ఆభరణాలకూ... ఓ అల్మారా!

అల్మారాల్లో బట్టలతోపాటూ నగల్నీ పెట్టుకోవడం అందరూ చేసేదే అయినా... అవేవీ లేకుండా కేవలం నగలు మాత్రమే విడిగా కనిపించేలా సర్దుకుంటే ఎంత బాగుంటుందోనని

Published : 13 Mar 2022 01:07 IST

ఆభరణాలకూ... ఓ అల్మారా!


అల్మారాల్లో బట్టలతోపాటూ నగల్నీ పెట్టుకోవడం అందరూ చేసేదే అయినా... అవేవీ లేకుండా కేవలం నగలు మాత్రమే విడిగా కనిపించేలా సర్దుకుంటే ఎంత బాగుంటుందోనని అనుకుంటుంటే వాటికోసమే తయారుచేసిన ఈ అల్మారాలను ఎంచుకుంటే సరి. జ్యువెలరీ బాక్సుల్లో ఇప్పుడు కొత్తగా వస్తున్నాయివి మరి.

స్నేహితులతో సరదాగా షాపింగ్‌కి వెళ్లినప్పుడు బాగున్నాయని రెండు జతల జుంకాలు తీసుకోవడం... సందర్భానికి తగినట్లుగా కొత్త డ్రెస్‌ కొనుక్కుంటున్నప్పుడు దానికి మ్యాచింగ్‌గా హ్యాంగింగ్స్‌, నెక్లెస్‌, బ్రేస్‌లెట్‌... లాంటివి ఎంచుకోవడం ఈ రోజుల్లో చాలామంది చేసేదే. దాంతో హ్యాంగింగ్స్‌ అనీ, స్టడ్స్‌ అనీ, హూప్స్‌ అనీ... ఇలా చెవులకు పెట్టుకునే రకాలే బోలెడు చేరిపోతాయి. ఇక గాజులూ, బ్రేస్‌లెట్లూ, కాక్‌టెయిల్‌ రింగ్స్‌, హెయిర్‌క్లిప్స్‌, వాచీలూ, మెడలో వేసుకునే చెయిన్లూ, ఇతర హారాల గురించీ చెప్పక్కర్లేదు. వీటిల్లో ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కునే బంగారంతో చేసినవే కాకపోయినా యాక్సెసరీలను డ్రెసింగ్‌ టేబుల్‌సొరుగులో పడేస్తే... అన్నీ కలిసిపోయి సమయానికి ఒక్కటీ సరిగ్గా కనిపించదు. పోనీ నగల పెట్టెలోనో, ఏదయినా
డబ్బాలాంటిదాన్లోనో పెడదామనుకుంటే అన్నీ పట్టవు. మరెలా అనుకునేవారికోసమే ఈ ‘నగల బీరువాలు’.  

అరలవారీగా...
లక్షలు పెట్టి కొనుక్కునే వడ్డాణాలూ హారాల నుంచి రోజువారీ వేసుకునే గాజులూ గొలుసుల దాకా అన్నిరకాలనూ ఈ బీరువాల్లో సర్దేసుకోవచ్చు. వీటిలో పెట్టుకుంటే కలిసిపోవా మరీ అంటే కలిసిపోవు. ఎందుకంటే... ఒక బట్టల బీరువాలో చీరలూ, డ్రెస్‌లూ, చున్నీలూ, తదితరాల్ని వేటికవే విడివిడిగా ఎలా సర్దుకుంటామో వీటిలోనూ చెయిన్లూ, చెవులకు పెట్టుకునేవీ, బ్రేస్‌లెట్లూ, వాచీలూ.. ఇలా అన్నింటినీ విడిగా అరల వారీగా పెట్టుకోవచ్చు. అంటే... కమ్మలూ, హ్యాంగింగ్స్‌ పెట్టుకునేందుకు వీలుగా ఒక అర, గొలుసులన్నీ చిక్కుబడిపోకుండా వరుసగా వేలాడదీసుకునేందుకు హుక్కులూ, ఉంగరాలు సర్దుకునేందుకు ఓ సొరుగూ, బ్రాస్‌లెట్లూ గాజుల్లాంటివి వేసుకునేందుకు మరొకటి.. ఇలా ఎన్నో అరలు ఉంటాయి.  పైగా ఈ బీరువాలకు గాజు తలుపులు కూడా ఉంటాయి కాబట్టి ఏవి ఎక్కడ పెట్టామోనని వెతుక్కోకుండా అన్నీ ఎదురుగానే కనిపిస్తూ టక్కున తీసుకునేలా ఉంటాయి. వీటిల్లో కొన్నింటికైతే అద్దం కూడా ఉండటం అదనపు ఆకర్షణ. ఒక్కమాటలో చెప్పాలంటే రకరకాల డిజైన్లలో వచ్చేస్తున్న ఈ బుల్లి బీరువాల్లో నచ్చినదాన్ని కొనుక్కుంటే యాక్సెసరీలన్నీ అందులో సర్దుకోవడానికి ఎంతోసేపు పట్టదు.  బాగున్నాయా మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..