసిన వెజ్‌ ఫిష్‌ ఫ్రై వైరల్‌ కూడా అయింది. మొత్తమ్మీద ఈ చేపకాని చేపముక్కల్ని సైతం నిజమైన చేపల్లానే వేయిస్తున్నారు, కూర వండుతున్నారు, గ్రిల్‌ చేస్తున్నారు. నగ్గెట్స్, టిక్కీ, కబాబ్‌... ఇలా అన్ని రకాల స్నాక్‌ఫుడ్సూ తయారు చేసేస్తున్నారు. 

ఎందుకీ శాకాహారం?

వేగన్‌ చేపల పరిశ్రమ మొదలై ఎంతో కాలం కాకున్నా వీటి ఉత్పత్తులు మాత్రం అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాయి. దాంతో వేగన్‌ మాంసాన్ని రూపొందిస్తోన్న కంపెనీలతోపాటు ఇతర కంపెనీలు సైతం శాకాహార చేపలకోసం తమదైన పద్ధతుల్ని అవలంబిస్తున్నాయి. అహింస, నొవిష్, గుడ్‌ క్యాచ్, కులెయానా... ఇలా ఎన్నో కంపెనీలు వీటి తయారీలో ఉన్నాయి. అయితే కులెయానా కంపెనీ రూపొందించిన ట్యూనాలో కొజి అనే ఫంగస్, ఆల్గే, ముల్లంగి, వెదురు, బంగాళాదుంప కలిపి చేశారట. ఇందులో బి12, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్‌... వంటి పోషకాలన్నీ ట్యూనాలో ఉన్నట్లే ఉన్నాయట. అందుకే ఈ చేపల్ని బెస్ట్‌ ఇన్వెన్షన్లలో ఒకటిగా టైమ్‌ మేగజైన్‌ సైతం గుర్తించింది. దాంతో ఈ వేగన్‌ ఫిష్‌ పట్ల మాంసాహారులూ ఆసక్తి కనబరుస్తున్నారు. అదీగాక, సముద్ర చేప ఎంత రుచిగా ఉన్నా అందులోని మెర్క్యురీశాతం, మైక్రో ప్లాస్టిక్కుల కారణంగా వాటిని తినడంవల్ల అనారోగ్యంపాలూ అవుతున్నారు. కొందరికి అలర్జీలూ రావచ్చు. ఆ కారణంతో పుట్టుకొచ్చిందే సోఫీస్‌ కిచెన్‌ అనే వేగన్‌ ఫుడ్‌ కంపెనీ. చేపలు తిన్నప్పుడల్లా తన కూతురికి అలర్జీలు రావడంతో వేగన్‌ చేపల తయారీకి శ్రీకారం చుట్టాడు యూజీన్‌ వాంగ్‌. కారణమేదయితేనేం... రాబోయే పదేళ్లలో గ్లోబల్‌ ఫిష్‌ మార్కెట్‌లో శాకాహార చేపలదే 28 శాతం ఉంటుందని ‘ఫ్యూచర్‌ మార్కెట్స్‌ ఇన్‌సైట్స్‌’ అనే సంస్థ అంచనా.

చేపల్ని తినేవాళ్ల సంఖ్య పెరగడంతో కొన్ని రకాల చేపల సంఖ్య 75 శాతం తగ్గిపోయిందట. దీనివల్ల సముద్రాల్లోని ఆవరణ వ్యవస్థ సమతౌల్యమూ దెబ్బతింటోంది. అందుకే పర్యావరణ నిపుణులు సైతం దీనికి ప్రత్యామ్నాయం వేగన్‌ చేపలే అంటున్నారు. సో, వేగన్‌ ఫిష్‌తో అటు ఆరోగ్యమూ ఇటు పర్యావరణమూ రెండూ సురక్షితమేగా మరి! 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని