No Oil No Boil: ఆ హోటల్లో... వండకుండానే వడ్డిస్తారు!

ఇడ్లీ సాంబార్‌, అన్నం రసం, ఉప్మా, పొంగల్‌, బిర్యాని, వడ, పచ్చళ్లు, కట్‌లెట్‌లు, లడ్డూ... ఇలా ఆ రెస్టరంట్‌లో 2200 రకాల పదార్ధాలు చేస్తారు. కాకపోతే, వాటన్నింటినీ నిప్పూ నూనే ఉపయోగించకుండా తయారుచేస్తారు.

Updated : 10 Jul 2023 15:20 IST

ఇడ్లీ సాంబార్‌, అన్నం రసం, ఉప్మా, పొంగల్‌, బిర్యాని, వడ, పచ్చళ్లు, కట్‌లెట్‌లు, లడ్డూ... ఇలా ఆ రెస్టరంట్‌లో 2200 రకాల పదార్ధాలు చేస్తారు. కాకపోతే, వాటన్నింటినీ నిప్పూ నూనే ఉపయోగించకుండా తయారుచేస్తారు. అంటే ఉడికించడాలూ, వేయించడాలూ, తాలింపులూ లేకుండా... వేడి అన్నదే తగలకుండా చేస్తారన్నమాట. ‘ఇది సాధ్యమేనా?’ అని అనుమానిస్తే ‘మీరే వచ్చి చూడండి...’ అంటూ ఆ రెస్టరంట్‌ వంటగదికే తీసుకెళ్ళి మరీ చూపిస్తారు... ‘నో ఆయిల్‌ నో బాయిల్‌ రెస్టరంట్‌’ నిర్వాహకులు. అడగాలేకానీ... మీకూ వాటి తయారీని నేర్పిస్తారు!

బియ్యమూ మినప్పప్పూ రుబ్బుకుని, ఆ తడిపిండిని పులియబెట్టి, పులిసినపిండిని ఇడ్లీ అచ్చుల్లో ఉడకపెడితేకానీ మనకు ఇడ్లీలు రావు. కానీ, ఈ రెస్టరంట్‌లో ఇడ్లీలు అలా చేయరు. తెల్లబియ్యంతో చేసిన అటుకుల్ని పిండిగా మార్చుకుంటారు. కొబ్బరి పాలు పోసి బాగా కలుపుతారు. ఆ పిండిని ఇడ్లీ అచ్చులపైన పోస్తారు. ఆ అచ్చుల్ని పొయ్యిమీద పెట్టక్కర్లేకుండా... ఓ పది నిమిషాలు అలా ఉంచేస్తే చాలు. ఇడ్లీ రెడీ!

పప్పులేనిదే, పోపువేయనిదే మనం సాంబార్‌ని ఊహించలేం. ఇక్కడేమో కొబ్బరి పాలు, పచ్చి పసుపుకొమ్ము, టొమాటోలు, జీడిపప్పు పొడి, జీలకర్ర, తెల్లమిరియాలని మిక్సీపడితే చాలు... రుచికరమైన సాంబార్‌ సిద్ధమైపోతుంది. మరి అన్నం మాటేమిటీ అంటారా... బియ్యానికి బదులు అటుకుల్నే నానబెట్టి వాటికి కొబ్బరితురుమునీ, జీలకర్రనీ చేర్చి రుచికరంగా మనముందు ఉంచుతారు. అవసరాన్నిబట్టి దీన్నే టొమాటో రైస్‌గానూ, పులిహోరగానూ చేసిపెడతారు. అంతేకాదు, ఇక్కడ నూనె అక్కర్లేని రకరకాల వడలూ చేస్తున్నారు. ముందుగా బాదం, జీడిపప్పు, వేరుసెనగ పప్పుల్ని తీసుకుంటారు. దానికి కొబ్బరి తురుము, జీలకర్ర, మిరియాలూ, కొత్తిమీరల్ని చేరుస్తారు. ఆ మిశ్రమానికి అవసరమైతే గులాబీ రేకుల్నో, అరటి పువ్వునో కూడా కలిపి... మనం మామూలు వడల్ని నూనెలో వేయడానికి ముందు తడతాం కదా అలా 10 నిమిషాలపాటు తడుతూ ఉంటారు. తట్టేవాళ్ళ చేతిలోని వేడికి కొబ్బరి తురుము నుంచి సన్నగా నూనె వచ్చి ఈ ‘వడమిక్స్‌’ని అలముకుంటుంది.  కరకరలు లేకపోతేనేం... కమ్మగా ఉంటుంది! ఇవేకాదు పచ్చి పసుపుకొమ్ము లడ్డూలు, బీరకాయ శాండ్‌విచ్‌లు, పొట్లకాయ కట్లెట్‌లు, తమలపాకు చట్నీలు, కరివేపాకు పచ్చళ్ళు... ఇలా 2200 వెరైటీల్లో ఇక్కడ వంటకాలు చేస్తారు. ఉడికించడం ఉండదుకాబట్టి ఇవన్నీ పచ్చిగా మెండైన పోషకాలతో ఉంటాయి. నూనె అక్కర్లేదు కాబట్టి శరీరంలో హానికరమైన కొవ్వులు చేరతాయన్న భయమూ అక్కర్లేదు. మరి రుచి మాటో అంటారా? ఇక్కడ చేసే ఏ వంటకమూ పచ్చివాసన రాదు. అలా రాకుండా అన్ని కాయగూరల్నీ నిమ్మరసం, ఉప్పు కలిపిన నీటిలో నానబెడుతుంటారు. అలా వాటి సహజ రుచీ, పోషకాలూ పోకుండా ఎవరైనా తినగలిగేలా చేస్తున్నారు. ఇంతకీ- నిప్పూ నూనె తగలకుండా ఇంత పచ్చిగానే ఇక్కడ ఎందుకు వడ్డిస్తున్నారూ అంటే... ‘మన ఆరోగ్యం కోసమే’ అనంటారు ‘నో ఆయిల్‌ నో బాయిల్‌’ వ్యవస్థాపకుడు శివ.

