కిచిడీ, ఇడ్లీ.. గోధుమ రవ్వతోనే!

మన వంటింట్లో చాలా అరుదుగా ఉపయోగించే వస్తువుల్లో గోధుమరవ్వ ఉంటే... దాంతో ఎక్కువగా ఉప్మానే చేసుకుంటాం తప్ప మరొకటి ప్రయత్నించం. ఈసారి ఆ ఉప్మాను పక్కన పెట్టేసి ఇలాంటి వంటకాలను చేస్తే  సరి...

Updated : 06 Feb 2022 00:00 IST

కిచిడీ, ఇడ్లీ.. గోధుమ రవ్వతోనే!

మన వంటింట్లో చాలా అరుదుగా ఉపయోగించే వస్తువుల్లో గోధుమరవ్వ ఉంటే... దాంతో ఎక్కువగా ఉప్మానే చేసుకుంటాం తప్ప మరొకటి ప్రయత్నించం. ఈసారి ఆ ఉప్మాను పక్కన పెట్టేసి ఇలాంటి వంటకాలను చేస్తే సరి... పిల్లలూ ఇష్టంగా తింటారు.


ఇడ్లీ

కావలసినవి: గోధుమరవ్వ: కప్పు, పెరుగు: ముప్పావుకప్పు, క్యారెట్‌ తురుము: పావుకప్పు, పచ్చిమిర్చి తరుగు: చెంచా, ఈనోసాల్ట్‌: ముప్పావుచెంచా, ఆవాలు: అరచెంచా, జీలకర్ర: అరచెంచా, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకురెబ్బలు: రెండు, జీడిపప్పు పలుకులు: కొన్ని, సెనగపప్పు: చెంచా, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, జీడిపప్పు పలుకులు, కరివేపాకు రెబ్బలు వేయాలి. ఇవన్నీ వేగాక గోధుమరవ్వను కూడా వేసి దోరగా వేయించి స్టౌ కట్టేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసి బాగా కలపాలి. ఇందులో తగినంత ఉప్పు, క్యారెట్‌ తురుము, పచ్చిమిర్చి తరుగు, ఈనోసాల్ట్‌ వేసి బాగా కలిపి మూత పెట్టాలి. అరగంటయ్యాక ఇడ్లీపిండిలా అయ్యేందుకు మరికాసిని నీళ్లు కలిపి అయిదు నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు ఇడ్లీరేకులకు నూనె లేదా నెయ్యి రాసి... వాటిల్లో ఈ పిండిని వేసి ఆవిరిమీద పావుగంట నుంచి ఇరవైనిమిషాలు ఉడికించి తీయాలి.


లడ్డు

కావలసినవి: నెయ్యి: అరకప్పు, బాదం -జీడిపప్పు-కిస్‌మిస్‌ పలుకులు: అన్నీ కలిపి పావుకప్పు, గోధుమరవ్వ: కప్పు, కొబ్బరి తురుము: ముప్పావుకప్పు, యాలకులపొడి: అరచెంచా, చక్కెర: కప్పు, గోరువెచ్చని పాలు: అరకప్పు.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి రవ్వను దోరగా వేయించుకుని తీసుకోవాలి. అదే విధంగా కొబ్బరి తురుమును కూడా వేయించుకుని విడిగా తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యి వేసి  జీడిపప్పు- కిస్‌మిస్‌- బాదం పలుకుల్ని వేయించుకుని స్టౌ కట్టేయాలి. రవ్వ చల్లగా అయ్యాక కొబ్బరి తురుముతో  కలిపి మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో చక్కెరపొడి, యాలకులపొడి, వేయించుకున్న బాదం-జీడిపప్పు-కిస్‌మిస్‌ పలుకులు వేసి బాగా కలపాలి. తరువాత పాలు చల్లుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి.


అడై

కావలసినవి: గోధుమరవ్వ: కప్పు, కందిపప్పు: పావుకప్పు, సెనగపప్పు: పావుకప్పు, ఎండుమిర్చి: మూడు, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉల్లిపాయలు: రెండు, క్యారెట్‌: ఒకటి (తురుముకోవాలి), క్యాబేజీ తరుగు: రెండు పెద్ద చెంచాలు, క్యాప్సికం: ఒకటి, ఉప్పు: తగినంత, నూనె: అరకప్పు.

తయారీ విధానం: గోధుమరవ్వను విడిగా, పప్పులూ ఎండు మిర్చిని కలిపీ నానబెట్టుకోవాలి. రెండు గంటలయ్యాక నానబెట్టుకున్న వాటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకుని తీసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసి బాగా కలిపి పావుగంట నాననివ్వాలి. తరువాత స్టౌమీద పెనం పెట్టి... ఈ పిండిని మందంగా అట్టులా వేసి... నూనె వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి.  


మసాలా కిచిడీ

కావలసినవి: గోధుమరవ్వ: ఒకటిన్నర కప్పు, పెసరపప్పు: పావుకప్పు, అల్లం తరుగు: అరచెంచా, లవంగాలు: రెండు, బిర్యానీఆకు: ఒకటి, యాలకులు: రెండు, ఎండుమిర్చి: రెండు, పచ్చిమిర్చి: రెండు, నెయ్యి: పావుకప్పు, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, పచ్చిబఠాణీ: అరకప్పు, క్యారెట్‌: ఒకటి, బంగాళాదుంపలు: రెండు, బీన్స్‌: అయిదు, ఉప్పు: తగినంత, పసుపు: అరచెంచా, కారం: పావుచెంచా.

తయారీ విధానం: కుక్కర్‌ని స్టౌమీద పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి,  లవంగాలు, బిర్యానీఆకు, యాలకులు వేసి వేయించి... పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేయాలి. నిమిషమయ్యాక కూరగాయముక్కలన్నీ వేసి బాగా వేయించాలి. ఇందులో తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి... పెసరపప్పు, గోధుమరవ్వ వేసి మూత పెట్టి నాలుగు కూతలు వచ్చాక స్టౌ కట్టేయాలి. వడ్డించేముందు దీనిపైన కొద్దిగా నెయ్యి వేస్తే చాలు, వేడివేడి మసాలా కిచిడీ సిద్ధం.


మురుకులు

కావలసినవి: బియ్యపురవ్వ: కప్పు, గోధుమరవ్వ: అరకప్పు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా, కారం: ఒకటిన్నర చెంచా, నువ్వులు: టేబుల్‌స్పూను.

తయారీ విధానం: ముందుగా గోధుమరవ్వను మెత్తని పొడిలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇందులో రెండు చెంచాల నూనె, మిగిలిన పదార్థాలు వేసి బాగా కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ మురుకుల పిండిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మురుకుల గొట్టంలో తీసుకుని కాగుతున్న నూనెలో మురుకుల్లా వత్తుకుని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండినీ చేసుకుంటే సరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..