తాతా బామ్మలకే ఈ యాత్రలు!

‘వయసులో ఉన్నప్పుడు ఒక్కసారైనా గోవాకు వెళ్లాలనుకునేవాడిని. అప్పుడేమో బాధ్యతలూ, ఉద్యోగంతో సరిపోయింది. ఇప్పుడేమో...ఒక్కడినే వెళ్తే మజా ఏముంటుందనిపిస్తుంది’..

Published : 14 Aug 2022 01:04 IST

తాతా బామ్మలకే ఈ యాత్రలు!

‘వయసులో ఉన్నప్పుడు ఒక్కసారైనా గోవాకు వెళ్లాలనుకునేవాడిని. అప్పుడేమో బాధ్యతలూ, ఉద్యోగంతో సరిపోయింది. ఇప్పుడేమో... ఒక్కడినే వెళ్తే మజా ఏముంటుందనిపిస్తుంది’... ‘సరదాగా నాలుగురోజులు ఎక్కడికైనా వెళ్లాలని ఉంది కానీ... తీసుకెళ్లేందుకు పిల్లలకు తీరిక లేదు.. ఒక్కదాన్నే వెళ్లేందుకు నాకేమో ధైర్యం సరిపోవడంలేదు’... అంటుంటారు కొందరు పెద్దవాళ్లు. అలాంటివాళ్లు ఇప్పుడు ఎటువంటి సందేహాలూ భయాలూ పెట్టుకోకుండా నచ్చిన ప్రాంతాన్ని చూసొచ్చేలా అన్నిరకాల ఏర్పాట్లూ చేసేస్తున్నాయి కొన్ని సంస్థలు. ఇంతకీ వాటి ప్రత్యేకత ఏంటంటే...

నిజానికి అసలైన జీవితం అనేది బాధ్యతలన్నీ తీరిపోయాక... అంటే... యాభైఏళ్ల తరువాతే మొదలవుతుందని అంటారు. దాన్ని అక్షరాలా నమ్మే ఈతరం సీనియర్‌ సిటిజన్లు తమ బాధ్యతలన్నీ తీరిపోయాక ‘కృష్ణా రామా’ అంటూ కాలం వెళ్లదీయకుండా, మనవళ్లతో గడుపుతూ నాలుగ్గోడలకే పరిమితం కాకుండా తమకు నచ్చిన పనులు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు చూడాలనుకుని... రకరకాల కారణాల వల్ల వాయిదా వేసుకున్న ప్రాంతాలను ఇప్పుడు చూసొచ్చేందుకు రెడీ అవుతున్నారు. వాళ్ల ఆసక్తికి తగినట్లుగానే కొన్ని సంస్థలు కేవలం సీనియర్‌ సిటిజన్ల కోసమే విహారయాత్రలను ఏర్పాటు చేస్తున్నాయిప్పుడు. నిజానికి కొన్ని ట్రావెల్‌ ఏజెన్సీలు.. నాలుగు రోజులు లేదా వారం చొప్పున తీర్థయాత్రల పేరుతో తిరుపతి, శిరిడి, కాశీ.. లాంటివాటికి ఇప్పటికీ తీసుకెళ్తుంటాయి. వాటికీ వీటికీ తేడా ఏముంటుందీ అంటే... చాలానే ఉంటుంది అంటున్నాయి ఈ సంస్థలు.

అవసరాలకు తగిన ఏర్పాట్లు...

