కేకు... కోరుకున్నట్లు...

కేకుల్ని తయారు చేయడం, వాటిని అలంకరించడం ఓ కళ. అయితే, ఇందుకు బోలెడు సమయమూ, శ్రమా అవసరమనీ పైగా ఆ కేకుని అందంగా తీర్చిదిద్దడం ఇంకా కష్టమనీ ఆ పనిని వాయిదా వేసేస్తుంటారు చాలామంది.

Updated : 30 Oct 2022 05:14 IST

కేకు... కోరుకున్నట్లు...

కేకుల్ని తయారు చేయడం, వాటిని అలంకరించడం ఓ కళ. అయితే, ఇందుకు బోలెడు సమయమూ, శ్రమా అవసరమనీ పైగా ఆ కేకుని అందంగా తీర్చిదిద్దడం ఇంకా కష్టమనీ ఆ పనిని వాయిదా వేసేస్తుంటారు చాలామంది. కానీ, ఇకముందు అంత కష్టం అక్కర్లేదు. ఎలాంటి డిజైన్‌ కేకుని అయినా సులువుగా చేసేందుకు సిలికాన్‌ కేక్‌ మౌల్డ్స్‌ ఉపయోగపడుతున్నాయి. రకరకాల ఆకృతుల్లో దొరికే వీటిల్లో కేక్‌ తయారీ మిశ్రమాన్ని నింపి అవెన్‌లో బేక్‌ చేస్తే సరి. ఆ మౌల్డ్‌కి ఏ మాత్రం అంటుకోకుండానే కోరుకున్న డిజైన్‌లో కేక్‌ తయారైపోతుంది. దానిపైన ఐసింగ్‌ షుగర్‌, క్రీమ్‌ల వంటి వాటితో కేక్‌ ఆకృతికి తగ్గట్లు డ్రెస్సింగ్‌నీ ఇక సులువుగా చేసేయొచ్చు.


పిల్లలూ అవ్వొచ్చు ఆర్టిస్టులు!

ఏదైనా బొమ్మతో మహా అంటే ఓ అరగంట ఆడుకుంటారంతే ఏ పిల్లలైనా. అంతకన్నా ఎక్కువ వాళ్లకు సరదా ఇవ్వాలంటే మాత్రం ఆ ఆటలో కొత్తదనం ఉండాల్సిందే. అలా కోరుకునే చిన్నారుల కోసమే మార్కెట్లోకి ‘సూపర్‌ శాండ్‌ ఆర్ట్‌ కిట్స్‌’ పేరుతో ఆట బొమ్మలొచ్చాయి. సీˆసాలో రంగుల ఇసుక నింపుతూ ఓ చక్కని కళారూపాన్ని తీసుకొచ్చే ఆర్ట్‌ గురించి వినే ఉంటారుగా. ఇదీ అలాంటిదే కానీ... పిల్లలు చేయడానికి వీలుగా ఉంటుందీ ఆర్ట్‌ కిట్‌. రంగుల ఇసుక ప్యాకెట్లూ, అలంకరణ వస్తువులూ, రకరకాల బొమ్మల ఆకారాల్లో ఉన్న ప్లాస్టిక్‌ డబ్బాలూ, కీ చైైన్లూ వస్తాయి. వాటిల్లో మనకు నచ్చినట్టు ఒక్కో రంగు ఇసుకను పోస్తూ అందమైన బొమ్మగా చూపాలన్నమాట. పిల్లల్నీ కళాకారులుగా చేసే ఈ శాండ్‌ కిట్‌ భలే బాగుంది కదూ!


దారాన్ని ఇట్టే ఎక్కించొచ్చు!

పూలు గుచ్చడానికో, దుస్తులకు చిన్నచిన్న కుట్టుపనులు చేసుకోవడానికో... దాదాపు అందరి ఇళ్లల్లో సూదితో అవసరం ఉంటుంది. సూదిలో దారం దూర్చే పని చిన్నదే అయినా... కాస్త శ్రద్ధపెడితేనే ఆ సన్నని రంధ్రంలో సరిగ్గా దారాన్ని చొప్పించగలం. పెద్దవాళ్లకైతే కంటి సమస్యల వల్ల అదీ కుదరదు. అందుకే సూదిలో దారం పెట్టడానికే రకరకాల వస్తువులూ మార్కెట్లోకి వచ్చాయి. కానీ వాటి అవసరం లేకుండానే ‘సెల్ఫ్‌ త్రెడ్డింగ్‌ నీడిల్స్‌’తో అందుకు ఓ చక్కని పరిష్కారం దొరికింది. సూది సన్నని బెజ్జం దగ్గరే ప్రెస్సింగ్‌ సిస్టమ్‌ ఉంటుంది. దాన్ని నొక్కి సులువుగా దారం పెట్టేయొచ్చన్నమాట. చిన్న పిల్లలైనా దారాన్ని ఎక్కించేలా ఉన్న ఈ సూది బాగుంది కదూ. రకరకాల సైజుల్లో ఆన్‌లైన్లో దొరుకుతున్నాయి ఇవి.


ల్యాప్‌టాప్‌కీ ఓ ప్యాడ్‌!

ఉద్యోగులూ, విద్యార్థులూ గంటల తరబడి ల్యాప్‌టాప్‌తో పనిచేస్తున్నప్పుడు కూర్చునే విధానం సరిగా కుదరకపోవచ్చు. అలాగే ఎక్కువసేపు వాడుతున్నప్పుడు ల్యాప్‌టాప్‌ వేడిగా అవుతుంటే ఇబ్బందిగానూ ఉండొచ్చు. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేయాలనే ఉద్దేశంతో ‘ల్యాప్‌టాప్‌ కూలింగ్‌ ప్యాడ్‌’ వచ్చింది. ఇందులోని ఫ్యాన్‌తో ల్యాప్‌టాప్‌ను చల్లబరిచే ఈ వస్తువే- అడ్జస్టబుల్‌ స్టాండ్‌గానూ ఉపయోగపడుతుంది. మనం కూర్చున్నవిధానం, కుర్చీని బట్టి ల్యాపీ ఎత్తునూ నాలుగు రకాలుగా మార్చుకోవచ్చు. రకరకాల సైజుల్లో, వేరు వేరు ఫీచర్లతో ఈ కూలింగ్‌ ప్యాడ్స్‌ మార్కెట్లో దొరుకుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..