అదెలాగంటే...

పండ్లు కాదు... వాటితోపాటూ పచ్చికాయ గూరలూ తినడం చాలా మంచిదని చెబుతుంటారు వైద్యనిపుణులు. కానీ ఆ పచ్చివాసనని భరిస్తూ ఎలా తినడం?’ ఇదే ప్రశ్న చాలా రోజులుగా శివనీ వేదిస్తుండేదట. ఆయన ఇదివరకు ఓ ప్రయివేటు సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తుండేవాడు. తమిళనాట ప్రకృతి వ్యవసాయం కోసం పోరాడిన నమ్మాళ్వార్‌ అన్న శాస్త్రవేత్త బోధనలపైన అతనికి మంచి గురి ఉండేదట. ఆయనోసారి ఓ విందుకెళితే అక్కడ నూనె, నిప్పూ వాడకుండా ఓ ఐదు వెరైటీలతో కూడిన భోజనం పెట్టారట. ఇదెలా చేయగలిగారని అడిగితే, తమిళనాడులోని కొన్ని ప్రకృతి వ్యవసాయ బృందాలు ఇలాంటి వంటకాలు తయారుచేస్తున్నట్లు చెప్పారట. ఆ బృందాల దగ్గరకి వెళ్ళి ఓ 15 వెరైటీలు నేర్చుకున్నాడు శివ. వాటిపైన పదేళ్ళపాటు ప్రయోగాలు చేస్తూ 2200 వంటకాలు తయారుచేశాడు. తమిళంలో నైవేద్యం అనే అర్థం వచ్చే ‘పడైయల్‌’ అన్న పేరుతో ఓ క్యాటరింగ్‌ అకాడమీని ఏర్పాటుచేశాడు. ఒక్క తమిళనాడు మాత్రమే కాకుండా దక్షిణాదిలోని పలు రాష్ట్రాలు తిరుగుతూ క్యాటరింగ్‌ విద్యార్థులకి దీన్ని నేర్పించసాగాడు. ఈ వెరైటీ తరగతులపైన మీడియా దృష్టి కూడా పడటంతో ‘250 మంది మహిళలతో మూడు నిమిషాల్లో 300 వంటకాలు’ చేయించి ప్రపంచ రికార్డు సాధించాడు. వాటిని సామాన్యులకీ చేరువచేయాలన్న లక్ష్యంతోనే తన స్వస్థలం కోయంబత్తూరులో ‘నో ఆయిల్‌ నో బాయిల్‌’ రెస్టరంట్‌ పెట్టి... మూడేళ్ళుగా విజయ వంతంగా నడుపుతున్నాడు. మనదేశంలో మూడుపూటలా ఇలాంటి ఆహారాన్ని వడ్డిస్తున్న రెస్టరంట్‌ ఇదొక్కటే మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..