పెద్దవాళ్లు అనగానే కేవలం ఆధ్యాత్మిక యాత్రలే చేయాలనే నియమమేమీ లేదు. అందుకే వాళ్లకు నచ్చినట్లుగా అటు తీర్థయాత్రలతోపాటూ... ఇటు ఒకప్పుడు చూడాలనుకుని చూడలేకపోయిన గోవా, నేపాల్‌, మలేషియా, స్విట్జర్లాండ్‌.... లాంటి ప్రాంతాలకూ తీసుకెళ్తాయి ఈ సంస్థలు. సాధారణంగా ఈ సంస్థలు తాము నిర్వహించే యాత్రలూ, ప్రయాణం తాలూకు వివరాలూ, అక్కడ చూపించే ప్రాంతాలూ, అయ్యే ఖర్చు... వంటి వివరాలన్నింటినీ తమ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు పెడుతుంటాయి. దాన్ని బట్టి నచ్చినదాన్ని ఎంచుకుని ఆ డబ్బులు కట్టేస్తే సరిపోతుంది. కానీ అక్కడితోనే ఆగిపోకుండా కస్టమైజేషన్‌ తరహాలో ఔత్సాహికులు ఎవరైనా ఓ బృందంగా ఏర్పడి తాము చూడాలనుకున్న ప్రాంతానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తే అక్కడికీ తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసే సంస్థలూ ఉన్నాయి. అదేవిధంగా ఆ వెబ్‌సైట్‌లలో మెంబర్‌షిప్‌ తీసుకునేవారికి... విడతలవారీగా డబ్బు చెల్లించే సదుపాయం కూడా ఉంటుంది. ఒకసారి ఏదయినా యాత్రను బుక్‌ చేసుకున్నాక... ఎయిర్‌పోర్ట్‌ లేదా రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ఇంటికే వాహనం వస్తుంది. యాత్ర అయ్యాక కూడా... ఇంటిదగ్గర దింపేవరకూ సంస్థే బాధ్యత తీసుకుంటుంది. ఇక యాత్రికులంతా పెద్దవాళ్లే కాబట్టి వాళ్ల అవసరాలకు తగినట్లుగా సీనియర్‌ సిటిజన్‌ ఫ్రెండ్లీ హోటళ్లలో బసను ఏర్పాటు చేస్తారు. వాళ్లకు తగినట్లుగా డయాబెటిక్‌ మెనూ, తక్కువ నూనెతో వంటకాలు... ఉండేలా చూస్తారు. వీళ్లకోసం ఏర్పాటు చేసే వాహనాల విషయంలోనూ అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటాయి ఈ సంస్థలు. వైద్యసాయం అవసరమైతే... వెంటనే చికిత్స చేసేందుకు వీలుగా స్థానిక ఆసుపత్రులూ, డాక్టర్లతో అనుసంధానమై ఉంటాయివి.

అదేవిధంగా వెళ్లే బృందాన్ని బట్టి ఒకరిద్దరు కేర్‌టేకర్లు కూడా ఇరవైనాలుగ్గంటలూ వీళ్లకు అందుబాటులో ఉంటారు. అన్నింటినీ మించి... కేవలం ఆ ప్రాంతాలను ఏదో సైట్‌సీయింగ్‌ పద్ధతిలో చూపించి తీసుకొచ్చేయకుండా  అక్కడికి వెళ్లే నాలుగైదు రోజులు.. ఎన్నో మధురజ్ఞాపకాలను సొంతం చేసుకునే విధంగా ఆల్‌టెరైన్‌ వెహికల్‌ రైడ్‌, రివర్‌ ర్యాఫ్టింగ్‌, మంచుకొండల్ని ఎక్కడం... వంటి సాహసాలనూ చేసేలా ప్రోత్సహిస్తాయీ సంస్థలు. ఇలాంటి యాత్రలు ఏర్పాటు చేసే సంస్థల్లో ఫుర్‌, 50 ప్లస్‌ వొయేజర్స్‌, బంక్‌ ట్రైబ్‌, గోల్డెన్‌ ఏజెర్స్‌, సీనియర్‌ హాలిడేస్‌... వంటివెన్నో ఉన్నాయి. వీటి సాయంతో కాస్త ఓపిక ఉన్నప్పుడే... మీకు నచ్చిన ప్రాంతాన్ని చూసొచ్చేయండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..