Published : 17 Sep 2022 23:49 IST

మాటలు చెప్పే లైట్లు ఇవి!

ఏ లైట్లయినా వెలుగునిస్తాయంతే కదా. కానీ ఇక్కడున్న ‘స్పీచ్‌ బబుల్‌ లైట్‌ బాక్స్‌’ లైట్లు మాత్రం అందుకు భిన్నం. చందమామా, మేఘమూ, నక్షత్రంలాంటి ఎన్నో ఆకారాల్లో ఉండే ఇవి స్విచ్‌ ఆన్‌ చేయగానే వెలిగిపోతాయి. అంతేనా... కావాలంటే మన మనసులోని మాటనూ అవతలివారికి చూపించేస్తాయి. ఎలాగంటే... వీటితో పాటూ వచ్చే మార్కర్లతో ఈ లైట్ల మీద నచ్చింది రాసుకోవచ్చు. పుట్టిన రోజులాంటి వేడుకలప్పుడో, మరేదైనా ప్రత్యేక సందర్భాల్లోనో ఈ లైట్ల మీద రాసి డెకరేషన్లో పెట్టొచ్చు. రోజూ బెడ్‌రూమ్‌లోనూ పెట్టుకుని లైట్ల మీద ఏదైనా సరదాగా రాయొచ్చు. తెలుపూ, పసుపూ, మల్టీ కలర్స్‌లో మెరిసిపోతూ ఆ పదాలు భలేగా కనిపిస్తాయి.


ఫోన్‌ కేసులోనే సెల్ఫీస్టిక్‌!

ఒకే వస్తువు ఎన్నో రకాలుగా ఉపయోగపడితే అది ఎవరికైనా నచ్చేస్తుంది, పైగా ఆ వస్తువు మనం ఎక్కువగా వాడేదైతే మరెంతో మెప్పించేస్తుంది. ఇక్కడున్న ‘త్రీ ఇన్‌ వన్‌ సెల్ఫీ స్టిక్‌ ఫోన్‌ కేస్‌ విత్‌ ఫోన్‌ హోల్డర్‌’ కూడా సరిగ్గా అలాంటిదే. ఫోన్‌ పాడవకుండా ఉండేందుకు వేసుకునే ఫోన్‌కేసులోనే సెల్ఫీస్టిక్‌ కూడా వస్తుంది. ఫోన్‌కేస్‌ వెనకాలో, పక్కనో ఉండే ఈ స్టిక్‌ను పైకి లాక్కోవచ్చు. ఇంకా దాన్నే ఫోన్‌ హోల్డర్‌లానూ వాడుకోవచ్చు.   దీన్ని మన ఫోన్‌కు వేసుకున్నామంటే... ఫొటో తీసుకోవాలనుకున్నప్పుడు విడిగా సెల్ఫీస్టిక్‌ లేకపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. ఎక్కువ సేపు ఫోన్‌ చూడాల్సి వచ్చినా హోల్డర్‌ ద్వారా చేయి నొప్పి లేకుండా చేసుకోవచ్చు. రకరకాల మోడళ్లలో అందుబాటులో ఉన్నాయివి.


డబ్బులు తినే కుక్క బొమ్మ!

ఈ కుక్క ఆకలి తీరాలంటే దాని ముందు నాణేలు వేయాల్సిందే. అలా వేస్తుంటే వాటిని ఇలా మాయం చేసేస్తుంది. కానీ మనం అడిగామంటే ఆ చిల్లర డబ్బులన్నింటినీ పొదుపు చేసి ఇచ్చేస్తుంది. ఏంటీ ఇదంతా అంటే... కుక్క బొమ్మతో ఉండే ‘డాగ్‌ ఈటింగ్‌ పిగ్గీ బ్యాంక్‌’ సంగతులు. పిల్లలకు పొదుపు అలవాటు చేయడానికి చాలామంది పిగ్గీబ్యాంక్‌ లాంటివి కొనిస్తుంటారు. ఆ డబ్బుల పెట్టె వెరైటీగా ఉంటే పిల్లల్ని మరింత ఆకట్టుకుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ పిగ్గీబ్యాంక్‌ వచ్చింది. బ్యాటరీలతో పనిచేసే ఈ పొదుపుడబ్బాలో పైనున్న గిన్నెలో చిల్లర డబ్బులు వేయగానే అందులోని సెన్సర్‌ పనిచేస్తుంది. కుక్కబొమ్మ అటూ ఇటూ కదులుతూ ఆకలితో ఆహారం తినేసినట్టుగా నాలుకతో నాణేన్ని డబ్బాలోకి పడేస్తుంది. వేసిన నాణేలన్నీ లోపలికి వెళ్లేవరకూ ఆ బొమ్మ అలా కదులుతూనే ఉంటుంది. చిన్నారులకు చూడ్డానికి ఇదంతా భలే సరదాగా అనిపిస్తుంది.


హ్యాండ్‌బ్యాగే బ్యాక్‌ప్యాక్‌లా...

కొన్నిడ్రెస్సుల మీదకు హ్యాండ్‌బ్యాగ్‌ బాగుంటే... మరికొన్నింటికి బ్యాక్‌ప్యాక్‌ సెట్‌ అవుతుంది. ఇలా చూడ్డానికే కాదు... అవసరాన్ని బట్టి కొన్నిసార్లు హ్యాండ్‌బ్యాగ్‌, ఇంకొన్నిసార్లు బ్యాక్‌ప్యాక్‌ సౌకర్యంగా అనిపిస్తుంటాయి. అందుకేనేమో ఒకే బ్యాగు రెండు రకాలుగా మార్చుకునేలా సరికొత్త ‘కన్‌వర్టబుల్‌ బ్యాక్‌ప్యాక్‌ బ్యాగ్స్‌’ వచ్చాయి. బ్యాగ్‌ హ్యాండిల్స్‌ చేతిలో పట్టుకునేందుకూ, బ్యాక్‌ప్యాక్‌లా వేసుకునేందుకూ కూడా వీలుగా ఉంటాయి. మనకు కావాల్సినట్టు మార్చుకుని ఎంచక్కా వాడుకోవచ్చు. ప్రయాణాల్లో ఎక్కువగా ఉపయోగపడే ఈ కన్‌వర్టబుల్‌ బ్యాగుల్లో ఎన్నెన్నో రకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts